
సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్
కులగణన అంశంలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పష్టీకరణ
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేసిందన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే... ప్రభుత్వ పథకాలకు వర్తింపజేసే ప్రక్రియ మొదలుపెట్టిందని వెల్లడి
జాతీయ కులగణనలో తెలంగాణ విధానాన్ని అనుసరించాలని సీడబ్ల్యూసీ తీర్మానం
మమ్మల్ని చూసే కేంద్రం ముందుకు వచ్చిందన్న సీఎం రేవంత్
ఢిల్లీలో జరిగిన భేటీకి ఖర్గే, రాహుల్, ప్రియాంక తదితరుల హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో త్వరలో చేపట్టనున్న జనగణనలో కులగణనను చేర్చాలన్న కేంద్ర నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ అద్వితీయ పోరాటం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తన భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి చూపించిందని, దేశానికే మార్గదర్శిగా నిలిచిందని కొనియాడింది. తెలంగాణలో అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి పారదర్శకంగా నిర్వహించిన కులగణన నమూనానే కేంద్రం అనుసరించాలని తీర్మానించింది.
దేశంలోని అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ అంశాల్లో న్యాయం చేసేలా జనగణనను ఎప్పట్లోగా పూర్తి చేస్తుందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేసింది. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీ అక్బర్ రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాం«దీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కమిటీ సభ్యులు దామోదర రాజనరసింహ, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ప్రధానంగా కులగణన, పహల్గాం ఉగ్రదాడిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు.
కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలి: ఖర్గే
రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర మొదలు, మొన్నటి లోక్‌సభ ఎన్నికల వరకు ఇదే అంశాన్ని ముందుపెట్టి కాంగ్రెస్ పార్టీ పోరాడిందని ఖర్గే చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన పూర్తి చేసి ప్రభుత్వ పథకాల్లో అమలు చేసే ప్రక్రియను సైతం మొదలు పెట్టిందని ప్రశంసించారు. ప్రజల సమస్యలను నిజాయితీగా లేవనెత్తితే, ఎన్డీఏ వంటి మొండి ప్రభుత్వాలు తలవంచాల్సిందేనని రాహుల్‌గాంధీ నిరూపించారని అన్నారు. అయితే కులగణన సమస్యను ఒక మంచి ముగింపు వచ్చేంత వరకు కాంగ్రెస్ నేతలంతా అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఇదే అంశంపై చేసిన తీర్మానంలోనూ తెలంగాణ అంశాన్ని సీడబ్ల్యూసీ ప్రస్తావించింది.
తెలంగాణ నమూనాను కేంద్రం అనుసరించాలి
‘తెలంగాణలో కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పాటించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన అవసరం ఉందని సీడబ్ల్యూసీ భావిస్తోంది. తెలంగాణలో కుల సర్వే రూపకల్పన పూర్తిగా పౌర సమాజం, సామాజికవేత్తలు, నాయకుల క్రియాశీల ప్రమేయంతో.. సంప్రదింపులు, పారదర్శక ప్రక్రియ ద్వారా జరిగింది. ఈ సర్వే పూర్తిగా బ్యూరోక్రాటిక్ విధానంలో కాకుండా ప్రజల పరిశీలన నుంచి వచ్చింది.
అందువల్ల జాతీయ స్థాయి కులగణన కోసం తెలంగాణ పాటించిన విధానాన్ని అనుసరించాలని సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది. కేంద్రం విశ్వసనీయమైన, శాస్త్రీయమైన, భాగస్వామ్య నమూనాను రూపొందించేందుకు వీలుగా మా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. సంప్రదింపులు, జవాబుదారీతనం సమ్మిళితత్వంతో విలువలను ప్రతిబింబించే చట్రాన్ని రూపొందించడంలో సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం..’అని సీడబ్ల్యూసీ తన తీర్మానంలో పేర్కొంది.
జాప్యం వద్దు..పారదర్శకంగా జరగాలి
‘కులగణన ప్రక్రియలో జాప్యం చేయకూడదు. అన్ని రాజకీయ పార్టీలను పూర్తి విశ్వాసంలోకి తీసుకోవాలి. ఈ అంశంపై పార్లమెంట్‌లో వెంటనే చర్చ జరపాలి. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులను కేటాయించి, జనాభా లెక్కల ప్రతి దశకు నిర్దిష్టమైన సమయాన్ని ప్రకటించాలి. కులగణన వివరాల నమోదు ప్రక్రియ పూర్తి సమగ్రంగా, పారదర్శకంగా ఉండేలా చూడాలి. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలకు, విద్యా, ఉపాధి అవకాశాలకు ఈ కులగణనే ప్రాతిపదికగా ఉండాలి. కుల గణన సరిగ్గా జరిగి అమలైతే సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది..’అని తీర్మానంలో స్పష్టం చేసింది.
పూర్తి పారదర్శకతతో నిర్వహించాం: సీఎం రేవంత్
తెలంగాణలో కులగణన జరిగిన తీరును సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. కచ్చితత్వంతో, పూర్తి పారదర్శకంగా కులగణన నిర్వహించామని తెలిపారు. ‘బీసీల జనాభా గతం కన్నా 6 శాతం మేర పెరిగింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి, దానిని పార్లమెంట్ ఆమోదానికి పంపించాం. విద్య, ఉద్యోగం, ఉపాధి, నిధుల కేటాయింపుల్లో ఓబీసీ, ఆదివాసీ, దళితులు, మైనార్టిలకు ప్రయోజనం చేకూరేలా ఇకపై ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.
కులగణనతో ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని చూసే కేంద్రం కూడా కులగణన చేసేందుకు ముందుకొచ్చింది. దీనిపై రాష్ట్రంలోని నిమ్న వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి..’అని సీఎం తెలిపారు. రేవంత్, దామోదరకు అభినందనలు కులగణన ప్రక్రియలో చేసిన శ్రమ, అమలులో చూపిన చొరవపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదరలను సీడబ్ల్యూసీ కీలక నేతలు అభినందించారు.