
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44పై మన్నూర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రంలోని నౌవాడకు చెందిన దీపక్ (25), మిత్రుడు నితీశ్ ఇద్దరు కలిసి హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్‌పై నాగ్‌పూర్‌వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని మన్నూర్ జాతీయ రహదారి పక్కన నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ప్రమాదంలో దీపక్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన నితీశ్‌ను పోలీసులు అంబులెన్సులో రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.