చేపల వల చుట్టుకొని జాలరి మృతి | - | Sakshi
Sakshi News home page

చేపల వల చుట్టుకొని జాలరి మృతి

Published Sun, May 4 2025 6:29 AM | Last Updated on Sun, May 4 2025 6:35 AM

సోన్‌: చేపల వేటకు వెళ్లి వల చుట్టుకుని జాలరి మృతి చెందిన ఘటన గాంధీనగర్‌ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గాంధీనగర్‌ గ్రామానికి చెందిన సాలోకె బసవరాజ్‌ (47) శుక్రవారం రోజూ మాదిరి తెప్ప తీసుకుని చేపలు పట్టడానికి శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులోకి వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ఆరా తీశారు. ఈక్రమంలో శనివారం ప్రాజెక్టు నీళ్లలో కాళ్లకు చేపల వల చుట్టుకొని ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. బసవరాజ్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కే.గోపి తెలిపారు. బసవరాజ్‌కు ఒక కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు.

జంట ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని సీసీఐ టౌన్‌షిప్‌లో ఓ జంట గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలం గడ్‌చందాకు చెందిన ఓ యువతి, బాలరాజు ఇదివరకే ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్‌లో బాలరాజు పెళ్లికి నిరాకరించగా లోకేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలరాజును రిమాండ్‌కు తరలించారు. నెల రోజులపాటు జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇదిలా ఉండగా ఆ యువతికి నాలుగు రోజల క్రితం మామడ మండలం బండల ఖానాపూర్‌కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. శనివారం తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వెళ్లే క్రమంలో నిర్మల్‌ పట్టణానికి చేరుకున్నాక తనకు పని ఉందని కొద్దిసేపు ఇక్కడే ఉండమని భర్తకు చెప్పి అక్కడి నుంచి ప్రియుడితో కలిసి ఆదిలాబాద్‌కు వచ్చింది. పట్టణంలోని సీసీఐ టౌన్‌షిప్‌లో సాయంత్రం నాలుగు గంటలకు వెంట తెచ్చుకున్న గడ్డిమందును ఇద్దరు కలిసి తాగారు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది వారిని గమనించి 108లో రిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై వన్‌టౌన్‌ సీఐ సునీల్‌కుమార్‌ను సంప్రదించగా.. జంట ఆత్మహత్యకు యత్నించగా రిమ్స్‌లో చేర్పించినట్లు పేర్కొన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు.

‘దేశవ్యాప్త సమ్మెతో కేంద్రానికి గుణపాఠం చెప్పాలి’

రెబ్బెన(ఆసిఫాబాద్‌): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేలా ఈనెల 20న జరగబోయే సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అంబాల ఓదెలు, రాజశేఖర్‌లు పిలుపునిచ్చారు. శనివారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో ఇన్‌చార్జి జీఎం నరేందర్‌కు సమ్మె నోటీసు అందజేశారు. వారు మాట్లాడుతూ కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్స్‌గా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా తయారు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న దేశ వ్యాప్త సమ్మెకు జేఏసీ పిలుపునిచ్చిందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లు అమలైతే కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కు కోల్పోతారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే నెల రోజుల్లోనే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామని చెప్పి పట్టించుకోవడం లేదన్నారు. నాయకులు ధన్‌రాజ్‌, గోపాల్‌, ప్రభాకర్‌, కాంట్రాక్టు కార్మికులు శారద, అనిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement