
న్యూఢిల్లీ: యూరోపియన్ దేశాలపై భారత విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ధ్వజమెత్తారు జైశంంకర్. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. భారతదేశానికి భాగస్వాములు కావాలని, అంతే కానీ బోధకులు అవసరం లేదని చురకలంటిచారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగిన ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐస్లాండ్ మాజీ అధ్యక్షుడు గ్రిమ్సన్ తదితరులతో జరిగిన చర్చావేదికలో యూరప్ తీరును జైశంకర్ బహిర్గతం చేశారు. యూరప్ దేశాల నుంచి భారత్ ఏం కోరుకుంటుదని అడిగిన ప్రశ్నలో భాగంగా జై శంకర్ఇలా సమాధానమిచ్చారు. ‘మనం ప్రపంచాన్ని చూసినప్పుడు, భాగస్వాముల కోసం చూస్తాం. ముఖ్యంగా కొన్ని విదేశాలు చాలా బోధనలు చేస్తారు, వాటిని సొంత దేశంలో ఆచరించరు. కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ ఈ సమస్యతో పోరాడుతున్నాయని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు.
ఇప్పుడు యూరప్ దేశాలు వాస్తవిక వైపు అడుగులు వేయగలరా లేదా అనేది చూడాలి. మనం భాగస్వామ్యాన్ని చేసుకోవాలంటే, కొంత అవగాహన ఉండాలి, కొంత సున్నితత్వం ఉండాలి, పరస్పర ప్రయోజనాల పట్ల అవగాహ ఉండాలి, ప్రపంచం ఎలా పనిచేస్తుందో గ్రహించాలి, ఈ విషయంలో కొన్ని యూరప్ దేశాలు సమర్థవంతంగా ఉండగా, మరికొన్ని వెనుకబడి ఉన్నాయన్నారు.
గతంలో కూడా యూరప్ దేశాల తీరుపై జైశంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి సమస్యల్ని ప్రపంచ సమస్యలుగా చూపిస్తారని, ప్రపంచ సమస్యల్ని మాత్రం వారు పట్టించుకోరంటూ వ్యాఖ్యలు చేశారు.