
100 పర్సంటైల్ సాధించిన టాప్ 24లో నలుగురు మనోళ్లే
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా వారిలో నలుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బనిబ్రత మజీతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ 100 పర్సంటైల్ సాధించారు. అలాగే టాప్–100 ర్యాంకుల్లో 15 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. 99 పర్సంటైల్‌లో వంద మందికిపైగా చోటు సాధించారు.

జేఈఈ మెయిన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. రాజస్తాన్‌కు చెందిన ఎండీ అనాస్, ఆయుష్ సింగల్ తొలి రెండు ర్యాంకులు సాధించారు. జేఈఈ మొదటి విడత పరీక్ష జనవరిలో జరిగింది. రెండో సెషన్‌ను ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 10,61,849 మంది ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 9,92,350 మంది పరీక్ష రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మొదటి, రెండో విడత పరీక్ష ఫలితాలను ఆధారంగా చేసుకొని ర్యాంకులు ప్రకటించారు. వాటి ల్లో 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. ఈ పరీక్షకు ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2న పరీక్ష ఉంటుంది.