
క్యూ4లో 26 శాతం జంప్
ఆదాయం రూ. 22,504 కోట్లు
క్యూ1 ఆదాయ అంచనాలు వీక్
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం విప్రో గతేడాది(2024–25) చివరి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 26 శాతం జంప్‌చేసి రూ. 3,570 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,835 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 22,504 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 22,208 కోట్ల టర్నోవర్ సాధించింది. త్రైమాసిక(క్యూ3)వారీగా చూస్తే నికర లాభం 6% పుంజుకోగా.. ఆదాయం 1% బలపడింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి వి ప్రో నికర లాభం 19% ఎగసి రూ. 13,135 కోట్లను అధిగమించగా.. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర క్షీణతతో రూ. 89,088 కోట్లను తాకింది.
అనిశ్చితుల ఎఫెక్ట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో ఆదాయం 1.5–3.5% క్షీణించవచ్చని విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి ఏప్రిల్–జూన్ (క్యూ1)లో ఐటీ సర్వీసుల బిజినెస్ నుంచి 250.5–255.7 కోట్ల డాలర్ల మధ్య నమోదుకావచ్చని గైడెన్స్ ప్రకటించింది. త్రైమాసికవారీగా వేసిన అంచనాలివి. ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో ఐటీ అదాయం మందగించవచ్చని అభిప్రాయపడింది. ప్రణాళికల ప్రకారం గతేడాది 10,000 మందికి ఉపాధి కల్పించింది.
మెగా డీల్స్‌తో...
స్థూలఆర్థిక అనిశ్చితుల కారణంగా క్లయింట్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. అయితే నిలకడ, లాభాల్లో వృద్ధిని కొనసాగించే బాటలో క్లయింట్ల అవసరాలపై దృష్టిపెట్టి సాగుతున్నట్లు తెలియజేశారు. ఇటీవలి టారిఫ్ ప్రకటనలు ప్రపంచ అనిశ్చితులను మరింత పెంచుతున్నట్లు అభిప్రాయపడ్డారు. గతేడాది కుదుర్చుకున్న రెండు మెగా డీల్స్‌తో భారీ కాంట్రాక్ట్ బుకింగ్స్ మెరుగుపడినట్లు తెలియజేశారు. కన్సల్టింగ్, ఏఐ సామర్థ్యాలను పటిష్టపరచుకోవడంతోపాటు గ్లోబల్ టాలెంట్‌పై పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. అంతకుముందు విప్రో షేరు బీఎస్‌ఈలో 1.4 శాతం లాభంతో రూ. 248 వద్ద ముగిసింది.
ఇతర విశేషాలు...
→ విప్రో మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,614 నుంచి 2,33,346కు బలపడింది.
→ క్యూ4లో 13% అధికంగా 395.5 కోట్ల డాలర్ల బుకింగ్స్ సాధించింది.
→ భారీ డీల్స్ బుకింగ్స్ 49% ఎగసి 176.3 కోట్ల డాలర్లకు చేరాయి.
→ క్యూ4లో ఐటీ సర్వీసుల నిర్వహణ మార్జిన్ 17.5%గా నమోదైంది.
→ పూర్తి ఏడాదికి 5.4 బిలియన్ డాలర్ల భారీ డీల్ బుకింగ్స్‌తో కలిపి 14.3 బిలియన్ డాలర్లను తాకాయి.
→ నిర్వహణ మార్జిన్లు క్యూ4లో 1.1%, పూర్తి ఏడాదికి 0.9% చొప్పున పుంజుకున్నాయి.