
కష్టపడితే సాధించలేనిది లేదు అని కొందరు చెబుతారు, మరికొందరు నిరూపిస్తారు. అలా నిరూపించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి, దివంగత పారిశ్రామిక వేత్త 'ధీరూభాయ్ అంబానీ' ఒకరు. గుజరాత్‌లోని జునాఘడ్ జిల్లాలోని.. చోర్వాడ గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఈయన, అంత గొప్ప పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు?, ఆయన మరణించే సమయానికి ఆయన సంపద ఎంత?, కుమారులకు ఇచ్చిన ఆస్తులు ఏమిటి అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
రూ.300 జీతానికి
సాధారణ కుటుంబంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ.. ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చదువును అర్ధాంతరంగా నిలిపివేసి యెమెన్‌కు వెళ్లి అక్కడ పెట్రోల్ పంప్‌లో రూ. 300 జీతానికి పనిచేయడం మొదలుపెట్టారు. నిజాయితీగా పనిచేస్తూ.. అతి తక్కువ కాలంలోనే అక్కడే మేనేజర్ అయ్యారు. కొన్నేళ్ల తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చేసారు.
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత.. ధీరూభాయ్ అంబానీ ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు. వస్త్రాల వ్యాపారంతో మొదలైన ఈయన ప్రయాణం.. ఆ తరువాత పెట్రోకెమికల్స్, టెలికాం మొదలైన రంగాలవైపు సాగింది. ఆ తరువాత రిలయన్స్ ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది.
ప్రపంచంలో 138వ ధనవంతుడిగా
రిలయన్స్ సంస్థ ఓ పెద్ద సామ్రాజ్యంగా ఎదిగిన తరువాత.. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించారు. అప్పటికి ఈయన సంపద ఎంత అనేదానికి సంబంధించిన గణాంకాలు అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ ఫోర్బ్స్ ప్రకారం.. ఆయన మరణించే సమయానికి, ప్రపంచంలో 138వ ధనవంతుడిగా ఉన్నట్లు.. ఆయన వ్యక్తిగత నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (నేటి భారత కరెన్సీ ప్రకారం రూ. 24000 కోట్లు) అని సమాచారం. కాగా రిలయన్స్ విలువ రూ. 60,000 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ లక్షల కోట్లు.
ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి.. రిచ్‌డాడ్ పూర్ డాడ్ రచయిత
వారసులకు ఏమిచ్చారు?
ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, అధికారిక వీలునామా లేకపోవడంతో గ్రూప్ భవిష్యత్తు నాయకత్వం గురించి అనిశ్చితి ఏర్పడింది. ఆ సమయంలోనే ఆయన ఇద్దరు కుమారులు ఆస్తులను పంచుకున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో వారి తల్లి కోకిలాబెన్ అంబానీ మధ్యవర్తిత్వం వహించారు.
ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)ను తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, తరువాత టెలికాం ఉన్నాయి. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ మొదలైనవి తీసుకున్నారు.