
అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే సిట్ దర్యాప్తు
తప్పుడు సాక్ష్యాలే ప్రాతిపదికగా ప్రశ్నలు
దర్యాప్తులో సిట్ సాధించినది శూన్యం
ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు
వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలతోనే ప్రశ్నలు
అసలు మద్యం కుంభకోణమే జరగలేదని.. ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని సిట్‌కు వివరించిన ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, అమరావతి: కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ అక్రమ కేసుల పరిస్థితి. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో నియమించిన సిట్ దర్యాప్తులోనే ఆ కేసుల డొల్లతనం బట్టబయలైంది. తాము బెదిరించి.. వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తోందన్నది నిగ్గు తేలింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన తప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించిన తీరే అందుకు నిదర్శనం.
కేవలం గాలి పోగేసి నిరాధార ఆరోపణలతోనే ఈ కేసు కేసు పెట్టారన్నది స్పష్టమైంది. న్యాయస్థానం ఆదేశాలతో తన న్యాయవాదితో కలిసి మిథున్‌రెడ్డి శనివారం ఉదయం 10.30 గంటలకు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6.30 వరకు న్యాయవాది సమక్షంలో ఆయనను రెండు దఫాలుగా సిట్ అధికారులు విచారించారు. కేవలం తాము వెంటాడి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ప్రాతిపదికనే ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించడం ఈ కేసులో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. అసలు కుంభకోణమే లేనప్పుడు దర్యాప్తు అధికారులు చేయగలిగేదీ ఏమీ ఉండదని తేలిపోయింది.
అబద్ధపు వాంగ్మూలాలే సిట్‌కు ఆధారం
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. దర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు తాము వెంటాడి వేధించి నమోదు చేయించిన అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే మిథున్‌రెడ్డిని ప్రశి్నంచారు. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్‌లను వేధించి బలవంతంగా తీసుకున్న అబద్ధపు వాంగ్మూలాలు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగానే ప్రశ్నలు వేయడం గమనార్హం.
తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వేధిస్తున్నారని, కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారంటూ వాసుదేవరెడ్డి మూడు సార్లు కోర్టుకెళ్లినా.. ఆయనను బెంబేలెత్తేలా చేసి, సిట్ అధికారులు అబద్ధపు వాంగ్మూలంపై సంతకం తీసుకున్నారు. అదే వాంగ్మూలంలోని అంశాల గురించి ఎంపీ మిథున్‌రెడ్డిని విచారణలో ప్రశి్నంచారని తెలిసింది. వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి చెప్పిన విషయాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు అడిగారని, అంటే గంటల పాటు సిట్ విచారణ అంతా పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే సాగిందని తెలుస్తోంది.
సిట్ ప్రశ్నలకు మిథున్ సమాధానాలివీ...
అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా సాగిన సిట్ విచారణను ఎంపీ మిథున్ రెడ్డి దీటుగా తిప్పికొట్టారని, అధికారుల ఆరోపణలన్నీ నిరాధారం, అవాస్తవాలని ఆయన ఆధారసహితంగా బదులిచ్చారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ విచారణ ఇలా సాగింది..
సిట్: అడాన్ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా? మీరు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు కదా?
మిథున్‌రెడ్డి: విజయసాయిరెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. ఆయన నివాసంలో ఆ తేదీల్లో ఎలాంటి సమావేశంలోనూ నేను పాల్గొనలేదు. నాకు ఆ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే మీరు గూగుల్ టేక్ అవుట్ తెప్పించండి. విజయసాయిరెడ్డి చెప్పింది పూర్తిగా అవాస్తవమని తేలుతుంది. (దాంటో సిట్ అధికారులు మౌనం వహించారు)
సిట్: ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పీఎల్‌ఆర్ గ్రూప్‌నకు రూ.5 కోట్లు బదిలీ అయ్యాయి కదా.. ఎందుకు?
మిథున్‌రెడ్డి: ఔను. ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది. అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాంట్రాక్టు పనుల ఈఎండీ, బ్యాంక్ గ్యారంటీ కోసం 2019 నవంబరులో రూ.5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది. దీంతో రూ.5 కోట్లను తిరిగిచ్చేశాం. ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు. అందుకు ఇవిగో ఆధారాలు.. (అగ్రిమెంట్ కాపీ, బ్యాంకు లావాదేవీల రికార్డులు చూపించారు). ఇందులో నిబంధనలకు విరుద్ధమైనది ఏమీ లేదు. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుందని మేం ఆరేళ్ల క్రితమే ఈ అగ్రిమెంట్లు చేసుకోం కదా..? ఇదంతా పారదర్శకంగా సాగిన వ్యవహారం. (దాంతో సిట్ అధికారులు ఈ అంశాన్ని విడిచిపెట్టారు)

సిట్: రాజ్ కసిరెడ్డి కంపెనీ కోసం విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబ వ్యాపార సంస్థ నుంచి రూ.100 కోట్లు అప్పు ఇప్పించారా?
మిథున్‌రెడ్డి: ఆ వ్యవహారంతో నాకేం సంబంధం? అది ఎవరో కొందరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వ్యవహారం. దానిపై నేనేం చెబుతాను? విజయ సాయిరెడ్డి అల్లుడి కంపెనీ ఎవరికో అప్పు ఇస్తే.. అప్పు ఇచ్చిన అరబిందో కంపెనీ వాళ్లను, తీసుకున్నవాళ్లను, ఇప్పించిన విజయసాయిరెడ్డిని అడగాలి. (దాంతో సిట్ అధికారులు ఆ అంశాన్ని కొనసాగించలేకపోయారు)
సిట్: రాజ్ కసిరెడ్డి తెలుసా.. ఆయనతో మీకు వ్యాపార సంబంధాలున్నాయా?
మిథున్‌రెడ్డి: రాజ్ కసిరెడ్డితో పరిచయం మాత్రమే ఉంది. ఆయనతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు.
సిట్: మీరు కొన్ని రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనుగోలు చేశారు కదా? (అని కొన్ని పత్రాలు చూపించారు)
మిథున్‌రెడ్డి: అవును. అవన్నీ సక్రమంగా కొనుగోలు చేసిన ఆస్తులే. ఆ వివరాలన్నీ నా ఎన్నికల అఫిడవిట్‌లో కూడా వెల్లడించాను.
రాజకీయ కుట్రతో నమోదు చేసిన కేసు.. వాంగ్మూలంలో నమోదు టీడీపీ కూటమి ప్రభుత్వంరాజకీయ కుట్రతోనే తమపై ఈ అక్రమ కేసు నమోదు చేసిందని మిథున్‌రెడ్డి సిట్ అధికారులకు విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు ఆ విషయాన్ని తాను వెల్లడించినట్టుగా వాంగ్మూలంలో సిట్ అధికారులతో రికార్డు చేయించారు. తన అభిప్రాయాన్ని అధికారికంగా నమోదు చేయాలని ఆయన పట్టుబట్టారు. దాంతో సిట్ అధికారులు ఆ విషయాన్ని నమోదు చేశారు.