
సోలార్ ప్యానళ్లతో కష్టం!
రూఫ్ టాప్ ఏర్పాటుపై ఆసక్తి చూపని ప్రజలు
పెట్టుకోవాలని ఒత్తిడి తెస్తున్న సర్కారు
కమీషన్ల కోసం ఇప్పటికే అధికారులకు లక్ష్యాలు
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకూ బాధ్యతలు
సబ్సిడీ రూ.78 వేలు కాగా అదనపు వ్యయం రూ.2 లక్షలు
రిజిస్ట్రేషన్ చార్జీలు మాఫీ చేయాలన్న ఏపీఈఆర్సీ
నెట్‌మీటర్‌రింగ్ ఖర్చునూ మినహాయించాలని నిర్ణయం
సాక్షి, అమరావతి: ‘‘అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం.. తగ్గిస్తాం.’’ అని ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు పదవిలోకి రాగానే రూ.15,485 కోట్ల చార్జీల భారం ప్రజలపై వేశారు. ఇదేమిటని నిలదీస్తున్న వారికి సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాలని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు వారి చేత బలవంతంగా రిజి్రస్టేషన్ చేయిస్తున్నారు. ఇంటిపైనే కరెంటును ఉత్పత్తి చేసి, వాడుకోవడంతో పాటు అమ్ముకుని లాభం పొందవచ్చంటూ నమ్మిస్తున్నారు. ప్రతి ఇంటినీ ఓ విద్యుత్ గ్రిడ్‌గా మారుస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ ప్రజల నుంచి కనీస స్థాయిలో స్పందన రావడం లేదు. దీంతో ప్రజలను ఒప్పించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు.
విద్యుత్, అధికారులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు
సోలార్ రూఫ్ టాప్‌ల రిజిస్ట్రేషన్లు చేయించాలని సర్కారు విద్యుత్ శాఖ అధికారులకు లక్ష్యాలను నిర్దేశిస్తోంది. దీంతో వారు క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లు తెస్తున్నారు. వినియోగదారులతో బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు పాట్లు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీనే రూ.6వేల వరకు ఉండడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో రిజ్రస్టేషన్లు చేయించేందుకు సతమతమవుతున్నారు.
విద్యుత్ బిల్లుల్లో రిజిస్ట్రేషన్ చార్జి సర్దుబాటు
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించలేమంటున్న ప్రజలకు విద్యుత్ అధికారులు ఆ చార్జీ చెల్లించవలసిన అవసరం లేదని విద్యుత్ బిల్లుల్లో విడతల వారీగా సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. దీనిని నమ్మి సంతకాలు చేసిన వారికి నెలతిరక్కుండానే విద్యుత్ బిల్లు మోతమోగుతోంది.
రాయితీల ఎర
సోలార్ రూఫ్ టాప్‌లు ఏర్పాటు చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్న ప్రభుత్వం రాయితీల ఎర వేస్తోంది. దీనికోసం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి పలు ప్రతిపాదనలు చేయించింది. దీంతో ఇళ్లపై 10 కిలో వాట్ల సామర్ధ్యం వరకూ ఉండే సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఏర్పాటుకు రిజిస్ట్రేషన్(దరఖాస్తు) చార్జీల మాఫీతో పాటు, నెట్‌మీటర్‌రింగ్ ఖర్చునూ మినహాయించాలని ఏపీఈఆర్‌సీ నిర్ణయించింది. ఈ మేరకు డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది.
అయినా భారమే
ప్రభుత్వం రాయితీలు ఇచ్చినా.. 3 కిలోవాట్ల సామర్థ్యం కల సోలార్ రూఫ్ టాప్ పెట్టాలంటే రూ.1.80 లక్షలు వెచ్చిoచాలి. దీనికి అదనంగా దరఖాస్తు రుసుం 5 కిలోవాట్ల వరకూ రూ.1000, ఆ పైన రూ.5వేలు చొప్పున చెల్లించాలి. మీటరింగ్ చార్జీలు కూడా ప్రస్తుతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అదనపు చార్జీలను మాత్రమే మినహాస్తామంటున్నారు. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ వల్ల రోజూ దాదాపు 12 యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. అంటే నెలకు 360 యూనిట్లు. రోజూ ఎండ ఉండదు కాబట్టి, సగటున 300 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుందని ప్రభుత్వ అంచనా.
రాష్ట్రంలో దాదాపు మూడు నెలలు వర్షాలు అధికంగా కురుస్తాయి. మిగతా రోజుల్లోనూ అనేక ప్రాంతాల్లో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంత విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం లేదు. నిజానికి విద్యుత్ ఉత్పత్తి విధానాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఎక్కువని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్లనే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కలిపి రూఫ్‌టాప్ సామర్ధ్యం 11 గిగావాట్లు కాగా అందులో నివాస గృహాలపై ఉన్నది కేవలం 2.7 గిగావాట్లు మాత్రమే.
సోలార్ ప్యానళ్లు, పరికరాలకు అదనపు ఖర్చు!
సోలార్ ప్యానళ్లతోపాటు పరికరాలకు సబ్సిడీ పోనూ రూ.2లక్షలుపైనే అవుతుంది. ఇది సామాన్యులకు పెనుభారమే. సోలార్ ప్యానళ్ల నిర్వహణ కూడా చాలా కష్టం. వాటిని తరచూ తుడవాలి, నీటితో కడగాలి. దుమ్ము పడకుండా చూసుకోవాలి. ఏ క్రికెట్ బాలో తగిలితే ప్యానెల్‌పై ఉండే అద్దం పగిలిపోయి వర్షం పడినప్పుడు పాడైపోతుంది. ఈ ప్యానెళ్లతోపాటు ఏర్పాటు చేసే 3 రకాల బాక్సులు పాడైతే మరింత ఖర్చు తప్పదు. ఈ బాధలన్నీ పడలేక ప్రజలు సోలార్ రూఫ్ టాప్‌పై ఆసక్తి చూపడం లేదు.