14వ సారి టాప్ టెన్‌లో భారత్
న్యూయార్క్: ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో భారత్ మరోసారి టాప్ టెన్‌లో నిలిచింది. గ్లోబల్ టెర్రరిజమ్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన 162 దేశాలతో కూడిన 2014లో అత్యంత ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. గత పద్నాలుగేళ్లుగా ఈ నివేదికలో భారత్ టాప్ టెన్‌లో నిలుస్తుండటం విశేషం.
ప్రపంచంలోని వివిధ దేశాలలో జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో ఇస్లామిక్ స్టేట్, బోకోహారమ్ ఉగ్రవాదులే సగానికి పైగా దాడులకు పాల్పడుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. 2014లో ఇండియాలో ఉగ్రవాద దాడులకు సంబంధించిన 763 ఘటనల్లో 416 మంది మృతి చెందారు. ఇటీవలి కాలంలో ఉగ్రవాద దాడుల్లో ఒక ఏడాది కాలంలో సంభవించిన మరణాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
భారత్‌లో జరిగిన దాడుల్లో పాకిస్థాన్ కేంద్రంగా చెలరేగుతున్న లష్కర్ ఎ తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలు ప్రముఖ పాత్ర పోషించినట్లు ఈ నివేదికలో వెల్లడించారు. ఈ జాబితాలో పాకిస్థాన్ 4 వ స్థానంలో ఉండగా, అమెరికా 35 వ స్థానంలో ఉంది.