breaking news
jaipur literary festival
-
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: హింసించే భర్తకు గుడ్‌బై
గృహ హింస అంటే భార్య ఒంటి మీద గాయాలు కనిపించాలి అనుకుంటారు చాలామంది. బాగనే కనిపిస్తున్నావుగా... కాపురం చేసుకోవడానికి ఏం నొప్పి అంటారు చాలామంది. ‘కాని మనసుకు తగిలే గాయాల సంగతి ఏమిటి అని అడుగుతుంది’ మేఘనా పంత్. గృహ హింస అంటే భర్త కొట్టకుండా తిట్టకుండా పెట్టే హింస కూడా అంటుందామె. మానసిక భావోద్వేగాలు అదుపు చేసుకోలేని భర్తతో ఐదేళ్లు బాధలు పడి ఆ పెళ్లి నుంచి బయటపడి ఆ అనుభవాలతో ‘బాయ్స్ డోన్ట్ క్రై’ నవల రాసింది మేఘనా. ‘ఒక స్త్రీ విడాకులు తీసుకుంటూ ఉంటే హాహాకారాలు చేసే సమాజం ధోరణి మారాలి’ అంటున్న మేఘన జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో తన/వివాహిత స్త్రీల జీవితాలలోని సంఘర్షణలపై వ్యాఖ్యానం చేసింది. ‘నాకు చదువుంది. చైతన్యం ఉంది. లోకజ్ఞానం ఉంది. అయినా నేను నా వివాహంలో గృహ హింసను అనుభవిస్తున్నాను అని తెలుసుకోవడానికి ఐదేళ్లు పట్టింది’ అంది మేఘనా పంత్. తాను రాసిన నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ గురించి జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో జరిగిన చర్చలో ఆమె మాట్లాడింది. ‘మన దగ్గర బాధితురాలిని కూడా ఒక స్టీరియోటైప్‌ను చేశారు. గృహ హింస ఎదుర్కొంటున్న గృహిణి అనగానే భర్త కొట్టిన దెబ్బలకు కన్ను వాచిపోయి, చర్మం కమిలిపోయి లేదా ఎముకలు విరిగి హాస్పిటల్ పాలయ్యి... ఇలా అయితేనే సదరు గృహిణి బాధ పడుతున్నదని భావిస్తారు. పైకి అంతా బాగున్నా మన దేశంలో దాదాపు 20 కోట్ల మంది స్త్రీలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. కాని పెళ్లిలో ఆ మాత్రం భర్త చేతి లెంపకాయలు మామూలే అన్నట్టు సర్దుకుపోతుంటారు’ అందామె. మేఘనా పంత్ ముంబైలో చదువుకుంది. ఎన్డిటివిలో రిపోర్టర్‌గా పని చేసింది. కథా రచయిత. 2007లో ఆమెకు వివాహం అయితే 2012లో ఆ పెళ్లి నుంచి బయటకు వచ్చింది. ‘నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకో అని మొదట అన్నది మా అమ్మ. నేను వైవాహిక జీవితంలో పడుతున్న బాధను చెప్పుకున్నప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చెయ్ అని మొదట చెప్పిందీ మా అమ్మే. ఇప్పుడు పర్వాలేదు కాని పదేళ్ల క్రితం వరకూ కూడా విడాకులు అనగానే ఇక ఆ స్త్రీ జీవితం నాశనం అని, ఆ స్త్రీ ఏదో తప్పు చేస్తున్నదని భావించడం ఎక్కువగా ఉండేది. ఇప్పుడూ భావించే వర్గాలు ఉన్నాయి. తల్లిదండ్రులే అందుకు ఒప్పుకోరు. నేనేమంటానంటే ఆమె జీవితాన్ని ఆమెను నిర్ణయించుకోనివ్వండి అని’ అంటుందామె. మేఘనా కథనం ప్రకారం ఆమె భర్తకు మానసిక భావోద్వేగాలపై అదుపు లేదు. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. నా భర్తకు బైపోలార్ డిజార్డర్ ఉండేది. అతను నా పెళ్లికి రెండు వారాల ముందే నా మీద చేయి చేసుకున్నాడు. అసలు అప్పుడే పెళ్లి ఆపాల్సింది. కాని భారీ ఖర్చు చేసి పెళ్లి ఏర్పాట్లు చేయడం మన దేశంలో ఆనవాయితీ. అదంతా నష్టపోవాలా అనే పాయింటు ముందుకు వస్తుంది. పెళ్లి ఆపేయడం పెద్ద నామోషీ కూడా. అయితే మన ఇంటి అమ్మాయి నరకం పాలవ్వడం కంటే పెళ్లి ఆగి నామోషీ ఎదుర్కొనడం మంచిది. అలానే నా సలహా– పెళ్లికి పెట్టే ఖర్చు పూర్తిగా తగ్గించి ఆ మొత్తాన్ని ఆమె భవిష్యత్తు గురించి ఆమె కెరీర్ గురించి వెచ్చిస్తే చాలా మేలు. ముంబై నుంచి మా కాపురం న్యూయార్క్‌కు మారాక నా భర్త నన్ను నా తల్లిదండ్రుల నుంచి స్నేహితుల నుంచి కూడా దూరం చేశాడు. స్త్రీని ఒంటరి చేయడం హింస అవునా కాదా? 2012లో నా తొలి నవల ‘ఒన్ అండ్ ఏ హాఫ్ వైఫ్’ విడుదలైన రోజు రాత్రి అతను ఎంతో వింతగా ప్రవర్తించాడు. నాకు పిరియడ్స్ మొదలైతే నాప్కిన్ కూడా పెట్టుకోనివ్వలేదు. ఆ క్షణమే అనుకున్నాను ఈ జీవితం నుంచి బయటపడాలని’ అందామె. వివాహం నుంచి బయటకు వచ్చాక మేఘనా పూర్తి స్థాయి రచయితగా మారింది. స్త్రీల తరఫున అనేక వ్యాసాలు, షోస్ చేసింది. ఆమె నవల ‘ది టెర్రిబుల్, హారిబుల్, వెరి బ్యాడ్ గుడ్ న్యూస్’ నవల ‘బద్నామ్ లడ్డు’ పేరుతో సినిమాగా రానుంది. ఆమె తాజా నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ కూడా వెబ్ సిరీస్‌కు ఎంపికైంది. ‘ఈ పేరు ఎందుకు పెట్టాను. అబ్బాయిలను చిన్నప్పటి నుంచి నువ్వు ఏడవకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, మగాడంటే స్త్రీలతో ఇలా వ్యవహరించాలి అని పెంచుతాము. వాళ్లు కూడా తాము స్త్రీలతో మోటుగా వ్యవహరించడానికి అర్హులు అన్నట్టుగానే పెరుగుతారు. ఇది మారాలి. మగాళ్లు ఏడిస్తే ఏం పోతుంది? పెళ్లి నచ్చని ఆడాళ్లు విడాకులు తీసుకుంటే ఏం పోతుంది? మనల్ని మనం ప్రేమించుకుని మన జీవితాన్ని చక్కదిద్దుకునే హక్కు ఉంది. ఇప్పుడు నాకు వివాహం అయ్యింది. నన్ను గౌరవించే భర్త దొరికాడు. నాకు ఇద్దరు కూతుళ్లు. అఫ్కోర్స్.. వైవాహిక జీవితంలో హింసను ఎదుర్కొంటున్న భర్తలు కూడా ఉన్నారు. వారి బాధను కూడా పరిగణించాలి. స్త్రీలన్నా బయటకు చెప్పుకుంటారు. మగాళ్లకు ఆ ఓదార్పు కూడా లేదు. స్త్రీలకైనా పురుషులకైనా ఈ బాధ అక్కర్లేదు’ అంటుందామె. ‘సర్దుకుపోవడం’ అనే ఒక సనాతన ధోరణిలోనే ఉన్న మన సమాజం మేఘనా వంటి రచయిత్రుల మాటలకు ఉక్కిరిబిక్కిరి కావచ్చు. కాని పెళ్లిలోని ఉక్కిరిబిక్కిరి భరించలేనిదిగా మారినప్పుడు కూడా ఎందుకు సర్దుకుపోవాలి అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే. ‘బాయ్స్ డోన్ట్ క్రై’ దాదాపుగా మేఘనా జీవిత కథ. మార్కెట్లో ఉంది. చదవండి. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. వేదికపై మేఘనా పంత్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మేఘనా పంత్ -
రెండు సాహిత్య ఉత్సవాలు
జైపూర్ లిటరరీ ఫెస్టివల్ గురించి గత ఏడెనిమిదేళ్లుగా వింటున్నా, ప్రతిసారీ ఏదో ఒక వివాదం వస్తుందనే విషయమే మనకు వార్తల్లో ప్రముఖంగా తెలుస్తుంటుంది. కానీ జైççపూర్లో నిజంగానే సాహిత్యోత్సవం పెద్ద ఉత్సవంలాగా జరుగుతుందని ప్రత్యక్షంగా చూస్తేనే తెలుస్తుంది. జైçపూర్ ఫెస్టివల్ నుండి ఆహ్వానం అందినపుడు ‘అబ్బా! జనవరిలో జైççపూర్ చలి ఎలా భరించాలి’ అనుకున్నాను. పైగా డిసెంబరంతా కుటుంబరావు అనారోగ్యం చలి వల్ల వచ్చిందే. ఐనా మృణాళిని ఇచ్చిన ధైర్యంతో కుటుంబరావూ, నేనూ కాస్త ఒణుకు తగ్గించుకుని వెళ్లాం. చలి ఉంది. కానీ ప్రపంచమంతటి నుంచీ వచ్చిన వేలాది సాహిత్యాభిమానులు, ముఖ్యంగా యువతీ యువకులు ఆ చలిని తమ ఉత్సాహంతో వెచ్చగా చేసేశారు! మేం వెళ్ళిన రోజే పెరుమాళ్ మురుగన్ కనిపించటం, పరిచయం, స్నేహం సంతోషకరమైన అనుభవం. ఆయన సాదాసీదాగానూ, ఆత్మీయంగానూ. గంభీరంగానూ అనిపించారు. పర్వ రచయిత భైరప్ప గారిని కలిసి మాట్లాడటంతో ఆయన సీత గురించి కొత్త పుస్తకం రాశారని తెలిసింది. వెళ్ళిన రోజే మా ఇద్దరి సదస్సులూ ఒకే సమయంలో ఉన్నాయి. డిగ్గీ ప్యాలెస్ ఒకే సమయంలో ఏడు సదస్సులు జరిగేంత పెద్దది. అందులో మూడింట్లో వెయ్యి మంది దాకా కూర్చోవచ్చు. మరో నాలుగింటిలో ఆరేడు వందల మంది కూర్చోవచ్చు. ఒక్క సాహిత్యమే కాదు, సామాజిక విషయాలన్నిటి మీదా సదస్సులు జరుగుతున్నాయి. ఒక గంట అన్నిటినీ తిరిగి వచ్చాం. విలియం డెరిలింపుల్ కోహినూర్ వజ్ర ప్రయాణాన్ని వివరిస్తున్నాడు. ట్రంప్ కంటే మాన్‌శాంటో ఎంత ప్రమాదకరమో నసీమ్ నికలస్ తాలెబ్ చెప్తున్నాడు. గుల్జార్ తన కవితా విశేషాలను, అనువాదంలో వచ్చిన సమస్యలను చర్చిస్తున్నాడు. సంజయ్ బారు డిమోనిటైజేషన్ గురించీ, దానిలోని రాజకీయాల గురించీ ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఒక యువ నెటిజన్ రచయిత తన ప్రయోగాల గురించి జనరంజకంగా సంభాషిస్తున్నాడు. ఒక్కసారిగా భయం వేసింది. మధ్యాహ్నం మూడు గంటలకు దర్బార్ హాల్లో వాయు నాయుడు, అర్షియా సత్తార్, నేను సీత గురించి మేం ఎందుకు రాశామో, మా ఆలోచనలేమిటో పంచుకోవాలి. వాయు బ్రిటన్ నుంచి వచ్చింది. ‘ఎసెంట్ ఆఫ్ సీత’ పుస్తకం రాసింది. అర్షియా వాల్మీకి రామాయణాన్ని ఇంగ్లిషులోకి అనువదించింది. నేను ‘విముక్త్త’ కథలు రాశాను. నేను విముక్త రాయటంలోని రెండు ప్రధానాంశాలు ‘ఫెమినిస్ట్ సిస్టర్హుడ్’ ప్రతిపాదించటం, ‘అధికారం, ఆధిపత్యం’ అనే భావనలను స్త్రీల జీవితాల్లోంచి అర్థం చేయించటం అంటూ మాట్లాడటం మొదలు పెట్టగానే అర్థమైంది, ప్రేక్షకులు సానుకూలంగా ఉన్నారని. ‘మృణ్మయ నాదం’ గురించి చెబుతుంటే అందరూ థ్రిల్ అయ్యారు. వాయు, సత్తార్ వాల్మీకి రామాయణం గొప్పతనాన్ని గురించి చెప్పారు. సత్తార్ ఆమె రాసిన ‘ఉత్తరకాండ’ పుస్తకం నుంచి కొంత చదివింది. మొత్తానికి జైపూర్‌లో విముక్త కథలకు జయమే దొరికింది. ప్రేక్షకులంతా ఆ ఐదు రోజులూ నన్ను పలకరిస్తూనే ఉన్నారు. తర్వాత నా అనువాద పుస్తకం Liberation of Sita ఉండటంతో రచయిత సంతకాల కోసం పుస్తకాలతో పాఠకులు వచ్చి నిలబడటం, చాలా మంది వచ్చి ‘మీ పుస్తకం Sold out అండీ మాకు కావాలి ఎక్కడ దొరుకుతుంది’ అని అడగటం – ఇదంతా నిజమా, కలా అనిపించింది. బోలెడు ఇంటర్వ్యూలు! హార్పర్ కాలిన్స్ వాళ్లొక ఇంటర్వ్యూ యూట్యూబ్ కోసం రికార్డు చేశారు. ఇలా రాయటం మోడెస్ట్‌గా ఉండదని తెలుస్తున్నా ఈసారి కాస్త మోడెస్టీని పక్కన పెడదాంలే అనిపించింది. క్షమించండి. నేను విన్న అన్ని ఉపన్యాసాలలోనూ బాగా నచ్చింది, ‘రోమన్ సివిలైజేషన్: డిటీరియరేషన్ ఆఫ్ వెస్ట్రన్ కంట్రీస్’. మొత్తం మానవ నాగరికత ఎత్తు పల్లాలను సింపుల్‌గా, వర్తమానానికి కనెక్ట్ చేస్తూ మాట్లాడాడా పండితుడు. అది బ్రెక్జిట్గానీ, చిత్రకళకు సంబంధించినదిగానీ, వ్యవసాయం గురించిగానీ, రాజకీయ ఆర్థికానికి సంబంధించిగానీ ఎవరే విషయం మాట్లాడినా అర్థం చేసుకుని మేధో చైతన్యాన్ని పొందగలగటం – ‘అమ్మయ్య ఇంటలెక్చువల్‌గా నేను బాగానే ఉన్నాను’ అనుకోగలిగే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది జైçపూర్ ఫెస్టివల్. మంచి విందులు, వీనుల విందైన ప్రపంచ సంగీతాలు, కనుల విందైన నృత్యాలు అదనపు విశేషం. ఒక విందులో శ్రీశ్రీ అంతటి రాజస్థానీ మహాకవినీ, మరికొందరు కవులనూ స్నేహితులుగా చేసుకోగలగటం మంచి అనుభవం. అలాగే నేనా జోలికి పోకపోయినా అచ్చంగా గ్లామర్ కావలసిన వాళ్లకోసం రుషీ కపూర్, శశి థరూర్, రాజమౌళి, రానా మొదలైన వాళ్ళు మాట్లాడారు. 2007లో హైదరాబాద్‌లో ఎవరికీ తెలియకుండా సభకు పిల్చినట్లే తస్లీమా నస్రీన్‌ని కూడా పిల్చారు. ఐనా తెలిసిపోయింది. సభాప్రాంగణం బైట ఆందోళనలు సాగాయి. నిర్వాహకులు ఇంకోసారి ఆమెను పిలవమని హామీ యిచ్చాక వాళ్ళు వెళ్ళిపోయారని మర్నాడు పేపర్ వార్తల వల్ల తెలిసింది. లోపల మాత్రం ఏ అలజడీ లేకుండా తస్లీమా మాట్లాడారు. వెంటనే వెళ్ళిపోయారు. రచయితలు విశ్రాంతి తీసుకోటానికీ, పరస్పర పరిచయాలు చేసుకోటానికీ ఏర్పాటు చేసిన ప్రదేశంలో మృణాల్ పాండే, ఊర్వశీ బుటాలియా వంటి పాత మిత్రులనూ, అనేక మంది దేశ విదేశాల కొత్త మిత్రులనూ కలిశాను. యువ రచయితలు, పాఠకులు, ప్రేక్షకులు అసంఖ్యాకంగా కనిపించి ఒక ఆశను కల్పించారు. మన దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించిన విశ్వాసం బలపడింది. జైపూర్ నుంచి చాలా మంది కలకత్తా ఫెస్టివల్‌కు ఆహ్వానితులై వచ్చారు. పెరుమాళ్ మురుగన్, లిత్వేనియా నుంచి వచ్చిన యువ ఫెమినిస్టు రచయిత ఇంగా, జావేద్ అక్తర్, శశీ థరూర్ మళ్ళీ కలకత్తాలో మరింత స్నేహితులయ్యారు. రామచంద్ర గుహతో సి.వి.సుబ్బారావు గురించి మాట్లాడుకోవటం ఎంతో బాగుంది. కలకత్తా ఫెస్టివల్‌ని అనితా దేశాయ్ ప్రారంభించారు. వయసులో, రచయితగా పెద్దావిడ. చిరునవ్వుతో, ప్రశాంతంగా ఆమె మాట్లాడిన మాటలు ఆ ఉత్సవానికి ఒక మూడ్‌ని ఏర్పరచగలిగాయి. ఈ ఉత్సవంలో కూడా ఇంటర్ డిసిప్లినరీ పద్ధతి పాటించారు. వివిధ సామాజిక, రాజకీయ, చారిత్రక, క్రీడా, కళా రంగాల గురించిన ప్రముఖుల ఉపన్యాసాలు, సంభాషణలు రచనతో అనుసంధానమై సమగ్రతను పొందాయి. సునీల్ గవాస్కర్, అభినవ్ బింద్రా, దీపా (పారా ఒలింపిక్స్ విజేత) వంటి క్రీడాకారుల రచనలు, జీవిత చరిత్రలు యువతరానికి ఉత్తేజాన్నిచ్చాయి. ఇక్కడ నవనేత దేవ్ సేన్, వైదేహి, నేను, అనుత్తమ కలిసి మళ్ళీ సీత గురించి సంభాషణ చేశాం. ఇంకో సెషన్లో ఒరియా రచయిత్రి పరోమిత, జయమిత్ర(బెంగాలీ), నేను ఒక ఆసక్తికరమైన సదస్సులో పాల్గొన్నాం. అది, ‘భారత దేశాన్ని ఐక్యం చేసిన స్త్రీ పాత్రలు’. ఈ సదస్సులో నేను సంస్కరణ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో ఆ ఉద్యమాలకు సానుకూల వాతావరణాన్ని కల్పించటంలో బెంగాలి పాత్రలైన రాజ్యలక్ష్మి, సావిత్రి, కిరణ్మయి, కమల, భారతీ (శరత్చంద్ర), సుచరిత, లలిత (రవీంద్రుడు), కొన్ని ప్రేమ్‌చంద్ పాత్రలు మాత్రమే జోక్యం చేసుకున్నాయనీ అంటూ, ఆ పాత్రలన్నీ మధ్యతరగతి, కులీన, భద్రలోకం నుండి వచ్చి భిన్న జీవితాలు గడిపి మన సానుభూతినీ, ప్రేమనూ పొందాయని చెప్పాను. కానీ ఆ పాత్రలకు బదులు, లేదా వాటితో పాటు మా మధురవాణి (గురజాడ) శశిరేఖ, రాజేశ్వరి, అరుణ, పద్మావతి, లాలస(చలం) అన్ని భాషలలోకి వెళ్ళి భారతదేశాన్ని ఐక్యం చేయగలిగితే మనదేశం మరింత స్త్రీ పురుష సమానత్వంతో ఉండగలిగేదని చెబితే అక్కడున్న యువతీ యువకులు నివ్వెరపోయారు. ఒకప్పుడు ముక్కు, చెవులు కోయించుకుని వికలమై, మళ్ళీ తన జీవితాన్ని అందంగా నిర్మించుకున్నట్లు నేను రాసిన శూర్పణఖ కథ ప్రస్తావించి, ఇవాళ భారతదేశంలో యాసిడ్ దాడులకూ, కత్తిపోట్లకూ, అత్యాచారాలకూ గురి అవుతూ మళ్ళీ తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్న లక్షలాది స్త్రీలను ఐక్యం చేయగలిగేది శూర్పణఖ మాత్రమే అన్న నా మాటలకు యువతరం బాగా స్పందించింది. ఈసారి హైదరాబాద్ ఫెస్టివల్‌కి వెళ్ళలేకపోయినా రెండు మంచి సాహిత్యోత్సవాలలో పాల్గొన్నాననే తృప్తితో 2017 ప్రారంభమైందని సంతోషంగా అనిపించింది. - ఓల్గా 9849038926 -
నవల రాయనుందా?
గాసిప్ సోనం కపూర్ ఏ ముహుర్తాన జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో పాల్గొందోగానీ... అప్పటి నుంచి ఆమె పుస్తకాల ప్రేమలో పడిపోయింది. జైపూర్‌లో ఆమె ఎందరో ప్రసిద్ధ సాహితీవేత్తలతో మాట్లాడింది. పనిలో పనిగా... తప్పకుండా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన పుస్తకాల పేర్లు అడిగిందట. అవి చదివిందా లేదా? అనేది తెలియదుగానీ, కొత్త పుస్తకాలు ఏవి విడుదలైనా వాటి గురించి ఆసక్తి ప్రదర్శిస్తుందట. తన కాలక్షేప సమయాన్ని ఒకప్పుడు టీవీకే పరిమితం చేసిన సోనం ఇప్పుడు వీలైనంత ఎక్కువగా పుస్తకాలు చదవడానికే ప్రాధాన్యత ఇస్తుందట. అంతేనా? తాను చదివిన పుస్తకాలలో నచ్చిన వాక్యాలను, భావాలను డైరీలో నోట్ చేసుకుంటుందట. వాటిని స్నేహితులకు వినిపిస్తుందట. పుస్తకాలు చదివే క్రమంలో రాయాలనే కోరిక పుట్టడం సహజం. ఇప్పుడు సోనం కపూర్ కూడా అదే స్థితిలో ఉంది. తన మనసులోని భావాలను అందంగా కాగితంపై పెడుతుందట. అంతేకాదు... ఒక నవల రాయడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అదేకనుక నిజమైతే, ఆ నవల హిట్ అయితే ఇక ముందు సోనం కపూర్ అనే పేరు ముందు ‘ప్రముఖ రచయిత్రి’ అనే విశేషణం చేర్చడం తప్పని సరేమో!