breaking news
IIT JEE examination
-
ఇంజనీరింగ్ ఇష్టం లేదంటూ...
ఐఐటీలు, ఎన్ఐటీలలో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణురాలైన తర్వాత కూడా ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఓసీలకు 100 మార్కులు కటాఫ్ పెడితే, ఘజియాబాద్‌కు చెందిన కృతి త్రిపాఠి ఏకంగా 144 మార్కులు తెచ్చుకుంది. కాస్త కష్టపడితే ఆమెకు ఐఐటీలో సీటు గ్యారంటీగా వస్తుందని కూడా అందరూ చెప్పారు. కానీ, అసలు ఆమె కల వేరు.. తనకు ఇంజనీరింగ్ చదవడమే ఇష్టం లేదు. అంతరిక్ష శాస్త్రవేత్త కావాలనుకుంది. ఐఐటీలో బీటెక్ చేస్తే అంతరిక్ష శాస్త్రవేత్త కావడం అసాధ్యం. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఎలాగైనా ఆమెను బీటెక్ చేయించాలనుకున్నారు. ఇంజినీరింగ్ చదవక తప్పదనే ఒత్తిడితో 17 ఏళ్ల కృతి త్రిపాఠి బలవన్మరణానికి పాల్పడింది. రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఐదు పేజీల ఆత్మహత్య లేఖ రాసిన కృతి ఐదంతస్తుల భవనం నుంచి దూకి చనిపోయింది. కృతి కుటుంబం ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ నుంచి కోటాకు తరలివచ్చింది. జైపూర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటా కోచింగ్ సెంటర్లకు ఫేమస్. ఇక్కడే ఆమె కోచింగ్ తీసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకునే సమయానికి ఆమె తండ్రి కోటాలో ఉండగా, తల్లి ఘజియాబాద్‌లో ఉంది. ఉదయం 8.30 గంటల సమయంలో కృతి తండ్రి అన్షుమన్ జిమ్‌కు వెళ్లారు. అక్కడ ఉండగానే ఆయనకు భార్య నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో అమ్మాయి అపార్టుమెంట్ పై నుంచి దూకేసినట్లు పొరుగువాళ్లు చెప్పారని, ఒకసారి వెళ్లి చూడమని ఆమె అన్నారు. వెంటనే అన్షుమన్ అక్కడకు వెళ్లగా.. విగతజీవిగా పడి ఉన్న తన కూతురు కనిపించింది. అత్యంత కఠినమైన జేఈఈ మెయిన్స్‌లో ఆమెకు 144 మార్కులు వచ్చాయి. అయినా ఇంజినీరింగ్ ఇష్టం లేదంటూ కృతి ఆత్మహత్య చేసుకుంది. కోటా నుంచి మొత్తం 35వేలమంది జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులయ్యారు. అయితే, కుటుంబసభ్యుల అంచనాలు, ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడ కొన్నిరోజుల వ్యవధిలోనే ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. -
పాత పద్ధతిలోనే ఐఐటీ, ఎన్ఐటీల కౌన్సెలింగ్
జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశాలకు ప్రస్తుత విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. 2016-17 సంవత్సరానికి కూడా ఉమ్మడిగానే ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. రాబోయే విద్యా సంవత్సరంలో కూడా ఇంటర్ మార్కుల వెయిటేజిని పరిగణనలోకి తీసుకుంటారు. ఐఐటీ ప్రవేశ పరీక్షల తీరును సమూలంగా మార్చాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అయితే వీటిని 2017 తర్వాత నుంచి అమలు చేయాలని సూచించింది. దాంతో ఈసారికి పాత విధానమే అమలులో ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా నేషనల్ టెస్టింగ్ సర్వీసు ఒకదాన్ని అమలుచేస్తారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచనను తెలుసుకునేందుకు ఈ నేషనల్ టెస్టింగ్ సర్వీసు పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్లో ఏటా కనీసం రెండుసార్లు ఆప్టిట్యూడ్ పరీక్ష ఉంటుంది. దీని ఆధారంగా జేఈఈకి 4 లక్షల మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వారికి జేఈఈ (అడ్వాన్స్డ్) తరహాలో కొత్త పరీక్ష ఉంటుంది. ర్యాంకుల ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించి 40 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు.