భూములు లాక్కుంటే ఆత్మహత్యలే
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పెనుమాక, ఉండవల్లి రైతుల ఆవేదన
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమకు జీవనాధారమైన సాగు భూములను లాగేసుకునే ప్రయత్నం చేస్తోందంటూ గుంటూరు జిల్లాలోని పెనుమాక, ఉండవల్లికి చెందిన రైతుల బృందం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మొరపెట్టుకుంది. రాజధాని జోన్లో కృష్ణా నది ఒడ్డున ఉన్న నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు అతిథిగృహం వద్ద శుక్రవారం రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. దీనికి విచ్చేసిన బీజేపీ అధినేత అమిత్‌షాను కలిసేందుకు పెనుమాక రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే కేవలం ఐదుగురు రైతు ప్రతినిధి బృందాన్ని పోలీసులు లోనికి అనుమతించారు. అమిత్‌షాతో మాట్లాడే అవకాశమివ్వకపోవడంతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రైతు ప్రతినిధి బృందంతో మాట్లాడారు. రాజధాని జోన్లో భూములివ్వని రైతులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆమె వద్ద వాపోయారు. తమ భూములు లాక్కుంటే ఆత్మహత్యలకైనా సిద్ధమని, భూములు మాత్రం వదులుకోలేమని రైతులు స్పష్టం చేశారు.
అండగా ఉంటాం: కేంద్ర మంత్రి భరోసా
తమ ప్రభుత్వం, పార్టీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ఏం జరుగుతోంది, రైతుల ఇబ్బందులు ఏమిటీ అనే విషయాలను విచారించి తగిన న్యాయం చేస్తామని హామీఇచ్చారు. కేంద్ర మంత్రి వెంట నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఉన్నారు.