
నష్టాలను అధిగమించే యోచన
చార్జీల పెంపునకు కసరత్తు
త్వరలో 20 శాతం వడ్డింపు
సాక్షి, హైదరాబాద్: త్వరలో మెట్రో చార్జీలు పెరగనున్నాయి. కొంతకాలంగా చార్జీలను పెంచేందుకు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రోరైల్ కసరత్తు చేపట్టిన సంగతి తెలిసిందే. వరుస నష్టాలను అధిగమించేందుకు చార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం రూ.6,500 కోట్ల నష్టాలతో నగరంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. కొద్దిరోజులుగా ప్రయాణికుల రాకపోకల్లోనూ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా ఉన్నప్పటికీ తరచూ 4.8 లక్షల నుంచి 5 లక్షలలోపే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మహాలక్ష్మి ఎఫెక్ట్..
సిటీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో చాలా మంది మహిళలు వాటివైపే మొగ్గు చూపుతున్నారు. విద్యార్థినులు, ఉద్యోగినులు సైతం మెట్రో నుంచి సిటీబస్సుల వైపు మళ్లినట్లు సమాచారం. ఎల్‌బీనగర్–మియాపూర్, నాగోల్– రాయదుర్గం కారిడార్‌లలో ప్రయాణికుల రద్దీ ఉన్నా జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్‌లో వీరి సంఖ్య రోజురోజుకూ పడిపోతోంది. ఈ క్రమంలో నష్టాలను ఎదుర్కొనేందుకు చార్జీల పెంపు మినహా మరో గత్యంతరం కనిపించడం లేదని ఓ అధికారి తెలిపారు.
ప్రభుత్వ అనుమతితో..
నగరంలో 2017 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటినుంచి చార్జీలు పెంచలేదు. ఇదే సమయంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో రెండు నుంచి మూడుసార్లు చార్జీలు పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే చార్జీలను పెంచాలని ప్రతిపాదించినప్పటికీ అప్పట్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అంగీకరించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత మెట్రో నష్టాలపై ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే చార్జీల పెంపు కోసం అనుమతిని కోరారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించినట్లు తెలిసింది.
కొద్దిరోజుల్లోనే స్పష్టత..
ఇప్పుడున్న చార్జీలపై గరిష్టంగా 20 శాతం వరకు పెంచే యోచన ఉంది. ప్రస్తుతం కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.60 వరకు మెట్రో చార్జీలు ఉన్నాయి. 20 శాతం పెంచితే రూ.15 నుంచి రూ.75 వరకు పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. మెట్రో చార్జీలు ఏ మేరకు పెరగనున్నాయనే అంశంపై కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుందని అధికారులు పేర్కొన్నారు. చార్జీల పెంపు వల్ల ఇప్పుడున్న నష్టాలను అధిగమించేందుకు కొంతవరకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.