చరిత్ర సృష్టించిన డెవాన్‌ కాన్వే | Devon Conway Scripts History Becomes 3rd Fastest to 1000 IPL Runs | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన డెవాన్‌ కాన్వే

Published Wed, Apr 9 2025 12:35 PM | Last Updated on Wed, Apr 9 2025 1:19 PM

Devon Conway Scripts History Becomes 3rd Fastest to 1000 IPL Runs

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (Devon Conway) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ న్యూజిలాండ్‌ క్రికెటర్‌ ఈ ఘనత సాధించాడు.

అంతా తలకిందులు
కాగా ముల్లాన్‌పూర్‌ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ .. సీఎస్‌కేను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (0)ను డకౌట్‌ చేసి ముకేశ్‌ చౌదరి చెన్నైకి శుభారంభం అందించాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్‌, విధ్వంసకర బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (9)ను ఖలీల్‌ అహ్మద్‌ పెవిలియన్‌కు పంపాడు.

ఇక స్టొయినిస్‌ (4) వికెట్‌ను కూడా ఖలీల్‌ తన ఖాతాలో వేసుకోగా.. నేహాల్‌ వధేరా (9), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (1)లను రవిచంద్రన్‌ అవుట్‌ చేశాడు. అయితే, వీళ్లందరినీ తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగిన చెన్నై బౌలర్లు ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య, లోయర్‌ఆర్డర్‌ బ్యాటర్లు శశాంక్‌ సింగ్‌, మార్కో యాన్సెన్లను మాత్రం అడ్డుకోలేకపోయారు.

ప్రియాన్ష్‌ 42 బంతుల్లో 103 పరుగులతో చెలరేగగా.. శశాంక్‌ 36 బంతుల్లో 52, యాన్సెన్‌ 19 బంతుల్లో 34 రన్స్‌తో అజేయంగా నిలిచారు. ఫలితంగా పంజాబ్‌ నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్లు నష్టపోయి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది.

కాన్వే నెమ్మదిగా..
లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఓపెనర్లలో రచిన్‌ రవీంద్ర కాస్త వేగంగా (23 బంతుల్లో 36) ఆడగా.. డెవాన్‌ కాన్వే మాత్రం నెమ్మదిగా ఆడాడు. 49 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 69 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. అతడిని రిటైర్డ్‌ అవుట్‌గా నాయకత్వ బృందం వెనక్కి పిలిపించింది.

18 పరుగుల తేడాతో ఓటమి
మిగతా వాళ్లలో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (1) విఫలం కాగా.. శివం దూబే (42), ధోని (27) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగుల వద్ద నిలిచి ఓటమిని ఆహ్వానించింది.

ఇదిలా ఉంటే.. కాన్వే పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హాఫ్‌ సెంచరీ బాది.. ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న మూడో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. కాన్వే 24 ఇన్నింగ్స్‌లోనే మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో షాన్‌ మార్ష్‌, లెండిల్‌ సిమ్మన్స్‌ ఈ న్యూజిలాండ్‌ బ్యాటర్‌ కంటే ముందున్నారు.

ఐపీఎల్‌లో తక్కువ ఇన్నింగ్స్‌లో (ఫాస్టెస్ట్‌) వెయ్యి పరుగుల మార్కు చేరుకున్న క్రికెటర్లు
1. షాన్‌ మార్ష్‌- 21 ఇన్నింగ్స్‌లో
2. లెండిల్‌ సిమ్మన్స్‌- 23 ఇన్నింగ్స్‌లో
3. డెవాన్‌ కాన్వే- 24 ఇన్నింగ్స్‌లో
4. మాథ్యూ హెడెన్‌- 25 ఇన్నింగ్స్‌లో
5. సాయి సుదర్శన్‌- 25 ఇన్నింగ్స్‌లో
6. జానీ బెయిర్‌స్టో- 26 ఇన్నింగ్స్‌లో
7. క్రిస్‌ గేల్‌- 27 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు.

చదవండి: హై రిస్క్‌ బ్యాటింగ్‌.. అతడు అద్భుతం.. ఆ తప్పులే మా కొంప ముంచాయి: రుతురాజ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement