
పోస్టాఫీస్ పొదుపు పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఈ స్కీములు మారుమూల గ్రామీణులకు సైతం అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని తెరిచేందుకు అనుసరించే పేపర్ వర్క్ సామాన్యులకు కాస్త ఇబ్బందిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన పొదుపు పథకాలను తెరవడానికి తపాలా శాఖ ఇప్పుడు పూర్తి డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టింది.
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (ఎంఐఎస్), టైమ్ డిపాజిట్ (టీడీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ) వంటి పొదుపు పథకాలను తెరవడానికి పేపర్లతో పనిలేకుండా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను తపాలా శాఖ అమలుచేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తిగా కాగిత రహితంగా, వేగంగా ఉంటుంది. ఫిజికల్ డిపాజిట్ స్లిప్ అవసరం ఉండదు.
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి ప్రసిద్ధ చిన్న పొదుపు పథకాలను తెరవడానికి ఆధార్ ఆధారిత వీ-కేవైసీ ప్రక్రియను ఏప్రిల్ 23 నుండి తపాలా శాఖ అమలు చేస్తోంది. పోస్టాఫీస్ పొదుపు ఖాతాలు తెరవడం, నిర్వహించడం కోసం ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని ఇదివరకే జనవరి 6 నుండి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు డిపాజిట్ వోచర్లు, భౌతిక ఫారాలు నింపే సాంప్రదాయ పద్ధతి కూడా అందుబాటులో ఉంది. కస్టమర్లు తమకు అనువైన విధానాన్ని ఎంచుకోవచ్చు.
ఆధార్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా ఖాతా మూసివేత, ఖాతా బదిలీలు, నామినేషన్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని, త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటి వరకు ఈ సేవలు సంప్రదాయ ప్రక్రియలోనే కొనసాగుతాయి. పేపర్‌లెస్ కేవైసీ ప్రక్రియను కొత్త కస్టమర్లతోపాటు ఇప్పటికే ఉన్న ఖాతాదారులందరూ వినియోగించుకునేలా చూడాలని అన్ని సర్కిళ్ల సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.