వద్దు బాబోయ్... ఈ సూపర్ పోలీస్
బదిలీ వద్దంటూ నాయకుల చుట్టూ ఎస్సైల ప్రదక్షిణలు
రాయికల్ : సాధారణంగా మంచి పోస్టింగ్ కోసం ఎస్సైలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం సహజం. కానీ ఇప్పుడు తమను ఉన్న చోటు నుంచి బదిలీ చేయవద్దని యువ ఎస్సైలు నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వ సూపర్ పోలీస్ నిర్ణయం. రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో జరుగుతున్న నేరాలను నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సూపర్ పోలీస్ వ్యవస్థను రూపొందిస్తోంది. దీని కోసం ప్రతి జిల్లా నుంచి 20 మంది యువ ఎస్సైలను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
అయితే జిల్లాలో కొందరు పోలీసులు వెళ్లేందుకు సుముఖంగా లేరు. సూపర్ పోలీస్ వ్యవస్థలోకి ఎక్కువగా 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలను తీసుకునే అవకాశం ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆరు నెలల క్రితమే ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టిన వారు పనిచేస్తున్న ప్రాంతాలపై ఇప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజల మనోగతాన్ని తెలుసుకుని సులువుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమను బదిలీ చేస్తే అన్ని రకాలుగా ఇబ్బందులు పడతామంటున్నారు. బదిలీ చేయవద్దని మంత్రులను కలుస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో హోంమంత్రికి సిఫారసులు చేయిస్తున్నారు.
ఎస్సైలపై ఇంటలిజెన్స్ ఆరా
జిల్లాలోని 68 పోలీస్స్టేషన్లలో 37 మంది 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు ఆరునెలల క్రితం పోస్టింగ్ తీసుకున్నారు. వారి పనితీరుపై జిల్లా ఎస్పీ ఇంటలిజెన్స్ అధికారులతో ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి పనితీరు ఆధారంగానే సూపర్ పోలీస్ వ్యవస్థలోకి తీసుకోనున్నారు. ఈనేపథ్యంలో బదిలీని ఆపాలని ఎస్సైలు చేస్తున్న ప్రయత్నం ఏమేరకు సఫలమవుతుందో చూడాలి.