జిల్లాలో దొంగలు విజృంభిస్తున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆదాయాన్ని
విజయనగరం క్రైం: జిల్లాలో దొంగలు విజృంభిస్తున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆదాయాన్ని అరగంటలో గుల్ల చేస్తున్నారు. పోలీసులు ఎన్ని గస్తీలు నిర్వహించినా.. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినాదొంగల ముందు అవేవీ పని చేయడం లేదు. అరగంట ఇంటిని వదిలి వెళ్లారంటే.. వచ్చేసరికి ‘కన్నం’ పడిపోతోంది. ఇళ్ల దొంగతనాలతోపాటు గొలుసు దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దొంగలు ప్రధానంగా తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. విజయనగరం పట్టణంలోని గాజులరేగ, బాబా మెట్ట ప్రాంతాల్లో ఇంట్లో కుటుంబ సభ్యులు పడుకుంటుండగానే దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. జిల్లాలో గొలుసు దొంగతనాలు సైతం ఎక్కువగా జరగడంతో మహిళలు ఒంటరిగా వెళ్లేందుకు భయపడుతున్నారు.
ఇటీవల జిల్లాలో జరిగిన కొన్ని చోరీలు..
ఈ నెల 17న బొబ్బిలి నాయుడుకాలనీలో నివాసం ఉంటున్న పెంకి రోజామణి ఇంట్లో చోరీ జరిగింది. తలుపులకు ఉన్న తాళాలను విరగ్గొట్టి దుండగలు చొరబడ్డారు. నాలుగు తులాల బంగారం, గ్యాస్ సిలిండర్‌ను అపహరించారు. ఈ నెల 14న కొమరాడ మండలం కందివలస గ్రామంలో డొల్లు నాగమణి మహిళ మెడలో ఉన్న తులంన్నర పుస్తెలతాడు చోరీకి గురైంది. ఈ నెల 11న పట్టణంలోని గాజులరేగలో చోరీ జరిగింది. బీరువాలో ఉన్న తులమున్నర బంగారు అభరణాలు చోరీకి గురయ్యాయి. ఇటీవల పాత గరివిడిలోని అంధవరపు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు గోదావరి పుష్కరాలకు వెళ్లారు. వారు తిరిగొచ్చేసరికే ఇల్లు గుల్ల అయింది. ఇంట్లోని బీరువలో ఉన్న ఏడుతులాల బంగారు అభరణాలు, రెండు కిలోల వెండి, టీవీ చోరీకి గురైంది.
చోరీల నివారణకు ప్రత్యేక బృందాలు
దొంగతనాల నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. రాత్రిపూట బీటుల్లో ఉండే కానిస్టేబుళ్లను ప్రతి ఇంటినీ పరిశీలించాలని చెబుతున్నాం. తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం లేని ఇళ్లను సైతం గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. గొలుసు దొంగతనాలను నివారించేందుకు స్టేషన్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. విజయనగరం వన్‌టౌన్ పరిధిలో 11, టూటౌన్ పరిధిలో 10 బృందాలను ఏర్పాటు చేశాం.
- పి.వి.రత్నం, విజయనగరం డీఎస్పీ