
ఇకపై ఇతర రాష్ట్రాలు, దేశాల్లో సంస్థ విస్తరణ
ఒడిశాలోని నైనీ గని ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ.. ఇకపై ఇతర రాష్ట్రాలు, దేశాల్లో విస్తరిస్తుందని, త్వరలో గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోనుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్ నుంచి బుధవారం ఆయన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తిని వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ఈ గని ప్రారంభంతో సింగరేణి సంస్థ తన విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందని చెప్పారు.
136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో సంస్థ తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమన్నారు. ఇది యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆనందకరమని తెలిపారు. సమస్యలతో తొమ్మిదేళ్లుగా నైనీ గని ప్రారంభానికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి, తాను.. కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని పలుమార్లు కలిసి పూర్తి అనుమతులు సాధించామన్నారు.
ప్రభుత్వం చూపిన ప్రత్యేక చొరవ వల్లే ఏడాదిలోనే దీనిని ప్రారంభించుకోవడం ప్రజా ప్రభుత్వానికి సింగరేణి అభివృద్ధిపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని చెప్పారు. దీనికి సహకరించిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, ధర్మేంద్ర ప్రదాన్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీకి, అక్కడి స్థానిక ఎమ్మెల్యే అగస్థీ బెహరాకి ధన్యవాదాలు తెలిపారు.
నైనీ వద్ద 1,600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం
ఒడిశాలోని అంగూల్ ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన హామీని త్వ రలోనే సింగరేణి అమలు చేస్తుందని భట్టి విక్రమార్క అన్నా రు. సింగరేణి ప్రభుత్వ సంస్థ అని, కేవలం వాణిజ్యం కోసం పనిచేసే కంపెనీ కాదని, సామాజిక స్పృహతో అక్కడ కార్య క్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు.
అంగూల్ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపరచడానికి 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా నైనీకి సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, భూ కేటా యింపుల విషయంలో ఒడిశా ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ముఖ్య కార్య దర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.