సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోళ్లలో క్రమంగా వేగం పెరుగుతోంది. తొలుత మందకొడిగా మొదలైనా క్రమంగా పుంజుకుంది. అకాల వర్షాలు, వాతావరణ మార్పులతో రైతులు త్వరితగతిన కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో జిల్లాతోపాటు పొరుగు జిల్లాల రైస్‌మిల్లుల్లో ధాన్యం దించుకునేలా ట్యాగింగ్ ఇస్తూ అక్కడికి రవాణా చేస్తున్నారు. కొనుగోళ్లు మొదలైనప్పటికీ హమాలీల కొరత ఏర్పడింది. జిల్లా పరిధిలోనూ మిల్లుల ట్యాగింగ్ జాప్యంతోనూ ధాన్యం సేకరణ ఆలస్యమైంది. తేమ శాతం అధికంగా వస్తుందని తరుగు పేరుతో మిల్లర్లు మెలిక పెట్టారు. దీంతో అకాల వర్షాలతోనూ అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో జాప్యాన్ని నివారించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతీలాల్ కొనుగోళ్ల తీరును పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ, ప్రాథమిక సహకార సంఘ పరిధిలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను రవాణా, మిల్లుల్లో బస్తాలు దించుకునేలా తగిన మిల్లులు ఏర్పాటు చేశారు. డీఎం, డీఎస్‌వో, డీఆర్డీవో, డీసీవో, డీసీఎంఎస్‌వో, మెప్మా అధికారులతో ప్రతీ రోజు కొనుగోళ్లపై ఉదయం, సాయంత్రం రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమీక్షలు చేస్తూ లోపాలు సరిదిద్దుతున్నారు.
రోజుకు 6వేల టన్నులు
జిల్లాలో గత మార్చి 4నుంచి కొనుగోళ్లు మొదలు కాగా, మొదట కేంద్రాల్లో జాప్యం జరిగింది. తేమ 17శాతం కంటే అధికంగా ఉండడంతో కాంటా వేయడంలో ఆలస్యమైంది. రోజుల తరబడి కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. లారీల అన్‌లోడింగ్ జాప్యం జరిగింది. దీంతో ప్రతీ రోజు 355 లారీలతో 4వేల నుంచి 6వేల టన్నుల ధాన్యం కాంటా వేసి రవాణా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక జిల్లాలో రైస్‌మిల్లర్లు బకాయిలు ఉండడంతో ఇప్పటి వరకు 16మిల్లులకే ట్యాగింగ్ ఇచ్చారు. ఉన్నతాధికారుల అనుమతితో కరీంనగర్ జిల్లాలో 56మిల్లులకు అనుమతి ఇవ్వడంతో పొరుగు జిల్లాకే ధాన్యం అధికంగా వెళ్తోంది. ఈ సీజన్‌లో 3.30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనా ఉన్నప్పటికీ రైతుల సొంత వినియోగం పోను 2.20లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. గత సీజన్‌లో 1.55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అయితే కొందరు మిల్లర్లు బస్తాకు 42కిలోలు ఒప్పుకుంటే దించుతామని మెలిక పెడుతున్నారు. దీంతో అంతే మొత్తంలో కాంటా వేస్తున్నారు. రైతులు సైతం ప్యాడి క్లీనర్లతో శుభ్రం చేసి తేమ లేకుండా ఉన్న వాటికి తరుగు లేకుండా చూడాలని కోరుతున్నారు. మరోవైపు మాన్యువల్ కంటే, ట్యాబ్ నమోదుల్లో జాప్యాన్ని నివారిస్తే వేగంగా రైతులకు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది.
మొత్తం కొనుగోలు కేంద్రాలు: 345
కొనుగోళ్లు జరుగుతున్నవి: 251
సేకరించిన ధాన్యం: 65,970.64టన్నులు
రైతులు: 7990మంది
చెల్లింపులు: రూ.39.13కోట్లు
రైతులకు ఇబ్బంది లేకుండా..
రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు లారీల సంఖ్య పెంచి, కేంద్రాల్లో హమాలీలను ఎక్కువ మందిని అందుబాటులో ఉంచాం. అలాగే మిల్లుల ట్యాగింగ్ పెరగడం, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తతతో ధాన్యం సేకరణలో వేగం పెరిగింది.
– ఎస్.మోతీలాల్, అదనపు కలెక్టర్
● జిల్లాలో పుంజుకున్న ధాన్యం సేకరణ ● పెరిగిన లారీలు, తీ
● జిల్లాలో పుంజుకున్న ధాన్యం సేకరణ ● పెరిగిన లారీలు, తీ