‘అఘాయిత్యాలపై స్పందన.. ఇంత ఆలస్యమా అనితమ్మా?’ | Home Minister Anitha Comments Over Missing Child In Mucchumarri | Sakshi
Sakshi News home page

‘అఘాయిత్యాలపై స్పందన.. ఇంత ఆలస్యమా అనితమ్మా?’

Jul 15 2024 3:28 PM | Updated on Jul 15 2024 4:59 PM

Home Minister Anitha Comments Over Missing Child In Mucchumarri

సాక్షి, అమరావతి: ప్రతిపక్షంలో ఉండగా ఏవో కబుర్లు చెప్పారు. అధికారంలోకి వచ్చాక చించేస్తాం.. పొడిచేస్తాం అన్నారు. తీరా అధికారంలో కొలువుదీరి నెల తిరిగేసరికి.. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. ఒకవైపు రాజకీయ ప్రతీకార చర్యలతో పాటు మరోవైపు హత్యలు, హత్యాచారాలు, మిస్సింగులు పెరిగిపోయాయి. అయితే వీటిపై ఇటు చంద్రబాబు ప్రభుత్వంగానీ, ఈ తరహా ఘటనలపై గతంలో ఊగిపోయి మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్‌నుగానీ సరైన రీతిలో స్పందించడం లేదనే విమర్శలు వినిపించాయి. ఈ తరుణంలో.. 

నంద్యాల ముచ్చుమర్రి దారుణ ఘటనపై ఎట్టకేలకు సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే హోం మంత్రి అనితను ముచ్చుమర్రి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఆమె ఆ గ్రామానికి వెళ్లి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన జరిగి పది రోజులు కావొస్తోంది. గత ఆరు రోజులుగా అధికార యంత్రాంగం ఎడతెరిపి లేకుండా బాధితురాలి ఆచూకీ కోసం ప్రయత్నిస్తోంది. హోం మంత్రి పదవిలో ఉండి కూడా అనిత ఆలస్యంగా స్పందించడం.. తాజాగా ఇవాళ ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌పైనా స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించిందక్కడ.  

తాజాగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ‘‘ముచ్చుమర్రిలో చిన్నారి మృతదేహం ఇంకా లభించలేదు. చిన్నారి కోసం ఎన్డీఆర్‌ బృందాలు వెతికినా మృతదేహాం లభించలేదు. ముచ్చుమర్రి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తాం. మరోవైపు.. విజయనగరంలో ఆరు నెలల పనికందుపై అత్యాచారం చేశారు. తాగిన మైకంలో వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు ఈ ఘటనలపై సమీక్ష నిర్వహించారు. లిక్కర్‌ మీద ఉక్కుపాదం మోపాలని సీఎం చెప్పారు. ముచ్చుమర్రి ఘటన, విజయనగరం ఘటనపై స్పెషల్‌ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆడపిల్లల్ని తప్పుగా చూసే వారికి భయం కలిగేలా చర్యలు తీసుకుంటాం’’అని అన్నారు. 

ముచ్చుమర్రి ఘటన జరిగి తొమ్మిది రోజులు అవుతున్నా సీఎం చంద్రబాబు స్పందించింది లేదు. డిప్యూటీ సీఎం పవన్‌ స్పందించినా అది సరైన రీతిలో లేదనే చర్చా సోషల్‌ మీడియాలో నడిచింది. మరోవైపు ఒక్క ఎమ్మెల్యే, మంత్రి కానీ అటువైపు కూడా చూడలేదు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు బాధితులకు అండగా నిలిచి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు చంద్రబాబు స్పందించి హోం మంత్రిని ముచ్చుమర్రికి వెళ్లాలని ఆదేశించారు. అందుకే ఆమె అక్కడికి వెళ్లారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ ప్రభుత్వంపై విసుర్లు విసిరిన ఆమె.. ఇప్పుడు అధికారంలో హోం మంత్రిగా మొక్కుబడిగా ఏదో ప్రకటన చేశారు. 

మరోవైపు.. ముచ్చమర్రి మైనర్‌ అదృశ్యం మిస్టరీ ఇంకా వీడలేదు. బాలిక అదృశ్యం కేసులో నిందితులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో నిజాన్ని నీళ్లలో ముంచి దర్యాప్తు దారి మళ్లిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొమ్మిది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ డీఐజీ సమక్షంలో మల్లాల తిప్ప వద్ద ఎన్డీఆర్‌ఎఫ్‌, జాలర్లతో గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలిక ఆచూకీ ఆలస్యం కావడంతో బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement