ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఆమోదం తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఆమోదం తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ మంగళవారం ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. దాంతో ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రపతి ఆమోదం లాంఛనమైంది.
ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో చర్చించిన అనంతరం మూడు పార్టీలు విముఖత వ్యక్తం చేయటంతో అసెంబ్లీని రద్దు చేయాలని నజీబ్‌జంగ్ సిఫారసు చేశారు. మైనార్టీ సర్కారు ఏర్పాటుపై విముఖంగా ఉన్న కమలనాథులు ఎన్నికలను ఎదుర్కొనేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో నజీబ్ జంగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ రద్దుతో మూడు స్థానాల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకుంది.