
శుక్రవారం ఐ–ప్యాక్ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను ఆలింగనం చేసుకుని స్వాగతిస్తున్న ప్రశాంత్ కిషోర్
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందానికి అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇక్కడి ‘ఐ–ప్యాక్’ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రశాంత్ కిషోర్, ఆయన బృందం సభ్యులతో కొద్దిసేపు గడిపారు. కాగా జగన్ ఐప్యాక్ కార్యాలయానికి చేరుకున్న వెంటనే అక్కడి సిబ్బంది అందరూ ‘సీఎం... సీఎం..’ అంటూ ఆయనకు స్వాగతం పలికారు. కాబోయే ఏపీ ముఖ్యమంత్రి అంటూ పలువురు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జగన్, ప్రశాంత్ కిషోర్‌లు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తమకు అప్పగించిన పనిని పూర్తి చేసినట్టుగా ప్రశాంత్ కిషోర్ చెప్పారు. రెండేళ్లపాటు ఐప్యాక్ బృందం చాలా కష్టపడి పనిచేసిందని, వారందరికీ అభినందనలు తెలుపుతున్నానని జగన్ ఈ సందర్భంగా అన్నారు. బృందం సభ్యులంతా చాలా క్రియాశీలంగా వ్యవహరించినందుకుగాను ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ వెంట ఆయన ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి కూడా ఉన్నారు. ఇంకా పలు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ తాము నిర్వర్తించాల్సిన విధులకోసం ఐప్యాక్ బృందం సభ్యులు తరలి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ వారి కార్యాలయానికి వెళ్లి భేటీ అయ్యారు.