
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల ఆమోదం ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్ అమర్‌దీప్‌సింగ్ చౌదరితో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, సహాయ, పునరావాస విభాగం అధికారులు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టులో భూసేకరణ, నిర్వాసితుల సహాయ పునరావాస ప్యాకేజీ అంచనా రూ.2,934.42 కోట్ల నుంచి రూ.32,509.28 కోట్లకు పెరగడానికి గల కారణాలను అమర్‌దీప్‌సింగ్ చౌదరికి వివరించారు. ఆ వివరణతో ఏకీభవించిన ఆయన వారంలోగా నివేదికను కేంద్ర జల్‌శక్తి శాఖ జాయింట్ కమిషనర్, ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్‌ఈసీ (సవరించిన అంచనాల కమిటీ)కి పంపుతామని స్పష్టం చేశారు. నివేదిక ఆధారంగా ఆర్‌ఈసీ మరోసారి భేటీ కానుంది. సవరించిన అంచనాలపై ఆర్‌ఈసీ ఆమోదముద్ర వేస్తే ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక శాఖ నిధులను విడుదల చేస్తుంది.
పెరిగిన అంచనా వ్యయం
2017–18 ధరల ప్రకారం అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు పెరిగింది. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనపై కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఇప్పటికే ఆమోదముద్ర వేసి కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. టీఏసీ పంపిన ప్రతిపాదనలపై చర్చించడానికి జగ్‌మోహన్ గుప్తా నేతృత్వంలో ఆర్‌ఈసీని కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసింది. పీపీఏ సీఈవో ఆర్కే జైన్, పోలవరం ఈఎన్‌సీ, సీడబ్ల్యూసీ పీఏవో విభాగం సీఈ అతుల్ జైన్, కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్ అమర్‌దీప్‌సింగ్ చౌదరి ఈ కమిటీ సభ్యులు. జూన్ 25న భేటీ అయిన ఆర్‌ఈసీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై సీడబ్ల్యూసీ టీఏసీ ఇచ్చిన నివేదికపై చర్చించింది. సమావేశంలో అమర్‌దీప్‌సింగ్ పలు సందేహాలను వ్యక్తం చేశారు. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయం భారీగా పెరగడానికి కారణాలతో నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో అప్పట్లోనే రాష్ట్ర జలవనరుల శాఖ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా శుక్రవారం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు.
భూసేకరణ చట్టం–2013 మేరకు భూసేకరణ వ్యయం ఎకరానికి రూ.11.52 లక్షలకు పెరిగిందని.. నిర్వాసితులు కోల్పోయిన ఇళ్లలో ఒక్కో ఇంటికి సగటున రూ.3 లక్షలు.. ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇంటి నిర్మాణానికి రూ.3.15 లక్షలు, నిర్వాసిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.6.86 లక్షల పరిహారం.. పునరావాస కాలనీల్లో 24 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని అందుకే వ్యయం రూ.32,509.28 కోట్లకు పెరిగిందని వివరించారు. ఏకీభవించిన అమర్‌దీప్.. వారంలోగా ఆర్‌ఈసీకి నివేదిక ఇస్తానని పేర్కొన్నారు.