ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు దేశాలు పట్టుకొని తిరుగుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు 22సార్లు విదేశీ పర్యటనలు చేశారని, అయినప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా తీసుకురాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా సాధారణ విమానాల్లో కాకుండా ఖరీదైన ప్రైవేట్ విమానాల్లో చంద్రబాబు తిరిగారని, ఓ పక్క రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే తన విదేశీ పర్యటనలకోసం కనీసం రూ.200 కోట్లు ప్రజాధనం వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా, సుళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. నేటి రాజకీయ వ్యవస్థను మార్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ పేదవారు బతకాలంటే భయపడాల్సిన పరిస్థితి లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.