దొరికిన దొంగలపై పవన్ దాటవేత

దొరికిన దొంగలపై పవన్ దాటవేత - Sakshi


* ‘ఓటుకు కోట్లు’ కేసు కోర్టులో ఉన్నందువల్ల మాట్లాడను: పవన్ కల్యాణ్

* టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సీబీఐ విచారణకు డిమాండ్

* చంద్రబాబుపై అభియోగానికి, సెక్షన్-8కి సంబంధం లేదు

* సెక్షన్-8కి తాను వ్యతిరేకమని వక్కాణింపు

* సమకాలీన రాజకీయాల్లో అవినీతి సహజమన్న జనసేన అధినేత


 

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై వచ్చిన అభియోగానికి విభజన చట్టంలోని సెక్షన్-8 వర్తించదని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్-8కు తాను పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకోసం తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల లంచం ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హాండెడ్‌గా దొరికిపోయిన సంఘటనపై పవన్‌కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదంటూ తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ కేసు వ్యవహారంలో స్పందిస్తానని చెప్పిన పవన్ తీరా మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి వ్యవహారంపై దాటవేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కోర్టులో ఉందనీ, తానిప్పుడు మాట్లాడననీ తప్పించుకున్నారు. సమకాలీన రాజకీయాల్లో నీతి నిజాయితీలకు స్థానం లేదని, అవినీతి సహజంగా మారిందని తేలిగ్గా మాట్లాడారు.

 

 రాజకీయ నాయకులందరి కంట్లో దూలాలున్నాయని, కాకుంటే వీటిలో పెద్ద, చిన్న తేడా తప్ప మరొకటి కాదన్నారు. ప్రస్తుత కేసుల వ్యవహారాలను ఆపాలని రెండు రాష్ట్రాలకు హితవు పలికారు. అలాగే సెక్షన్-8 అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికిఇచ్చిన ఆనందాన్ని తీసెయ్యొద్దన్నారు. రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి, అంతర్యుద్ధాలకు దారి తీస్తే సెక్షన్-8 అమల్లోకి వస్తుందని, అలాంటిదేం లేకుండానే సెక్షన్-8 బాధ్యత కేంద్రానికి అప్పగించి మళ్లీ అల్లకల్లోలం చేయవద్దని కోరారు. ఇందుకు కేసీఆర్ బాధ్యత తీసుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి పార్లమెంటరీ కమిటీ నియమించాలని, ఇందులో బీజేపీ, యూపీఏ ప్రతినిధుల్ని నియమించాలని కేంద్రానికి సూచించారు.

 

 కేసీఆర్ చర్య అభినందనీయం

 యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసం ఛీఫ్ ఆర్కిటెక్ట్‌గా విజయనగరం జిల్లాకు చెందిన ఆనందసాయిని నియమించి కేసీఆర్ తెలుగు జాతి సమైక్యతకు మొదటి అడుగు వేశారని పవన్ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాల్జేయకుండా కేసీఆర్ సమైక్యతా స్ఫూర్తి చాటాలని కోరారు. పొలిటికల్ గేమ్స్‌కు అలవాటుపడి నెల రోజులుగా ఓటుకు కోట్లు, ఫోన్‌ట్యాపింగ్ ఒకటే సమస్యగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విలువైన సమయాన్ని కోల్పోయి ప్రజా సమస్యల్ని విస్మరించాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో తెలియదుగానీ అందులోనూ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కావడం నేరమన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

 

 ఆంధ్రోళ్లంటే వాళ్లే కాదు

 ఆంధ్ర అంటే అన్ని కులాలు, మతాల వారు ఉన్నారని, కేవలం కమ్మ సామాజిక వర్గమే కాదని పవన్ చెప్పారు. హరీశ్‌రావుకు ఎంతో ఇష్టమైన బొత్స సామాజిక వర్గం కాపులు కూడా ఉన్నారన్నారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న హరీశ్ రావు లాంటి వారు ఆంధ్రోళ్లు, సెటిలర్లు అంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబును తిట్టాలంటే తిట్టుకోండి తప్ప, ఆంధ్రోళ్లంతా టీడీపీలో లేరని, ఆంధ్ర అంతా ఆయన కులమూ కాదని చెప్పారు.  

 

 ఆత్మగౌరవంలేని సీమాంధ్ర ఎంపీలు

 సీమాంధ్ర ఎంపీలంతా ఆత్మగౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఎంపీలకు పౌరుషం లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు యూపీఏ ప్రభుత్వం, ప్రతిపక్షంగా ఉన్న ఎన్డీఏ చెప్పాయని, ఇప్పుడామాటే మర్చిపోయాయని విమర్శించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సీటు కోసం ఆ రోజు ఊగిపోయారని, ఎంపీ అయిన తర్వాత పార్లమెంటు గోడలు చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారా అని ఎద్దేవా చేశారు.

 

 ఇద్దరు బీజేపీ ఎంపీలు హరిబాబు, గంగరాజు, కాకినాడ, అనకాపల్లి ఎంపీలు తోట నరసింహం, అవంతి శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి వచ్చిన రాయపాటి సాంబశివరావులు ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. కావూరి సాంబశివరావు, పురందేశ్వరిలు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజులు ఎందుకు కిక్కురుమనడం లేదన్నారు. కేసీఆర్ కంటే ఎక్కువగా సీమాంధ్ర ఎంపీలు ఆంధ్రను దెబ్బతీస్తున్నారని ఆయన విమర్శించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top