ఆ జాతి మహిళలకు శృంగార స్వేచ్ఛ | tuareg women who have sexual freedom, face ire now | Sakshi
Sakshi News home page

ఆ జాతి మహిళలకు శృంగార స్వేచ్ఛ

Jun 25 2015 8:47 AM | Updated on Jul 23 2018 9:13 PM

ఆ జాతిలో మహిళలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నాయి. ముఖ్యంగా శృంగార స్వేచ్ఛ. పెళ్లయ్యే వరకు వారు ఎవరితోనైనా గడపవచ్చు. రోజుకొకరితో గడిపినా తప్పులేదు.

ఆ జాతిలో మహిళలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నాయి. ముఖ్యంగా శృంగార స్వేచ్ఛ. పెళ్లయ్యే వరకు వారు ఎవరితోనైనా గడపవచ్చు. రోజుకొకరితో గడిపినా తప్పులేదు. పెళ్లయిన తర్వాత మాత్రం తప్పే. అయితే భర్త నచ్చకపోతే ఎప్పుడైనా విడాకులు ఇవ్వొచ్చు. ఎన్నిసార్లయినా విడాకులు ఇవ్వొచ్చు. పెళ్లిని ఎంత ఆడంబరంగా చేస్తారో, విడాకులను కూడా అంతే ఆడంబరంగా ఓ వేడుకగా చేస్తారు. దానర్థం అమెను పెళ్లి చేసుకోవడానికి మరో అవకాశం దొరికిందని ఒంటరిగా ఉంటున్న మగవాళ్లకు తెలియజెప్పడమే. యువతులకు 20 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లి చేస్తారు. ఆ జాతి మహిళలు బురఖాలు ధరించరు. విచిత్రంగా మగవాళ్లు బురఖాలు ధరిస్తారు. దుష్ట శక్తులు ఆవహించకుండా ఉండేందుకే మగవాళ్లకు ఈ ఏర్పాటని వారు చెబుతారు.

ఆ జాతి వాళ్లు గుడారాల్లోనే ఆడ, మగ కలిసి జీవిస్తారు. అయినా మహిళలకు పూర్తి ప్రైవసీ ఉంటుంది. పెళ్లి కాకముందు ఓ యువతి గుడారంలోకి తాను ఎంచుకున్న యువకుడు వస్తే గుడారంలో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని గ్రహించనట్టే గడపాలి. వీలైనంత వరకు స్వేచ్ఛను కల్పించాలి. అంతేకాదు యువకులు రాత్రి పొద్దుపోయాక గుడారంలో దూరాలి, తెల్లవారక ముందే వెళ్లిపోవాలన్నది వారి నియమం. యువతీ, యువకులు పరస్పర ప్రేమ లేఖల పేరిట కవిత్వం కూడా రాసుకుంటారు. పెళ్లయిన తర్వాత ఏ మగాడు తన భార్య ముందు, ఇతర మహిళల ముందు భోజనం చేయకూడదన్నది గత వెయ్యేళ్లుగా వస్తున్న ఆచారం. ఇటీవల ఈ ఆచారం కాస్త మారింది. భార్య ముందు భోజనం చేయవచ్చని, అత్త ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదన్న నియమాన్ని వారు పాటిస్తున్నారు.


పెళ్లి సమయంలో యువతులు కట్నంగా తన గుడారాన్ని, ఒంటెలు, గాడిదల లాంటి జంతువులను పెళ్లి కొడుక్కు సమర్పిస్తారు. విడాకుల సందర్భంలో మళ్లీ వెనక్కి తీసుకుంటారు. పిల్లలు కూడా తల్లితో ఉండిపోవాల్సిందే. విడాకులు పొందిన మగవాళ్లు మాత్రం తమ తల్లుల వద్దకు వెళతారు. మహిళలు మగవాళ్లతో సమానంగా ఒంటెలపై స్వారీ చేస్తారు. గాడిదలతో పని చేయిస్తారు. సాధారణంగా కుటుంబమంతా ఒంటెలు, గాడిదలు, మేకల లాంటి జంతువులపైనే ఆధారపడి బతుకుతారు. ఇంటికి పెద్ద మహిళే అయినా అది పూర్తి మాతృస్వామిక వ్యవస్థ కాదు. రాజకీయాలు నెరపేది పురుషులే. అవసరమైనప్పుడు తప్పనిసరిగా మహిళల అభిప్రాయాలను తీసుకుంటారు. ఇంట్లో వంటావార్పు, పిల్లలే పోషణ మహిళలే చూసుకుంటారు గనుక 'జంబలకిడి పంబ' సినిమా లాంటి ఇతివృత్తం మాత్రం కాదు. కొన్ని సంచార స్థావరాలను కలిపి ఉంచేందుకు కృషి చేసిన మహిళను 'క్వీన్ ఆఫ్ ది కింగ్‌డమ్'లాగా 'షీ ఆఫ్ ది టెంట్'గా ఎన్నుకుంటారు.

సహారా ఎడారి ప్రాంతంలో నివసించే ఈ సంచార జాతిపేరు 'త్వారెగ్'. వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ జాతివారి జనాభా దాదాపు కోటిన్నర.  ప్రస్తుతం మోలి, నిగర్, ఉత్తర నైజీరియా, అల్జీరియా, ఆగ్నేయ లిబియా దేశ ఎడారి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అరబిక్‌కు దగ్గరగా ఉండే భాషలో మాట్లాడే వారి మతం ఇస్లాం. కాలక్రమంలో వాళ్లు ఇస్లాం మతం పుచ్చుకున్నా తమ సంస్కృతిని మాత్రం అలాగే పరిరక్షించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం వారు ముస్లిం మతఛాందసుల నుంచి దాడులను ఎదుర్కొంటున్నారు. లిబియా సరిహద్దుల్లో అక్కడి ముస్లిం తీవ్రవాదుల నుంచి, నైజీరియాలో బొకోహరాం తీవ్రవాదుల నుంచి ఇటీవల తరచూ దాడులను ఎదుర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement