కాశ్మీరీ వనిత సునంద... | Sunanda Pushkar Tharoor profile | Sakshi
Sakshi News home page

కాశ్మీరీ వనిత సునంద...

Jan 18 2014 3:36 AM | Updated on Sep 18 2019 3:04 PM

కాశ్మీరీ వనిత సునంద... - Sakshi

కాశ్మీరీ వనిత సునంద...

సునందపుష్కర్ స్వస్థలం.. కాశ్మీర్ లోయలోని బోమై గ్రామం. సోపోర్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సునందపుష్కర్ స్వస్థలం.. కాశ్మీర్ లోయలోని బోమై గ్రామం. సోపోర్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీరిది భూస్వాముల కుటుంబం. సునంద తండ్రి పుష్కర్‌దాస్ భారత సైన్యం నుంచి 1983లో లెఫ్టినెంట్ కల్నల్‌గా రిటైరయ్యారు. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు. ఒకరు బ్యాంకు ఉద్యోగి కాగా.. మరొకరు సైనికోద్యోగి. 1990లో వీరి ఇంటిని ఉగ్రవాదులు తగులబెట్టారు. దీంతో పుష్కర్ కుటుంబం శ్రీనగర్‌కు వలసవచ్చింది.  శ్రీనగర్‌లోని మహిళా కాలేజీలో సునంద డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కోర్సు చేశారు.

ఢిల్లీలో ఒక హోటల్‌లో పనిచేసే సంజయ్‌రైనా అనే కాశ్మీరీని వివాహం చేసుకున్నారు. ఆ బంధం విడాకులతో తెగిపోయింది. తర్వాత సునంద దుబాయ్ వెళ్లారు. అక్కడ ఈవెంట్ మేనేజర్, అగ్నిమాపక పరికరాల డీలర్ సుజిత్‌మీనన్ అనే కేరళీయుడిని పెళ్లాడారు. ఈ దంపతులకు శివ్‌మీనన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ 1997లో ఢిల్లీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో సుజిత్‌మీనన్ చనిపోయారు. శశిథరూర్‌తో వివాహం జరిగేనాటికి సునంద కుమారుడి వయసు 17 ఏళ్లు. ఆమె అప్పుడు దుబాయ్‌లో టెకాం అనే రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు.
 
శశిథరూర్‌తో వివాహం...
కేంద్ర మంత్రిపదవికి రాజీనామా చేసిన అనంతరం శశిథరూర్.. తన స్నేహితురాలు సునందపుష్కర్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనకు అంతకుముందు చిన్ననాటి స్నేహితురాలైన తిలోత్తమా ముఖర్జీతో వివాహమైంది. రెండోసారి కెనడా మహిళ క్రిస్టీగైల్స్‌ను థరూర్ పెళ్లిచేసుకున్నారు. సునందతో వివాహానికి కొంత కాలం ముందటే ఆమెకు విడాకులు ఇచ్చారు. 2010 ఆగస్టులో కేరళలోని శశిథరూర్ పూర్వీకుల గ్రామం ఎలవంచెరీలో బంధుమిత్రుల నడుమ నాయర్ల సంప్రదాయం ప్రకారం సునందపుష్కర్‌ను పెళ్లిచేసుకున్నారు. ఈ పెళ్లి జరిగే సమయానికి థరూర్ వయసు 54 సంవత్సరాలు కాగా.. సునంద వయసు 48 ఏళ్లు.
 
కొచ్చి ఐపీఎల్ ఫ్రాంచైజీలో వాటా వివాదం
2010లో అప్పటి విదేశాంగ సహాయమంత్రిగా ఉన్న శశిథరూర్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో సునందపుష్కర్ వార్తల్లోకి ఎక్కారు. ఆమెను థరూర్ పెళ్లాడనున్నారనే వార్తలతో పాటు.. ఐపీఎల్ కొచ్చి ఫ్రాంచైజీలో సునందకు వాటా ఉన్నట్లూ అప్పట్లోనే వెల్లడైంది. కొచ్చి టీమ్‌ను రెండెవూ స్పోర్ట్స్ వరల్డ్ నేతృత్వంలోని కన్సార్షియంకు దక్కేలా శశిథరూర్ కృషిచేశారని.. అందుకు ప్రతిఫలంగా రెండెవూ సంస్థలో.. శశిథరూర్ బినామీ అయిన సునందకు రూ. 70 కోట్లు విలువైన వాటా ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీనిపై మీడియాలో దుమారం రేగటంతో.. సునంద ఒక మీడియా ప్రకటన ఇచ్చారు. అంతర్జాతీయ వ్యాపార రంగంలో తనకున్న అనుభవాన్ని గుర్తించి రెండెవూ సంస్థ తనను కన్సల్టెంట్‌గా ఆహ్వానించిందని, జీతం బదులుగా వాటా ఇవ్వాలని కోరగా ఆమేరకు వాటా ఇచ్చారని చెప్పారు. ఐపీఎల్ కుంభకోణంపై ఆరోపణలు తీవ్రమవటంతో.. సునంద తనను వాటాను వదులుకోవటంతో పాటు, శశిథరూర్ కూడా అప్పుడు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement