కుటుంబ సర్వేలో సవాలక్ష సమస్యలు!!

కుటుంబ సర్వేలో సవాలక్ష సమస్యలు!!


తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన 'సమగ్ర కుటుంబ సర్వే' దాదాపు అయిపోయింది. అయితే.. ఇందులో సవాలక్ష సమస్యలు కనిపించాయి. సర్వే చేస్తామన్న మాటే తప్ప.. దీని గురించిన సరైన వివరాలు పూర్తి స్థాయిలో ప్రచారం కాకపోవడం, ఏ సమాచారం ఇస్తే ఏమవుతుందోనన్న అనుమానాలు, ఇవ్వకపోతే ఏం జరుగుతుందోనన్న ఆందోళన.. ఇలాంటివాటికి సమాధానాలు ఎక్కడా దొరకలేదు. ఎక్కడో మహారాష్ట్రలోని పుణె నుంచి పాలమూరుకు ఒక వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి మరీ సర్వేలో పాల్గొన్నాడు. అతడు ఎప్పుడో జీవనోపాధి కోసం అక్కడకు వెళ్లిపోయాడు. అంతంతమాత్రం జీవితమే కావడంతో కుటుంబ సభ్యులందరినీ ఊరు పంపేసరికి ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. దాంతో తాను కూడా తప్పనిసరిగా సర్వేలో పాల్గొనాలని.. అతడు సైకిల్ తొక్కుకుంటూనే వచ్చాడు. తెలంగాణ పౌరులు అనిపించుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సర్వేలో పాల్గొనాల్సిందే అనే సందేశమే ఎక్కువగా జనంలోకి వెళ్లింది. అందుకే ఇంత కష్టపడి, నానా ఇబ్బందులు పడి మరీ సర్వే కోసం వచ్చారు. చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటి దూరప్రాంతాల్లో ఉన్నవాళ్లు కూడా విమానాల టికెట్లు పెట్టుకుని మరీ సర్వే కోసం రావాల్సి వచ్చింది.



అయితే.. ఇంతమంది ఇన్ని కష్టాలు పడి, ఇంత ఖర్చు పెట్టుకుని మరీ వచ్చినా.. సమగ్ర కుటుంబ సర్వే మాత్రం అనుకున్నంత సీరియస్గా జరగలేదనే చెప్పాలి. ఎన్యుమరేటర్ల స్థాయిలో తగిన శిక్షణ లేకపోవడం, ముందుగా ఎంతమంది సిబ్బంది కావాలో తేల్చుకోలేక.. అరకొరగానే నియమించారు. దాంతో ముందు ఒక్కొక్కరికి 21 ఇళ్లు మాత్రమేనేని చెప్పి, తర్వాత దాదాపు 50 ఇళ్ల వరకు కూడా అప్పగించారు. ఒక్కో ఇంట్లో ఎన్ని కుటుంబాలున్నా అంతే. దీంతో ఎన్యుమరేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. పీజీ నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు అందరినీ సర్వేలోకి దింపేశారు. వాళ్లకు ఏ వివరాలు కావాలో, ఏవి అక్కర్లేదో కూడా పూర్తిగా తెలియలేదు.



చాలావరకు కేవలం కుటుంబ సభ్యులు చెప్పినవే రాసుకున్నారు తప్ప.. సొంతంగా ఏవీ పరిశీలించలేదు. వాస్తవానికి అలా పరిశీలించేందుకు వారికి సమయం కూడా సరిపోలేదు. కొన్ని శివారు ప్రాంతాల్లో అయితే సోమవారమే సర్వే ఫారాలు పూర్తిచేయించుకుని వెళ్లిపోయారు. స్టిక్కర్ల మీద మాత్రం మూడు రోజులూ వచ్చినట్లుగా టిక్ పెట్టేశారు. ఇదేంటని అడిగితే.. ఒక్క రోజులో సర్వే పూర్తి చేయాలంటే దేవుడు దిగి రావాలని విద్యార్థులు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top