గీతా గంగకు... అపర భగీరథుడు

గీతా గంగకు... అపర భగీరథుడు


ఆయన ఒకప్పుడు జర్నలిస్టు...

ఆ తరువాత గాయకుడు...

అటుపైన సంగీత దర్శకుడు... ఎనిమిదేళ్ళ క్రితం కలిగిన

ఒక ప్రేరణ ఎల్. గంగాధర శాస్త్రి

జీవితాన్నే మార్చేసింది.

అకుంఠిత దీక్షతో ఇప్పటికీ ఆయన అదే పనిలో ఉన్నారు. కర్తవ్య విమూఢతలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతలోని మొత్తం శ్లోకాలన్నిటినీ తాత్పర్య సహితంగా స్వయంగా గానం చేసి, రికార్డుగా అందించే ఆ బృహత్తర ప్రయత్నం కోసం ఎనిమిదేళ్ళ జీవితం...



లక్షల రూపాయల సంపాదన... అంతకన్నా విలువైన ఆరోగ్యం... అన్నీ పణంగా పెట్టిన గంగాధర్ ఇప్పుడు గీతాగాన యజ్ఞంలో, జ్ఞాన యజ్ఞంలో ఒక సమిధ. అప్పట్లో ఘంటసాల కొన్ని శ్లోకాలనే రికార్డుగా ఇస్తే... ఇప్పుడీ తెలుగుబిడ్డ తొలిసారిగా 700 శ్లోకాల భగవద్గీతను తాత్పర్య సహితంగా వివిధ భాషల్లో విశ్వవ్యాప్తం చేయాలని తపిస్తున్నారు. చేయూత కోసం తపిస్తున్న ఈ సంపూర్ణ గీతాగాన గంగాధరుడి శ్రమ ఆయన మాటల్లోనే...

 

 

ఎనిమిదేళ్ళ పై చిలుకు క్రితం సంపూర్ణ ‘శ్రీమద్భగవద్గీత’ గానమనే బృహత్తర ప్రాజెక్ట్ ఎలా ప్రారంభమైందన్నది గుర్తు చేసుకుంటే, నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. అసలు ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని కానీ, భగవద్గీతను నా జీవిత ఉద్యమంగా చేపట్టాలని కానీ నేనెప్పుడూ అనుకోలేదు. ఏదో అతీతశక్తి నా వేలు పట్టుకొని నడిపిస్తే, ఆ ప్రభావంతో ప్రవాహంలో పడి కొట్టుకుపోయినట్లు ముందుకు నడిచా. సంగీత విభావరులు ఇస్తూ ఒకసారి అమెరికాలోని డల్లాస్‌లో పాడా. అక్కడ ఒక పెద్దాయన, ‘మీ గొంతులో, ఒక ధ్యానగుణముంది. సంపాదన, పేరు కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేయండి’ అన్నారు. ఊహించని ఆ వ్యాఖ్యతో దిగ్భ్రాంతికి గురయ్యా. ఇక్కడికి తిరిగొచ్చాకా ఆ మాటలు మనసులో సుడులు తిరిగాయి.



అప్రయత్నంగా... అతి పెద్ద ప్రాజెక్ట్



భగవద్గీత గురించి ఆలోచనలో ఒకరోజు సినిమా పాట రికార్డింగ్ కోసం జూబ్లీహిల్స్‌లో స్టూడియోకు వెళుతుంటే, స్వామి స్వరూపానందేంద్ర ఫోన్ చేసి, ఏం చేస్తున్నారని అడిగారు. అప్రయత్నంగా ‘భగవద్గీత రికార్డు చేయాలనుకుంటున్నా’ అనేశా. ఆయన వెంటనే ‘శుభం’ అంటూ, ’ఫిల్మ్‌నగర్ దేవాలయంలోనే ఉన్నా. వచ్చి కలవండి’ అన్నారు. ఆ మరునాడు ఏకాదశి, మంచిరోజంటూ రికార్డింగ్‌కి ముహూర్తం పెట్టేశారు. ఆయన ముహూర్తం పెట్టేవరకూ కేవలం అబద్ధం, ఏదో మాట వరసకన్నది నిజం చేయాల్సి వచ్చింది.

 మొత్తం 700 శ్లోకాల భగవద్గీత ప్రాజెక్ట్‌కు ఎన్ని లక్షలు, కోట్లవుతాయో తెలియకుండానే గుడ్డిగా రంగంలోకి దిగిపోయా. నా బ్యాంకు బ్యాలెన్స్ కేవలం 15 వేలు. అయినా ముందుకెళ్ళా. ‘భగవద్గీతా ఫౌండేషన్’ను నెలకొల్పా. అలా 2006లో మొదలైన ప్రయాణం ఇప్పటి దాకా సాగుతూనే ఉంది. 2013 చివర రికార్డింగ్ మొత్తం పూర్తయింది. త్వరలో ఆడియో సీడీల బుక్ విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాం.



మారిన మనిషి!



ఈ భారీ ప్రాజెక్ట్ చేపట్టాక నా జీవితమే మారిపోయింది. ఒకప్పుడు నెలకు రూ. 2 -3 లక్షలు సంపాదించేవాణ్ణి. భగవద్గీతా గానయజ్ఞాన్నే జీవితంగా మార్చుకున్నాక సంగీత విభావరులు, సినిమా పాటలు వదిలేసుకొని, సంపాదన పోగొట్టుకున్నా. డబ్బులు లేక అవస్థలు పడ్డా. అండగా నిలుస్తామని, తీరా రికార్డింగ్ పెట్టుకున్నాక ఆఖరు నిమిషంలో ముఖం చాటేసిన పెద్ద మనుషులూ ఉన్నారు. మునుపటి భగవద్గీత రికార్డుల్లో లాగా ఇందులో దోషాలుండకూడదనీ, ప్రామాణికంగా, నిర్దుష్టంగా ఉండాలనీ జాగ్రత్తపడ్డా. పెద్దలు చెప్పిన తప్పులను సరిదిద్దడం కోసం మళ్ళీ పాడి, రికార్డింగు చేయాల్సొచ్చింది. గీతా గానం చేయడం మొదలుపెట్టాక ప్రతి ఒక్కరూ నన్ను కేవలం గాయకుడిగా కాకుండా, సందేహాలు కూడా అడుగుతుండే సరికి బాధ్యత పెరిగింది. అప్పుడిక గీతను కూలంకషంగా అధ్యయనం చేశా. అలా ఆ లోతుల్లోకి వెళ్ళి, ఆధ్యాత్మికవాదినయ్యాను.  



మొదలెట్టిందీ... పూర్తి చేసిందీ... తెలుగువాడే!



మొత్తం ‘భగవద్గీత’ను రికార్డుగా ఇవ్వాలనే ప్రయత్నానికి ఘంటసాల మాస్టారే ప్రేరణ. అయితే, ఈ ప్రయత్నం, నా గానం మాస్టారుకు అనుకరణ మాత్రం కాదు. ఒక గాయకుడు ఒక ప్రామాణిక గ్రంథాన్ని, స్వీయ సంగీతంలో, తాత్పర్య సహితంగా, గానం చేసి, అత్యాధునిక సాంకేతిక విలువలతో రికార్డు చేయడం భారతీయ సంగీత చరిత్రలో ఇదే ప్రథమం. ‘భగవద్గీత’లోని ఎంపిక చేసిన కొన్ని శ్లోకాలకే పరిమితమవుతూ ఈ మహత్తర కృషికి శ్రీకారం చుట్టినదీ తెలుగువాడే (ఘంటసాల). ఇవాళ మొత్తం గీతా గానంతో దాన్ని పూర్తి చేసిన నేనూ తెలుగువాణ్ణే కావడం విశేషం.



వింటుంటే... చూస్తున్న అనుభూతి



కాలేజీలో ద్వితీయ భాషగా చదువుకున్న సంస్కృతం, అలాగే నేర్చుకున్న కర్ణాటక సంగీతం ఈ ప్రాజెక్ట్‌లో బాగా ఉపకరించాయి. 700 శ్లోకాలనూ వేర్వేరు రాగాల్లో స్వరపరచగలిగా. అయితే, ఘంటసాల మాస్టారు ట్యూన్ చేసిన 106 శ్లోకాలనూ ఆయన గౌరవార్థం అదే ట్యూన్‌లో, ఆయన గాత్రధర్మంలో పాడాను. ఘంటసాల మాస్టారి రికార్డింగ్‌లో పాల్గొన్న నలుగురు సాంకేతిక నిపుణులు (ఆలోచన చేసిన హెచ్.ఎం.వి. మంగపతి, ఘంటసాల సంగీత సహాయకులు పట్రాయని సంగీతరావు, సౌండ్ ఇంజనీర్ రఘు, సితార్ వాద్య విద్వాంసుడు మిట్టా జనార్దన్‌లు) నా రికార్డింగ్‌లో కూడా పాలుపంచుకోవడం ఒక విశేషం. 12 ఏళ్ల సినీ పత్రికా రచనానుభవం తోడ్పడింది.

 ఘంటసాల భగవద్గీతలో వేణువు, సితార్, కీ-బోర్డ్ వాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, కంప్యూటర్ డిజిటల్ ఆడియో ఫార్మట్‌లో రికార్డయిన ఈ సంపూర్ణ ‘భగవద్గీత’లో 45 వాద్యాలు వాడాం. మొత్తం లైవ్ రికార్డింగ్. పాత్రలకు అనుగుణంగా నా కంఠాన్నే మలుచుకొన్నా. రీ-రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్‌లను వినియోగించాం. దీని వల్ల కళ్ళు మూసుకొని ఇది వింటుంటే, కళ్ళెదుట సినిమా చూస్తున్నట్లనిపిస్తుంది.



నిద్ర లేని రాత్రులెన్నో!



ఈ క్రమంలో నా ఆరోగ్యం, సంపాదన, బంధు మిత్రులతో అనుబంధాలు అన్నీ పోగొట్టుకున్నా. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో ఒత్తిడిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిన రోజులూ ఉన్నాయి. అయితే, మళ్ళీ గీతా సారమే నన్ను ముందుకు నడిపింది.  నా భార్య, పిల్లలు, తల్లితండ్రులు వెంట నిలిచారు. ‘క్రేజుకీ, రెస్పెక్ట్‌కీ తేడా ఉంది. మనిషి బతికుండగా సక్సెస్ వల్ల వచ్చేది క్రేజ్. కానీ, మన పనుల వల్ల, సిద్ధాంతాల వల్ల రేపు మనం ఉన్నా, లేకపోయినా జనంలో మిగిలిపోయేది రెస్పెక్ట్. ఈ ప్రాజెక్ట్‌తో అలాంటి రెస్పెక్ట్ వస్తుంది’ అన్న మా నాన్న గారి మాటలు నాకు శిరోధార్యమయ్యాయి. పెళ్ళయిన పదేళ్ళకే ఈ పనిలో పడిపోయినా, మా ఆవిడ నన్నెప్పుడూ ఏమీ అడగలేదు.

 ఇప్పుడిక 18 అధ్యాయాల భగవద్గీతను 20 సీడీలతో ఒక చక్కటి సీడీ పుస్తకంగా వెలువరించడానికి కృషి చేస్తున్నా. కేవలం కొద్ది లక్షల్లో పూర్తవుతుందనుకొని చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటికి రూ. 2 కోట్ల పైగా ఖర్చయింది. సీడీల విడుదలకు ఇంకా డబ్బు కావాలి. ‘నవయుగ’ విశ్వేశ్వరరావు సహా ఎందరో పెద్దల రూపంలో ఇంత దాకా తెచ్చిన ఆ దేవుడు మానుషరూపంలో ఇప్పుడూ తోడుగా నిలబడతాడని నమ్ముతున్నా.

 

ఈ భగవద్గీతా గానయజ్ఞం చేస్తుండగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ నేను పాడిన ‘విశ్వరూప సందర్శన యోగం’ అధ్యాయంలోని శ్లోకాలు, అర్జునుడి భావోద్వేగాలు విని  ఆనందించారు. ప్రత్యేకంగా నాలుగు శ్లోకాలు మళ్ళీ వ్యక్తిగతంగా పాడించుకొని, విని ప్రశంసించారు. అలాగే, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నా గానం విని, వింటుంటే చూస్తున్న అనుభూతి కలుగుతోందని అన్నారు.  గతంలో లతామంగేష్కర్ లాంటి వారు భగవద్గీతా గానం చేసినా, అది కొన్ని శ్లోకాలకే పరిమితమైంది. పైగా, తాత్పర్యం వేరొకరు పాడారు. పుహళేంది సంగీతంలో ఎస్పీబీ దాదాపు 200 శ్లోకాలు పాడారు. కానీ, పూర్తి భగవద్గీతను స్వీయ సంగీతంలో, స్వీయ తాత్పర్య వ్యాఖ్యానంతో పూర్తిగా గానం చేసే అదృష్టం దేవుడు నాకు ఇచ్చాడు. ఎనిమిదేళ్ళు చదివితే ‘భగవద్గీత’లో ఒకే ఒక్క శాతం నాకు ఒంటబట్టింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రయాణం మొత్తం అద్భుతాల మయం.

 

 సంభాషణ - రెంటాల జయదేవ

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top