తాపీ ధర్మారావు కృషికి మరో దివిటీ...

తాపీ ధర్మారావు కృషికి మరో దివిటీ...


మంచి పుస్తకం

 


తాపీ ధర్మారావు గురించి మనం ఎక్కువగా వింటామా తక్కువగా వింటామా? సాహితీ సభల్లో, పాఠ్య పుస్తకాల్లో, విమర్శనా సాంప్రదాయంలో తాపీ ధర్మారావు పేరు ‘తాపీ’గా వినిపిస్తుందా తరుచుగా తారసపడుతుందా? రెండోదే నిజమైతే దానికి ‘కారణం’ అంటూ ఉందా? ఇలాంటి సందేహాలు కొందరికి రావచ్చు. ‘ఆయన ఫలానా వర్గం కాబట్టి అణిచేశారు’ అని ఎవరైనా అభిప్రాయపడితే నిప్పు లేనిదే పొగ రాదని అర్థం చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఏటిప్రవాహం ఈడ్చుకెళితే గట్టున పడేవారు కొందరు. ఏటికి ఎదురీది ఒడ్డున నిలబడేవారు కొందరు. తాపీ ధర్మారావు రెండో కోవకు చెందుతారు. కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా, పత్రికా నిర్వాహకునిగా,  సినీ రచయితగా ఆయన వేసిన ముద్ర సామాన్యమైనది కాదు.



‘కొత్తపాళీ’, ‘పాతపాళీ’, ‘పెళ్లి-దాని పుట్టుపూర్వోత్తరాలు’, ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు’, ‘ఇనప కచ్చడాలు’, ‘ఆలిండియా అడుక్కు తినేవారి మహాసభ’, ‘సాహితీ మొర్మరాలు’ వంటి రచనలు, ‘మాలపల్లి’, ‘పల్లెటూరి పిల్ల’, ‘భీష్మ’ తదితర సినిమా రచనలు ఆయనను చెరపడానికి వీలులేని పేరును చేశాయి. ముఖ్యంగా దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు పుస్తకం ఆనాటి భారతీయ సమాజంతో పోలిస్తే తెలుగు సమాజ విచారధారను ముందంజలో పెడుతూ తెచ్చిన పుస్తకంగా భావించాలి.  మాట మెత్తగా ఉన్నా అభిప్రాయం సూటిగా, కటువుగా చెప్పడంలో తాపీ ముందుండేవారు. ఒకనాడు గ్రాంథికాన్ని వెనకేసుకొచ్చి స్వయంగా తన గురువుగారైన గిడుగు రామమూర్తి పంతులుగారి మీదే యుద్ధం చేశారు. కాని కాలక్రమంలో వాడుక భాష విలువ తెలిసి గ్రాంథికం మీద అంతే తీవ్రంగా విరుచుకుపడ్డారు. చేమకూర వెంకటకవి విజయ విలాసం కావ్యానికి తాపీ రాసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ను పండితులు గౌరవంగా ఎంచుతారు.



ఈ వివరాల్నీ, తాపీ స్ఫూర్తినీ ఈ తరం పాఠకులకు అందించాలనే ఉద్దేశ్యంతో తెచ్చిన పుస్తకం ‘చెరగని స్ఫూర్తి- తాపీ ధర్మారావు’. డా.నాగసూరి వేణుగోపాల్, డా.సామల రమేశ్‌బాబు సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలో తాపీ మీద డా.ఏటుకూరి ప్రసాద్, నార్ల, కె.ఎస్.చలం, పొత్తూరు వేంకటేశ్వరరావు, వి.ఎ.కె.రంగారావు, కడియాల రామమోహనరాయ్ వంటి పెద్దలు రాసిన వ్యాసాలు, తాపీ కుటుంబ సభ్యుల జ్ఞాపకాలు, ఇంకా తాపీ అసంపూర్ణ ఆత్మకథ ‘రాలూ రప్పలూ’లోని కొన్ని భాగాలు ఉన్నాయి. అన్నీ తాపీగారి కృషిని,  పట్టుదలనూ, జీవన గమనాన్ని, వ్యక్తిత్వాన్నీ విశదం చేసేవే.

 చాలా మంచి పుస్తకం. సాహితీ ప్రియులందరూ పరిశీలించదగ్గ పుస్తకం.

 - నెటిజన్ కిశోర్

 

 చెరగని స్ఫూర్తి

 తాపీ ధర్మారావు

 డా.నాగసూరి వేణుగోపాల్,

 డా. సామల రమేశ్‌బాబు

 వెల: రూ. 150

 ప్రతులకు: 9848016136

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top