
దేశంలోనే పెద్ద టవర్!
భాగ్యనగరం మరింత కాంతులీననుంది!
హుస్సేన్‌సాగర్ తీరంలో 'సిగ్నేచర్' నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక
- తన మదిలో ఆలోచనను వెల్లడించిన ముఖ్యమంతి కేసీఆర్
- 150 అంతస్తులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా డిజైన్
- అలాగే సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి హకీంపేట వరకు ఆకాశ మార్గం
- 11 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
- బాలానగర్ నుంచి నర్సాపూర్ రోడ్డును అనుసంధానిస్తూ మరో కారిడార్
- రెండు కారిడార్లకు కలిపి రూ.1,700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
భాగ్యనగరం మరింత కాంతులీననుంది! ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌తోపాటు షాంఘై టవర్స్.. బుర్జ్ ఖలీఫా వంటి భారీ నిర్మాణాలతో మెరిసిపోనుంది. ఈ రెండూ కార్యరూపం దాలిస్తే దేశంలోనే ఇవి అతి పెద్దవి కానున్నాయి. తెలంగాణ సిగ్నేచర్ పేరుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా హుస్సేన్‌సాగర్ తీరంలో 150 అంతస్తులతో దేశంలోనే అత్యంత ఎత్తై టవర్లను నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉండాలని, అందుకే ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్మించాలని యోచిస్తున్నారు. ఇక ఆరు వరుసలతో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు కూడా రూపకల్పన జరుగుతోంది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి హకీంపేట ఎయిర్‌బేస్ వరకు 11 కి.మీ. మేర సుమారు రూ.వెయ్యి కోట్ల వ్యయంతో ఈ ఆకాశమార్గాన్ని నిర్మించనున్నారు.
'దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా.. షాంఘైలో షాంఘై టవర్స్.. కౌలాలంపూర్‌లో కౌలాలంపూర్ టవర్స్.. సింగపూర్‌లో రిపబ్లిక్ ప్లాజా.. న్యూయార్క్‌లో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్... వీటి తరహాలో ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ సిగ్నేచర్ టవర్స్ నిర్మిద్దాం..'అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన మదిలోని ఆలోచనను వెల్లడించారు. 150 అంతస్తులతో దేశంలోనే ఎత్తయినదిగా ఈ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. హుస్సేన్‌సాగర్ తీరంలో లుంబిని పార్క్, బోట్స్ క్లబ్, టూరిజం ఆఫీస్ ఉన్న ప్రాంతంలో 'వాటర్ ఫ్రంట్ వ్యూ' ఉండేలా ఈ టవర్స్‌ను నిర్మించేందుకు ప్రాథమికంగా ప్రణాళిక సిద్ధం చేశారు. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమానికి చిహ్నంగా దీన్ని నిర్మించాలని, భారతదేశానికి ఒక బహుమానంగా అందించాలని సంకల్పించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా డిజైన్ రూపొందించి, నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై ఆయన గురువారం మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. వినూత్నంగా తన కార్యాలయంలోని అటెండర్ ఎల్లయ్య మొదలుకుని సీఎస్ రాజీవ్‌శర్మ వరకు ఉద్యోగులందరినీ పేరుపేరునా పిలిచి, అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.
'రక్తపు చుక్క చిందకుండా సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం.. ప్రపంచ చరిత్రలో తెలంగాణ అదే స్ఫూర్తికి ప్రతీకగా నిలబడాలి. అందుకే ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉండాలి. ఇక్కడో ప్రతిష్టాత్మక కట్టడం నిర్మించాలి. దేశంలోనే అత్యంత ఎత్తుతో తెలంగాణ టవర్స్ నిర్మిద్దాం. ప్రస్తుతం దేశంలో ముంబైలోని ఇంపీరియల్ జంట టవర్స్ దేశంలో ఎత్తయినవిగా పేరొందాయి. అక్కడే 116 అంతస్తులతో మూడో టవర్ నిర్మాణంలో ఉంది. అంతకు మించిన ఎత్తుతో రాష్ట్రంలో నిర్మించాలనే ఆలోచన ఉంది. దానికేం పేరు పెడదాం.. ఎలా చేద్దాం.. మీరెమంటారు..' అని సీఎం అందరినీ అడిగి.. వారు చెప్పిన అంశాలను సావధానంగా విన్నారు.
సీఎం సిగ్నేచర్ టవర్స్ ఆలోచనను అందరూ స్వాగతించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, సీఎస్ రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శులు శాంతికుమారి, స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్, రాజశేఖర్‌రెడ్డి, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు, పీఆర్వోలు జ్వాలా నరసింహారావు, విజయ్‌కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ' సార్.. మీ లక్కీ నంబర్ 6. ఈ టవర్స్‌ను 156 అంతస్తులతో నిర్మిస్తే బాగుంటుంది..' అని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నట్లు తెలిసింది. '150లో అంకెలు కూడితే.. 6 నంబర్ వస్తుంది.. అదే బెస్ట్' అని మరో అధికారి అన్నట్లు సమాచారం. తెలంగాణకు గుర్తింపుగా దీనికి 'తెలంగాణ సిగ్నేచర్ టవర్స్' అని పేరు పెట్టాలనే అభిప్రాయాలు వచ్చాయి. గతంలోనే హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించే ఆలోచన ఉన్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కోర్టు తీర్పుల చిక్కుముడి కారణంగా ఆ కార్యాచరణకు అడ్డుకట్ట పడింది. దీంతో ఆ సమస్యలను న్యాయపరంగా తొలగించి.. ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణం చేపట్టాలని సీఎం అధికారులతో పేర్కొన్నారు.