ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు | Asaram has amassed riches of Rs 10,000 cr, vast land holdings | Sakshi
Sakshi News home page

ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు

Jan 30 2014 11:59 PM | Updated on Sep 2 2017 3:11 AM

ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు

ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు

కుబేరుడికే కళ్లుతిరిగేలా.. కార్పొరేట్లకే ఈర్ష్య పుట్టేలా స్వామీజీ ఆశారాం బాపు ఆస్తులు కూడగట్టారు.

సూరత్: కుబేరుడికే కళ్లుతిరిగేలా.. కార్పొరేట్లకే ఈర్ష్య పుట్టేలా స్వామీజీ ఆశారాం బాపు ఆస్తులు కూడగట్టారు. అదంతా పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఇప్పుడు బయటకి వస్తోంది. ఇప్పటి వరకూ లెక్కించిన ఆయన సంపద విలువ దాదాపు రూ. 10 వేల కోట్లు ఉందని గురువారం పోలీసులు చెప్పారు.
 
 

ఆయన ఆశ్రమంపై దాడి చేసిన సందర్భంలో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించగా.. బ్యాంకు ఖాతాలు, షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్ల రూపంలో ఆశారాం సొమ్ము రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఉంటుందని సూరత్ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్తానా విలేకరులకు తెలిపారు. దీనిలో దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న భూముల విలువ కలపలేదన్నారు. మరిన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, అప్పుడు ఆయన సంపద విలువ మరింత పెరగవచ్చని సీపీ తెలిపారు. ఈ విషయంలో లోతైన విచారణ కోసం సీబీడీటీ, ఐటీ, ఈడీలకు విన్నవించామని ఆయన చెప్పారు. కొన్ని నెలల క్రితం అహ్మదాబాద్‌లోని ఆయన ఆశ్రమ భవనంలో సోదా చేసిన సందర్భంగా 40 పెద్ద సంచుల నిండుగా ఉన్న వేలాది డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వాటి ఆధారంగానే గుజరాత్‌లోని 45 ప్రాంతాల్లో ఆయనకు భూములున్నట్లు, అంతేగాక రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా భూములు సంపాదించినట్లు బయటపడిందని సీపీ రాకేష్ వెల్లడించారు. మరిన్ని చోట్ల ఆయన ఇంకా డాక్యుమెంట్లు దాచి పెట్టారా అనే విషయం పరిశీలించాల్సి ఉందన్నారు.
 
 కాగా, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న 72 ఏళ్ల ఆశారాం బాపు జోధ్‌పూర్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా అలాంటి కేసులోనే జైలు పాలయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement