భర్త 'గే' అని.. వైద్యురాలి ఆత్మహత్య!!
దేశ రాజధాని ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న ఎయిమ్స్ వైద్యురాలు ప్రియా వేది కేసు కొత్త మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న ఎయిమ్స్ వైద్యురాలు ప్రియా వేది కేసు కొత్త మలుపు తిరిగింది. మణికట్టు కోసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తన భర్త, ఎయిమ్స్లోనే వైద్యుడు కమల్ వేది 'గే' అని తేలడం, ఇన్నాళ్లూ నరకాన్ని అనుభవించాల్సి రావడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తనను వరకట్నం కోసం వేధిస్తున్నట్లు కూడా ఆమె తెలిపింది. చర్మవైద్య విభాగంలో రెసిడెంట్ డాక్టర్గా పనిచేస్తున్న కమల్ వేదిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఐదేళ్లలో తాను పేరుకు మాత్రమే అతడికి భార్యగా ఉన్నానని ప్రియ తన ఫేస్బుక్ పేజీలో శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు రాసింది. తన భర్తకు వేరే మగాళ్లతో సంబంధాలు ఉండేవని చెప్పింది. ఆరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రియ హోటల్లో గది తీసుకుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆమె మృతదేహాన్ని హోటల్ సిబ్బంది గమనించారు.
ఆస్పత్రిలో అర్జంటు కేసు ఉందని చెప్పి ప్రియ శనివారం ఉదయం ఇంట్లోంచి బయల్దేరింది. ఆత్మహత్య చేసుకోడానికి ముందు తన ఫేస్బుక్ పేజీలో భర్త గురించి వివరంగా రాసింది. ఐదేళ్ల క్రితం తనకు డాక్టర్ కమల్ వేదితో పెళ్లయినా, ఇంతవరకు తమమధ్య శారీరక సంబంధం ఏమీ లేదని అందులో చెప్పింది. అతడి ల్యాప్టాప్లో ఓ జీమెయిల్ అకౌంట్ ఉండేదని, అందులో అతడు తన గే స్నేహితులతో చాట్ చేస్తూ, గే పోర్న్ సినిమాలు చూసేవాడని కూడా రాసింది. ఈ ఐదేళ్లు తనను శారీరకంగా, మానసికంగా చాలా వేధించాడని ఆరోపించింది.


