టీఆర్‌ఎస్ శ్రేణుల్లో స్తబ్దత!

టీఆర్‌ఎస్ శ్రేణుల్లో స్తబ్దత! - Sakshi


సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో స్తబ్దత ఆవరించింది. ఏప్రిల్‌లో ప్లీనరీ, అదే నెలలో బహిరంగ సభ నిర్వహించినప్పటి నుంచి పార్టీపరంగా చేపట్టిన కార్యక్రమాలేవీ లేకపోవడంతో నాయకులు, కార్యకర్తల్లో నిస్తేజం ఆవరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పథకాల ప్రచారంలో పార్టీ యంత్రాంగం సేవలు వినియోగించుకుంటామని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించినా స్వచ్ఛ హైదరాబాద్ వంటి కార్యక్రమాలు అధికారికంగానే సాగడం, జిల్లాల్లోనూ అదే పరిస్థితి నెలకొనడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కరువైంది.

 

పెండింగ్‌లోనే పార్టీ కమిటీలు...

టీఆర్‌ఎస్ ప్లీనరీలో కేసీఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా తిరిగి ఎన్నికయ్యాక జరగాల్సిన పార్టీ కమిటీల నియామకం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. అంతకుముందే పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయినా, జిల్లాస్థాయి కమిటీల భర్తీ కూడా జరగలేదు. ఫలితంగా రాష్ట్ర స్థాయిలో ఒక అధ్యక్షుడు, జిల్లా స్థాయిలో అధ్యక్షులు, నగర అధ్యక్షులు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. చివరకు అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌పై కూడా పార్టీపరంగా దృష్టిపెట్టినట్లు కనిపించట్లేదు.



జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న పార్టీ నాయకత్వం ఆ దిశలో పార్టీ యంత్రాంగాన్ని నడిపే ప్రయత్నం మాత్రం చేయట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీహెచ్‌ఎంసీతోపాటే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకూ ఎన్నికలు జరగాల్సి ఉన్న పరిస్థితుల్లో పార్టీ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తికానందున ఎవరు ఏ హోదాలో పనిచేయాలో తెలియని సందిగ్ధత ఏర్పడింది. తమకు ఏ పదవీ లేక, బాధ్యతలూ అప్పజెప్పకపోవడంతో ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పుకుని పనిచేయాలన్న సందేహాన్ని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో ఇప్పటికే పెదవి విరుస్తున్న పార్టీ యంత్రాంగం చివరకు పార్టీ పదవులన్నా భ ర్తీ చేయరా అని లోలోన మథనపడుతున్నారు.

 

జంప్ జిలానీలకూ తప్పని నిరీక్షణ!

ఎన్నికల ముందు, ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివిధ పార్టీలను వదిలి టీఆర్‌ఎస్‌లోకి వలస వచ్చిన నాయకుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వివిధ పార్టీల్లో మంచి హోదాల్లో ఉన్న పదవులు వదులుకుని పార్టీ మారిన వారికి పదవుల్లేక సాధారణ కార్యకర్తలుగా మిగిలే పరిస్థితి నెలకొంది.



నామినేటెడ్ పదవులు ఆశ చూపి పార్టీలోకి చేర్చుకున్న తమకు చివరకు పార్టీ పదవులకూ దిక్కులేకపోవడంపై జంప్ జిలానీలు కుమిలిపోతున్నారు. ముందు నుంచీ పార్టీలో ఉన్న వారితో పోటీపడుతూ ఎలాంటి పదవుల్లేకుండా పనిచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. మొత్తంగా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో పార్టీ కార్యకలాపాలు అటకెక్కాయి. ప్రస్తుతం అందరి దృష్టి నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల భర్తీపైనే కేంద్రీకృతమై ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top