కరుణ.. జయ.. కలిసి పనిచేశారా? | Sakshi
Sakshi News home page

కరుణ.. జయ.. కలిసి పనిచేశారా?

Published Tue, Dec 6 2016 2:32 PM

కరుణ.. జయ.. కలిసి పనిచేశారా?

తమిళనాడు రాజకీయాల్లో జయలలిత, కరుణానిధి గట్టి ప్రత్యర్థులు. ఒకరంటే ఒకరికి ఏ క్షణంలోనూ పడేది కాదు. అలాంటిది ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశం అసలు ఎప్పుడైనా.. ఎక్కడైనా ఉంటుందా? జయలలిత దాదాపు 140కి పైగా సినిమాల్లో నటించారు. 1960ల నుంచి 1980ల వరకు ఆమె తమిళ తెరను తిరుగులేకుండా ఏలిన రారాణి. ఆ తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. ఆమే కాకుండా.. తమిళ రాజకీయాల్లో ఉన్న మరికొందరు ప్రముఖ నాయకులకు కూడా సినీ పరిశ్రమతో సంబంధం, అనుబంధం ఉన్నాయి. 
 
డీఎంకే అధినేత ఎం. కరుణానిధి.. అన్నాడీఎంకే అధినేత్రికి గట్టి ప్రత్యర్థి. కానీ ఆయన కూడా రాజకీయాల్లోకి రాకముందు పేరుమోసిన సినిమా రచయిత. అందుకే వీళ్లిద్దరూ కలిసి ఏమైనా సినిమాలో పనిచేశారా అన్న విషయం ఆసక్తికరంగానే ఉంటుంది. అవును.. ఒకే ఒక్క మాత్రం సినిమాకు ఇద్దరూ పనిచేశారు. 
 
జయలలిత తమిళంలో చేసిన తొలి సినిమా వెన్నిరాడై (1965). అప్పటికి తమిళ సినీ పరిశ్రమలో కరుణానిధి చాలా విజయవంతమైన స్క్రిప్టు రచయిత. ఆయనతో రాయించుకోవాలని దర్శకులు, నిర్మాతలు వెంటపడుతుండేవారు. కానీ, జయలలిత నటిగా ఎదిగే సమయానికి ఆయన సినిమాలకు రాయడం దాదాపు మానేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేశారు. కానీ, 1966 సంవత్సరంలో ఎస్.రాజేంద్రన్ దర్శకత్వంలో వచ్చిన మణి మకుటం సినిమా మాత్రం వీళ్లిద్దరినీ కలిపింది. ఆ సినిమాలో జయలలిత సెకండ్ హీరోయిన్‌గా చేశారు. ఆ సినిమాకు కరుణానిధి స్క్రిప్టు అందించారు. రాజకీయాల్లో ఇద్దరూ భీకరంగా తలపడినా, సినిమా రంగంలో మాత్రం ఒక్కసారి ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశం లభించింది. కరుణానిధి సృష్టించిన పాత్రను జయలలిత పోషించారు. 

Advertisement
Advertisement