ఆ మూర్ఖత్వంతోనే...చిరంజీవి సినిమా చేయలేకపోయా : కృష్ణవంశీ

ఆ మూర్ఖత్వంతోనే...చిరంజీవి సినిమా చేయలేకపోయా : కృష్ణవంశీ - Sakshi


 ‘‘ప్రేక్షకులకు 50 ఏళ్ల పాటు గుర్తుండిపోయేలా ఈ సినిమా తీస్తున్నాను. నేను పొగరుతోనో, కొవ్వుతోనో ఈ మాట చెప్పడం లేదు. నమ్మకంతో చెబుతున్నాను’’ అని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా బండ్ల గణేశ్ నిర్మిస్తున్న చిత్రం - ‘గోవిందుడు అందరివాడేలే’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, కమలినీ ముఖర్జీ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ ఇంకా మాట్లాడుతూ - ‘‘నేను ఎవరికైనా అవకాశం ఇవ్వాలి కానీ.... నాకెవడు అవకాశం ఇచ్చేది? అనేంత మూర్ఖత్వంతో ఉండేవాణ్ణి.

 

 ఆ మూర్ఖత్వంతోనే... చిరంజీవిగారితో సినిమా చేసే అవకాశం వచ్చినా చేయలేకపోయా. ఒకానొక దశలో నా కెరీర్ డైలమాలో పడిపోయింది. అలాంటి సమయంలో నాకు అవకాశం ఇచ్చాడు చరణ్. ‘గోవిందుడు అందరివాడేలే’ నా కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమా. ఇక ఈ సినిమాలో ఎవరూ నటించలేదు. బిహేవ్ చేశారు. ఇళయరాజాగారబ్బాయి యువన్, చిరంజీవిగారబ్బాయి చరణ్‌లతో కలిసి పనిచేసిన తొలి దర్శకుణ్ణి బహుశా నేనే. ఇళయరాజాగారు మేస్ట్రో అయితే, యువన్‌శంకర్‌రాజా మాస్టర్. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించాడు’’ అని చెప్పారు. ‘‘‘మగధీర’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్న టైమ్‌లో ఓ సారి కృష్ణవంశీ కనిపించారు.

 

 ‘సార్.. మనం ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేద్దాం’ అనడిగాను. బహుశా కృష్ణవంశీకి ఇది గుర్తు లేదనుకుంటా. అప్పుడాయన నా వంక ఓ చిన్నపిల్లాణ్ణి చూసినట్టు చూసి వెళ్లిపోయాడు. ఇన్నాళ్లకైనా ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు చెబుతున్నాను... కృష్ణవంశీ తెలుగు సినిమాకు ఆస్తి. ఆయన అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. కాజల్ అగర్వాల్‌తో మూడు సినిమాలు చేశాను. గడచిన మూడు సినిమాల్లో కనిపించనంత అందంగా ఈ సినిమాలో కనిపించింది. సాంకేతికంగా ఈ సినిమా ఓ వండర్’’అని రామ్‌చరణ్ చెప్పారు. ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల ప్రచార చిత్రాలు చూస్తుంటే అసహ్యం వేస్తోంది.

 

 ‘గోవిందుడు...’ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఎక్కడికో పోతున్న విలువలు గుర్తొచ్చాయి. తెలుగు సినిమా స్టామినాను తెలియజెప్పే సినిమా ఇదని కచ్చితంగా చెప్పగలను. డబ్బు కోసం కాదు కథలోని ఆత్మ నచ్చి ఈ సినిమా చేస్తున్నా. మారిపోతున్న మానవతా విలువలకు ప్రతిరూపంగా ఈ సినిమా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయసుధ, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, సమీర్, కాదంబరీ కిరణ్  తదితరులు మాట్లాడారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top