చంద్రబాబు నన్ను కొట్టారు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నన్ను కొట్టారు

Published Thu, Mar 31 2016 3:07 AM

చంద్రబాబు నన్ను కొట్టారు - Sakshi

అసెంబ్లీలో మంత్రి పోచారం సంచలన వ్యాఖ్యలు
నిజాం చక్కెర కర్మాగారం ప్రైవేటీకరించొద్దనటమే నా నేరం
మంత్రివర్గ ఉపసంఘం భేటీలోనే తొడపై గట్టిగా కొట్టారు
గుండె మీద కొట్టారని చంద్రబాబుతో అన్నా
మరి అప్పుడే రాజీనామా ఎందుకు చేయలేదు: కాంగ్రెస్
కిరణ్ తెలంగాణకు రూపాయి ఇవ్వనంటే మీరేం చేశారు: పోచారం
కరువుపై చర్చలో ఆగ్రహావేశాలు.. సభ కాసేపు వాయిదా

 
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో కీలకమైన నిజాం చక్కెర పరిశ్రమను ప్రైవేటీకరించొద్దని గట్టిగా వ్యతిరేకించినందుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నా తొడపై కొట్టారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనే నన్ను గట్టిగా కొట్టడంతో తొడ ఎర్రగా కమిలింది. ఇంతకాలం ఈ విషయాన్ని నేను బయటపెట్టలేదు..’’ అంటూ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాడు కొట్టింది తొడ మీద కాదు గుండె మీద అంటూ ఆవేదనతో చెప్పారు.
 
 దీంతో సభలో కాసేపు గంభీర వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లావాసినైన తాను స్థానికంగా ఉన్న నిజాం చక్కెర పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా చేసిన ప్రయత్నాలను చంద్రబాబు విఫలం చేశారని పోచారం పేర్కొన్నారు. బుధవారం సభలో కరువుపై చర్చ జరుగుతుండగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై తన వాదనను వినిపించే క్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అధికార పక్షం-రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటుచేసుకోవటంతో సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు మైక్ ఇవ్వకుండా స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేయడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేయాల్సి వచ్చింది.
 
 రైతు మంత్రి అయితే సాగు బాగుంటుందనుకున్నా..
 కరువుపై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై  రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ వచ్చాక కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవటం బాధ కలిగిస్తోందన్నారు. రైతు అయిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ మంత్రి అయితే మంచి రోజులు వస్తాయని ఆశించానని, కానీ తీరు మారలేదన్నారు. 2014లో కరువు సాయం కోసం కేంద్ర ంపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వాన్ని  కోరినా పట్టించుకోకపోవడంతో టీడీపీ పక్షాన తామే కేంద్రమంత్రిని కలిశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రానిదే తామేం చేస్తామని ఆ మంత్రి వ్యాఖ్యానించారని, ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ కరువు వచ్చినా అదే తీరు కొనసాగుతోందని ఆరోపించారు. జిల్లాల వారీగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంబంధించి ఎన్‌సీఆర్‌బీ నివేదికను చదివిన ఆయ న... ప్రభుత్వం వారి సంఖ్య తగ్గించి సాయం చేసిందని విమర్శించారు. దీంతో మంత్రి పోచారం కలుగజేసుకుంటూ...  1998 నుంచి 2014 వరకు అదే ఎన్‌సీఆర్‌బీ నివేదికలోకి అంకెలు చదివి అప్పట్లో ప్రభుత్వ సాయం పొందిన రైతుల సంఖ్యను పోల్చి చెప్పారు. టీడీపీ హయాంలో రైతుల సంఖ్య ఎందుకు తగ్గించారని రేవంత్‌ను ప్రశ్నించారు. అందుకు రేవంత్ స్పందిస్తూ... నాడు ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను టీడీపీ ప్రభుత్వం తగ్గిస్తే, అప్పట్లో పోచారం, కడియం, తుమ్మల, తలసాని అక్కడ అధికారం చెలాయించినవారే కదా అంటూ ఎదురుదాడి చేశారు.
 
 దెబ్బ తగిలిన ప్రాంతం కమిలిపోయింది
 రేవంత్ ఆరోపణలతో మళ్లీ జోక్యం చేసుకున్న పోచారం మాట్లాడారు. ‘‘నాడు మేం అధికారాన్ని చలాయించి ఉండొచ్చు. ఎప్పుడైనా సీఎం నిర్ణయాలమీదే ఫలితాలుంటాయి. దీనికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణే ఉదాహరణ. దాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు మంత్రిగా  వ్యతిరేకించాను. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలో స్థానికుడినైన నన్ను వేయకుండా యనమల రామకృష్ణుడు, విద్యాధరరావులను నియమించారు. అది మదర్ యూనిట్ అని, దానివల్ల పది యూనిట్లు ఏర్పడ్డాయన్నా. నష్టాల పేరుతో ప్రైవేట్‌పరం చేయొద్దని కోరా. తుది నిర్ణయం కోసం ఉపసంఘం భేటీ అయినప్పుడు వెళ్లి మళ్లీ కోరాను. దీంతో పక్కనే కూర్చున్న చంద్రబాబు కోపంతో నా తొడపై గట్టిగా కొట్టారు. ధోవతి కట్టుకుని ఉంటా కదా.. దెబ్బ తగిలి ఆ ప్రాంతం ఎర్రగా కమిలింది. ఆ తర్వాత ఆయన సారీ చెప్పి ఇరిటేషన్‌లో కొట్టానన్నారు. కానీ ఆయన కొట్టిన దెబ్బ గుండెల మీద తగిలిందని చంద్రబాబుతో అన్నాను. కానీ ఇప్పుడు కేసీఆర్ తీరు వేరు. ఆయన వద్ద పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా..’’ అని పోచారం అన్నారు.
 
 స్పీకర్ వివక్ష చూపుతున్నారు: కాంగ్రెస్

 తాము మాట్లాడుతుంటే మధ్యలో మైక్ కట్ చేసి మంత్రులకు మాత్రం మాటిమాటికి అవకాశం ఇస్తూ స్పీకర్... ప్రతిపక్షంపై వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతుండగా మైక్ క ట్ చేయటంతో పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సభ గందరగోళంగా మారడంతో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు.
 
సీఎంలు కొడతారని ఇప్పుడే వింటున్నా
 ‘‘సీఎంలు మంత్రుల్ని కొడతారన్న విషయం ఇప్పుడే వింటున్నా. ఆ రోజు ఆ సీఎం కొట్టిన విషయాన్ని ఈ రోజు బయటపెట్టిన పోచారం.. మరి ప్రస్తుత సీఎం కొట్టే దెబ్బలు మరో సందర్భంలో బయటపెడతారా’’ అని రేవంత్ ప్రశ్నించారు. గత 102 రోజులుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని రైతులు ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. బాబు కొట్టినా పదవుల కోసం అక్కడే పడి ఉన్న మీరు కేసీఆర్ పాపాలను కూడా చూస్తూ పడి ఉంటారా అని ప్రశ్నించారు. నిజాం ఫ్యాక్టరీని ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుని... సీఎం కొడితే అప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదు, ఇప్పుడెందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రశ్నించారు. ఆయన మాటలు పూర్తి కాకముందే స్పీకర్ మైక్ కట్ చేశారు. అందుకు ఇదే సభలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంటే మంత్రులుగా ఉన్న మీరెందుకు రాజీనామా చేయలేదని పోచారం ఎదురు ప్రశ్నించారు.

Advertisement
Advertisement