కదిలింది కరుణరథం | Writer Modukuri Johnson | Sakshi
Sakshi News home page

కదిలింది కరుణరథం

Apr 9 2017 12:56 AM | Updated on Sep 5 2017 8:17 AM

కదిలింది కరుణరథం

కదిలింది కరుణరథం

తెలుగునాట సంచలనం సృష్టించిన సినిమా ‘కరుణామయుడు’. ఇందులో మోదుకూరి జాన్సన్‌ రాసిన కదిలింది కరుణరథం...

తెలుగునాట సంచలనం సృష్టించిన సినిమా ‘కరుణామయుడు’. ఇందులో మోదుకూరి జాన్సన్‌ రాసిన కదిలింది కరుణరథం... అనే పల్లవితో సాగే పాట ఈ చిత్రానికే తలమానికం.  ‘మనుషులు చేసిన పాపం

మమతల భుజాన ఒరిగింది
పరిశుద్ధాత్మతో పండిన గర్భం
వరపుత్రునికై వగచింది వగచింది’

అంటూ సాగిన మొదటి చరణంలో  మానవాళి దుఃఖాన్ని తన భుజాలపై మోయడానికి ఏ పాపం, నేరం చేయకుండానే ఆనాటి పూజారి వ్యవస్థ వేసిన నిందల బారిన పడి, శిక్షవేయబడి శిలువనెత్తిన మహానుభావుడి త్యాగానికి సంబంధించిన సర్వస్వాన్ని  అద్భుతంగా  ఆవిష్కరించాడు కవి.

‘పరమ వైద్యునిగ పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగ మారాయి.
అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ధరించి ముద్దాడింది.
శిలువను తాకిన కల్వరి రాళ్లు కలవరపడి కలవరపడి కలవరపడి
అరిచాయి అరిచాయి’ మూగ జీవులైన గొర్రెలకు ప్రేమ అనే పచ్చికను పంచాడు ప్రభువు.

 అంతటి కరుణామయుడైన ఆయన దారుణ హింసకు గురయ్యాడు. అది చూసి గొర్రెలన్నీ మూగగా రోదించాయి. ఎంతో పవిత్రమైన ఆయన పాదాలు నెత్తురు ముద్దగా మారిపోయాయి. ఆయన చేతిలోని శిలువను తాకిన రాళ్లు సైతం బాధతో కలవరపడ్డాయి. అవి అరుస్తుంటే, ఆ అరుపులు ప్రతిధ్వనిస్తున్నాయి అనే చెప్పేలా అరిచాయి అరిచాయి అని కవి రచించడంతో ఈ కవి స్వయంగా కరుణామయుడిలా అనిపిస్తాడు.

ఈ పాటలోని ఉపమానాలు ‘పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది...’  అనే పోలికతో పాటు ‘పంచిన రొట్టెలు రాళ్లయినాయి’ అనడం, స్వార్థపరులను ‘ముళ్ల కిరీటం’తో,  ఆర్తులను ‘రుధిరం’తో పోల్చడం ప్రేమ పంచిన మహావ్యక్తిని దారుణహింసలకు గురి చేసిన విషయాన్ని శిలువను మోస్తూ మరుభూమికేగిన పాదాలు రక్తపు ముద్దగా మారాయన్నటు వంటి అనేక పోలికలతో ఆ పాటను పరిపుష్టం చేశారు మోదుకూరి జాన్సన్‌.

కొన్ని కొన్ని పాటలు ఎన్నాళ్లయినా ప్రజల మనో ఫలకంపై ముద్ర వేసుకుని ఉండడానికి కారణం ఆ పాటల్లో ఆత్మావిష్కరణం. అలాంటి ఆత్మావిష్కరణం జరిగిన పాటే ఈ కదిలిందీ కరుణరథం.
– సంభాషణ: డా. వైజయంతి

Advertisement

పోల్

Advertisement