మేలత్తూరు భాగవత మేళా | melattur bhagavatha mela continues since 500 years | Sakshi
Sakshi News home page

మేలత్తూరు భాగవత మేళా

May 20 2015 12:34 PM | Updated on Sep 3 2017 2:23 AM

మేలత్తూరు భాగవత మేళా

మేలత్తూరు భాగవత మేళా

తమిళనాడులో తంజావూరుకి 18 కి.మీ. దూరంలో ఉన్న ఈ చిన్ని గ్రామం గురించి యేడాది పొడవునా ఏ ఒక్కరూ ప్రస్తావించరు. అదే.. మే మాసం వచ్చిందంటే మాత్రం అందరి నోటా ఆ గ్రామం పేరు తారక మంత్రమే. దేశంలోని ప్రముఖులంతా అక్కడే నడయాడుతారు.

మే నెల... భగభగ మండే ఎండలు... భయం భయం...
మే నెల... వారికి చిటపట చినుకుల జల్లులు.. హాయి హాయి...
మే మాసం... పండుగ మాసం...
వసంత మాసం... చకోర పక్షుల్లా ఎదురుచూసే మాసం...
స్వాతి చినుకు కోసం ఎదురుచూసే ఆల్చిప్పలు వారు...
ఆ గ్రామమే మేలత్తూరు... వారు ఆ గ్రామానికి వచ్చే సందర్శకులు...


తమిళనాడులో తంజావూరుకి 18 కి.మీ. దూరంలో ఉన్న ఈ చిన్ని గ్రామం గురించి యేడాది పొడవునా ఏ ఒక్కరూ ప్రస్తావించరు. అదే.. మే మాసం వచ్చిందంటే మాత్రం అందరి నోటా ఆ గ్రామం పేరు తారక మంత్రమే. దేశంలోని ప్రముఖులంతా అక్కడే నడయాడుతారు. ఇందుకు కారణం ఈ మాసంలో వచ్చే నృసింహ జయంతి సందర్భంగాజరిగే భాగవతమేళా వారి నాట్యోత్సవాలు.
 సుమారు 75 సంవత్సరాలుగా మేలత్తూరు భాగవత మేళా వారు ఇక్కడ అనేక నాటకాలను ప్రదర్శిస్తున్నారు. అంతవరకు నిద్రాణంగా ఉన్న మేలత్తూరు గ్రామం ఈ భాగవత మేళా నాట్యోత్సవాల కోసం ఒక్కసారిగా ఒళ్లు విరుచుకుంటుంది. మేలత్తూరు వెళ్లి, వదరరాజ్ పెరుమాళ్ సన్నిధిలో ఈ నాటకాన్ని చూడటం తీర్థయాత్రకు వెళ్లిన అనుభూతిని కలిగిస్తుందని అక్కడకు వెళ్లినవారు చెబుతారు. దేశం నలు మూలల నుంచి నటులు, కళాకారులు, నాట్యకారులు... అందరూ వారి వారి సొంత ఖర్చులతో మేలత్తూరు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. ఈ నాటక రూపకర్త వెంకటరామశాస్త్రి.  సుమారు 500 సంవత్సరాలుగా భాగవత మేలా వారి ప్రదర్శనలు అందరికీ కనువిందు చేస్తున్నాయి. మేలత్తూరు, సాలియమంగఠం, తంజావూరు ప్రాంతాలలో ఈ ప్రదర్శనలు విస్తృతంగా జరుగుతాయి.

మేలత్తూరు భాగవత మేళా...
వెంకటరామశాస్త్రి అనేక నాట్య సంప్రదాయాలను తండ్రి నుంచి వారసత్వంగా నేర్చుకున్నారు. కావ్యాలు, నాటకాలు, అలంకారాలలో ఈయనకు ఆపారమైన పాండిత్యం ఉంది. వీరు కూర్చిన నాటకాలలో ప్రహ్లాద చరితం, మార్కండేయ చరిత్ర, హరిశ్చంద్ర, ఉషా పరిణయం, రుక్మాంగద, హరిహరలీలా విలాసం, కంస వధ, సీతా పరిణయం, రుక్మిణీ కల్యాణం, ధృవచరిత్ర, సతీ సావిత్రి నాటకాలు ప్రసిద్ధాలు. శాస్త్రిగారు తన రచనలన్నింటినీ మేలత్తూరు గ్రామ దైవమైన వరదరాజుకి అంకితం చేశారు. వీరి ప్రదర్శనలలో ప్రధాన లక్షణం భక్తి.  స్త్రీ పాత్రలను సైతం పురుషులే పోషించడం వీరి ప్రత్యేకత.

నాటకం విషయంలోకి వస్తే, మేలత్తూరు భాగవత మేళా విలక్షణమైనది. పండితపామర భేదం లేకుండా ఈ నాటకాలను రసహృదయంతో ఆస్వాదిస్తారు. నటులు, ప్రేక్షకులు సైతం భక్తులుగా మారి, భగవంతుడైన నరసింహుని ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తారు. విష్ణుమూర్తి ఆరాధనగా భావిస్తారు. అందువల్ల నాటక ప్రదర్శనలో అసభ్యతకు తావుండదు.

ఈ భాగవత మేళా 11 వ శతాబ్దం నుంచి ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. వీరికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఈ ప్రదర్శనను పవిత్రమైన కళగా భావిస్తారు. మన ప్రాచీన భాష అయిన సంస్కృత భాష కారణంగానే ఇది నేటికీ తమిళనాట విస్తృత ప్రాచుర్యంలో ఉంది. వీరు ఈ కళను నేటికీ పవిత్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రహ్లాద నాటకాన్ని తప్పనిసరిగా ప్రదర్శిస్తారు. నరసింహుడిగా పాత్ర పోషించే నటుడు, వృద్ధరూపంలో తయారై ఉన్న నరసింహుని తొడుగును ముఖానికి పెట్టుకుని, ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తారు. ఈ తొడుగును వీరు ఎంతో శక్తిమంతమైనదిగా భావిస్తారు. ఈ తొడుగుకి ఎన్నో అతీంద్రియ శక్తులున్నాయని వీరి విశ్వాసం.
 
భగవంతుని తొడుగే కారణం
గత అరవై సంవత్సరాలుగా మా నాటకాలు నిరాఘాటంగా, నిర్విఘ్నంగా జరగడానికి కారణం భగవంతుని తొడుగే. మా భాగవత మేళా సభ్యులు ఎంత దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ, మే మాసం వస్తోందంటే మాత్రం మేలత్తూరుకు చేరతారు. మా గ్రామమంతా కళకళలాడిపోతూ పండుగ వాతావరణం నెలకొంటుంది. దుబాయ్‌లో పనిచేస్తున్న నేను సైతం, ఈ కార్యక్ర మ నిర్వహణ కోసం మేలత్తూరు గ్రామానికి విచ్చేస్తాను. మేలత్తూరు వెంకటరామశాస్త్రి (1743 - 1809)చే రూపొందించబడిన ఈ నాటకాన్ని మేలత్తూరు గ్రామ దైవమైన శ్రీవరదరాజస్వామి సమక్షంలో, నృసింహ జయంతి వసంతోత్సవం సందర్భంగా ప్రదర్శిస్తాం.
 - నటరాజన్, లీలావతి పాత్రధారి.

మా భాగవత మేళా వినోదం కోసం మాత్రం కాదు. ఇది భగవంతునికి మేము సమర్పించుకునే కానుక. మా నాటక సంఘం ఈ కార్యక్రమాన్ని ఎంతో పవిత్రంగా నిర్వహిస్తుంది. ఈ భాగవత మేళా సంప్రదాయం, అరుదైన దేవాలయ కళ. విలక్షణమైన భక్తి, సంగీతం, నాట్యం, నాటకం ప్రధానంగా ఈ భాగవత మేళా ఒక వినూత్న సంప్రదాయాన్ని నెలకొల్పింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని సంస్కృత నాటక ప్రియులంతా ఒకచోట చేరతారు.
 - వెంకట సుబ్రహ్మణ్యం (గణేశ్), నృసింహ పాత్రధారి


భాగవత మేళా పుట్టుక
చోళుల పరిపాలనా కాలంలో ముఖ్యంగా తంజావూరులో, గేయనాటకాలను నిత్యం దేవాలయాలలో, రాజదర్బారులో ప్రదర్శించేవారు.ప్రభువులు వీరిని పోషించేవారు. తొమ్మిదవ శతాబ్దం తరవాత సంస్కృతభాష వెనుకబడి ప్రాంతీయ భాషలు బలపడుతూండటంతో, ఈ నాటకాలన్నీ ప్రాంతీయ భాషలలోకి అనువదింపబడ్డాయి. వీరి ప్రదర్శన పవ్రితంగా ఉండాలనే ఉద్దేశంతో పురాణగాథలే ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు. ఇందులో ప్రదర్శించే పురుషులను భాగవతులు, భాగవతార్ అని పిలవడం సంప్రదాయంగా తీసుకువచ్చారు. అంతటి పవిత్రత ఉండటం వలనే వీటిని నేటికీ దేవాలయాలలో ప్రదర్శిస్తున్నారు. ఆ విధంగా భాగవతమేళా తమిళనాడులో రూపుదిద్దుకుంది. అయితే ఈ భాగవత మేళాకు మూలం మాత్రం ఆంధ్రప్రదేశం. వీటిలో ప్రముఖంగా చెప్పుకునేది మేలత్తూరు భాగవత మేళా. శతాబ్దాలుగా భారతదేశ నాట్య ప్రపంచం మీద ఈ పల్లె మహానగరమంత ముద్ర వేసింది.
1565లో జరిగిన ముస్లిముల దండయాత్రతో కళాకారులంతా తంజావూరు తరలిపోయారు. రెండవ నాయక రాజయిన అచ్యుతప్ప... ఈ కుటుంబాలకు తంజావూరులోను, చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలలోను ఆశ్రయం కల్పించారు. అచ్యుతప్ప వద్ద మంత్రిగా ఉన్న గోవింద దీక్షితార్ స్వయంగా తెలుగు సంస్కృత భాషలలో పండితుడు. వలస వచ్చిన 510 బ్రాహ్మణ కుటుంబాలకు ఆయన ఆధ్వర్యంలో ఉన్నతపురంలో ఆశ్రయమిచ్చారు. ప్రతి కుటుంబానికీ బావి ఉన్న ఇల్లు, ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి, గోవులను, ఒక రైతు కుటుంబాన్ని బహుమానంగా ఇచ్చారు. అలా అక్కడి  భాగవతులు రాజుల ఆదరణతో చల్లగా కాలం గడిపారు. ఆ ప్రాంతమే నేటి మేలత్తూరుగా విశ్వసిస్తారు.

- డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై

వీరు ఈ కళను తరతరాలుగా చిరస్థాయిగా నిలపడానికి కొత్త కొత్త విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇది ఎంతో ఖర్చుతోకూడిన పని. అందువల్ల దాతల నుంచి విరాళాలు అర్థిస్తున్నారు. దీనికి పన్ను మినహాయింపు కూడా ఉంది. పంపవలసిన చిరునామా.

The secretary,
sri l.n.j.Bhagavata mela
63-64 south st. Melattur 614 301,Thanjavur Dist bydd, cheque or mo. in favour of Sri LNJ Bhagavata mela, melattur
136401 0000 10248, indian overseas bank, code IOBA 000 1364. pan number- AAATB9010H

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement