షో మొదలైంది.. | show started.. | Sakshi
Sakshi News home page

షో మొదలైంది..

May 3 2014 2:19 AM | Updated on Aug 29 2018 8:54 PM

హిందూపురంలో సినీ నటుడు బాలకృష్ణ శుక్రవారం నాటి ‘గృహ ప్రవేశం’ ఎపిసోడ్ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

సాక్షి, అనంతపురం : హిందూపురంలో సినీ నటుడు బాలకృష్ణ శుక్రవారం నాటి ‘గృహ ప్రవేశం’ ఎపిసోడ్ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎలాగైనా ఓటమి నుంచి గట్టెక్కాలని ఆయన చేయని ప్రయత్నమైతే లేదు. నాలుగైదు గ్రూపులుగా ఉన్న పార్టీ నేతలను ఒకతాటిపైకి రప్పించలేక పోవడం ఒకవైపు, బాలకృష్ణ స్థానికేతరుడని, స్థానికేతరులను గెలిపించడం వల్ల తమ ప్రాంతానికి ఒరిగింది ఏమీ లేదని, ఈ సారి ఆ తప్పు చేయమని స్థానికులు కుండబద్దలు కొడుతుండటం మరోవైపు మింగుడు పడటం లేదు.
 
 ఇంటిల్లి పాదీ ప్రచారం నిర్వహిస్తున్నా అనుకున్న జోష్ రావడం లేదని బాలకృష్ణ, పార్టీ శ్రేణులు.. ప్రతి రోజూ రాత్రి విశ్లేషణలు చేస్తున్నారని ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగడానికి కేవలం మూడు రోజుల సమయం వుంది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి స్థానికుడిని అని ముద్ర వేసుకోవడానికి ఆయన శుక్రవారం హైడ్రామా నడిపారు. హడావుడిగా పట్టణంలోని నానెప్ప నగర్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని హంగామా మధ్య గృహ ప్రవేశం చేశారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి హిందూపురం ప్రజలకు అందుబాటులో వుండే విధంగా ఇల్లు తీయాలనే ఆలోచన ఇన్నాళ్లూ ఆయనకు రాలేదా అని ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఆలోచించని విధంగా ఈ సారి నియోజకవర్గ ప్రజలు స్థానికేతరులకు పట్టం కట్ట కూడదని నిర్ణయించుకున్నారు. స్థానికంగా వున్న వారిని మాత్రంమే ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోవాలనే ఆలోచన దాదాపు అందరిలో రావడంతో బాలక్రిష్ణకు ఓటమి భయం చుట్టుకుంది. బాలయ్య గృహ ప్రవేశాన్ని చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు. మరోవైపు నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నా, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన పథకాలకు తిరిగి జీవం పొందాలంటే యువనేత జగన్ ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇచ్చిన మాటకు జగన్ కట్టుబడి వుంటారనే నమ్మకం ప్రజల్లో నాటుకొని పోయింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ ప్రచారంలో భాగంగా మారు మూల ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఆదరిస్తున్నారు.
 
 ఇలాంటి పరిస్థితుల్లో తమకు విజయం దరిదాపుల్లో లేదని భావించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఏదో ఒక విధ ంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ‘గృహ ప్రవేశం’ డ్రామాకు తెర తీశారని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందు ఆయన అద్దె ఇల్లు తీసుకుని.. నేనూ స్థానికుడినే అంటే నమ్మడానికి పిచ్చోళ్లం కామంటున్నారు. కాగా, హిందూపురం టీడీపీలో ఉన్న నాలుగైదు గ్రూపుల నాయకులు తలో ఐడియా ఇస్తూ బాలయ్యను తప్పుదారి పట్టిస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు.
 
 స్థానికుడికే పట్టం
 స్థానికంగా అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకుంటే సామాన్యుడు సైతం వారి వద్దకు వెళ్లి తమ సమస్యలు చెప్పుకుంటాడు. బాలకృష్ణకు పట్టం కడితే హైదరాబాద్‌కు వెళ్లి  సమస్యలు చెప్పుకోవాలి. సమస్యలు చెప్పుకోవడానికి అంత దూరం వెళ్లాలా? ఒక వేళ బాలకృష్ణ గెలిస్తే ఇక్కడుంటాడన్న నమ్మకమేమిటి? అందుకు ఈసారి స్థానికుడికే పట్టం కడతాం.
 - రఘు, కొత్తచామలపల్లి, చిలమత్తూరు మండలం
 
 సమస్యలపై అవగాహన ఉండదు
 నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై స్థానికేతరులకు అవగాహన ఉండదు. గతంలో అలాంటి వారిని గెలిపించి జనం చాలా ఇబ్బందులు పడ్డారు.
 - వెంకటేష్, మధురేపల్లి, చిలమత్తూరు మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement