కిషన్ రెంటికి చెడ్డారా?
తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టుంది బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిస్థితి.
తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టుంది బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిస్థితి. పార్టీలో ఆయన హవా తగ్గిందా... అధిష్టానం కిషన్ రెడ్డిని పట్టించుకోవటం లేదా, చివరకు ఎన్నికల ప్రచార రధంపై కూడా ఆయన బొమ్మకు చోటు దక్కని పరిస్థితి నెలకొంది. టీడీపీతో పొత్తు చర్చల్లో ఆయన మాటకు విలువ లేకుండా పోయింది.
కిషన్ రెడ్డి సలహాను అధిష్టాన పెద్దలు ఏమాత్రం ఆలకించలేదు. చివరికి మనసు పడిన సికింద్రాబాద్ సీటు దక్కకుండా పోవటంతో అంబర్ పేట సీటుతో సరిపెట్టుకోవాల్సిన వచ్చింది. ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఎవరిది పై చేయి? చక్రం తిప్పడంలో కిషన్ రెడ్డి సక్సెస్ అయ్యారా? తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో ఆయన ఆ మేరకు విజయం సాధించారు?
కుదిరితే తెలంగాణకు సీఎం కావాలి....కుదరకపోతే ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావాలి. ఇది టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆలోచన ఇది. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తెలంగాణలో వెంకయ్య నాయుడు కాకుండా కిషన్ రెడ్డి బీజేపీకి కేంద్ర బిందువయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీ వ్యవహారాలు మొత్తం అంతా కిషన్ రెడ్డి చేతికే వస్తాయని ఊహించిన ఆపార్టీ నేతలు ఆయన్ని నమ్ముకోవడం మొదలుపెట్టారు.
అయితే తాజా పరిణామాలతో పరిస్థితి తలకిందులవడంతో కిషన్ రెడ్డిని నమ్ముకున్న వారికి చిప్పే గతైంది. కిషన్‌ను నమ్మి బీజేపీలోకి వచ్చిన సంకినేని వెంకటేశ్వరరావు, పటాన్‌చెరు అంజిరెడ్డి, సికింద్రాబాద్ ఆలుగడ్డ శ్రీనివాస్‌కు మొండి చేయి దక్కింది. పార్టీని నమ్ముకున్న నారాయణపేట నేత రతన్ పాండురెడ్డి, మక్తల్ కొండయ్య కూడా పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
వీరు కిషన్ రెడ్డి వర్గంగా ముద్రపడ్డవారే. ఇక సీనియర్లు ఇంద్రసేనా రెడ్డి, దత్తాత్రేయ, విద్యాసాగర్ రావుకు టికెట్ రాకుండా చేద్దామని ప్రయత్నించిన కిషన్ రెడ్డి తాను కోరుకున్న సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ తెచ్చుకోలేక... తనను నమ్ముకున్న వారికి టికెట్లు ఇప్పించుకోలేక రెంటికి చెడ్డ రేవడిలా మారారు.


