సర్దుకుపోదాం.. ప్లీజ్! | chandra babu naidu calls rajnath singh for alliance | Sakshi
Sakshi News home page

సర్దుకుపోదాం.. ప్లీజ్!

Mar 31 2014 2:37 AM | Updated on Mar 29 2019 9:24 PM

సర్దుకుపోదాం.. ప్లీజ్! - Sakshi

సర్దుకుపోదాం.. ప్లీజ్!

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని.. ఒంటరిగానే బరిలో దిగుతామని బీజేపీ రాష్ట్ర శాఖల నేతలు ప్రకటించటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కంగుతిన్నారు.

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని.. ఒంటరిగానే బరిలో దిగుతామని బీజేపీ రాష్ట్ర శాఖల నేతలు ప్రకటించటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కంగుతిన్నారు. తెలంగాణలో ఉనికిని కాపాడుకోవటానికి ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న చంద్రబాబు.. ఆదివారం ఉదయమే ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీలకు ఫోన్‌చేశారు. ఒంటరి పోరాటానికి సంబంధించి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కోరుతూ పొత్తుపై చర్చలు జరిపినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర నేతలు తమ బలాన్ని మరిచిపోయి ఎక్కువ సీట్లు అడుగుతున్నారని ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. సీట్ల సర్దుబాటుపై పట్టువిడుపులకు తాము సిద్ధమని విన్నవించినట్లు చెప్తున్నారు.
 
 అయితే.. సోమవారం ఢిల్లీలో పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో పొత్తుపై చర్చించి స్పష్టమైన ప్రకటన చేస్తామని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ బదులిచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత బీజేపీ అగ్రనేతలు ఇద్దరూ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడుకు ఫోన్ చేసి.. టీడీపీతో పొత్తుపై పట్టు విడుపులు ఉండేలా చూడాలని సూచించినట్లు తెలిసింది. అయితే పొత్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ, సీమాంధ్ర బీజేపీ శాఖలు రెండూ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. ఆదివారం రాత్రి వరకు ఇదే కసరత్తు సాగింది.
 
 పొత్తులు ఉంటాయన్న చంద్రబాబు..
 
 టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ఆదివారం రెండు విడతలుగా జరిగింది. రెండు ప్రాంతాలకు రెండు మేనిఫెస్టోలను రూపొందించే క్రమంలో చంద్రబాబు ఉదయం, రాత్రి రెండు పర్యాయాలు పొలిట్‌బ్యూరోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. బీజేపీతో పొత్తు ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి తెలంగాణలో బలం పెరిగినా, స్వతంత్రంగా గెలిచే పరిస్థితి లేదని, పొత్తు రెండు పార్టీలకూ అవసరమేనని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. పొత్తులో భాగంగా తెలంగాణలో 40 అసెంబ్లీ సీట్లు, హైదరాబాద్‌తో పాటు 8 పార్లమెంటు సీట్లు బీజేపీకి ఇవ్వటానికి అభ్యంతరం లేదని చివరిమాటగా చెప్పానని ఆయన వెల్లడించినట్లు చెప్తున్నారు. ఇంతకు మించి వారికి సీట్లు ఇవ్వడం కుదరదని, ఆయా సీట్లలో టీడీపీ నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని బాబు సూచించినట్లు సమాచారం. సీమాంధ్రలో 10 అసెంబ్లీ, మూడు లోక్‌సభ సీట్లతోనే సరిపుచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన మాటలను బట్టి తెలిసిందని టీడీపీ నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement