శిశువు మృతికి ఎలుకలే కారణం కాదు!

శిశువు మృతికి ఎలుకలే కారణం కాదు! - Sakshi

  • పుట్టుకతోనే అసాధారణ లోపం ఉంది

  • ఎలుకల వల్లే మృతిచెందారని అనుకోవడం లేదు

  • 23వ తేదీన ఎడమ చేతికి ఎలుకలు కొరికిన గాట్లు గుర్తింపు

  • 26వ తేదీన తిరిగి ఎలుకలు ఛాతీపై దాడిచేసినట్టు వెల్లడి

  • ప్రభుత్వానికి గుంటూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ నివేదిక

  • సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరికి మృతి చెందిన శిశువు కేసు నుంచి బయటపడేందుకు ఇటు వైద్యసిబ్బంది, అటు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా.వేణుగోపాల్‌రావు ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. ఈనెల 17వ తేదీన విజయవాడ నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. కన్‌జెనిటల్ అనామిలీస్ (పుట్టుకతో వచ్చే అసాధారణ లోపం)తో చేరిన ఈ శిశువును 18వ తేదీన సర్జరీ వార్డుకు తరలించామని, 20వ తేదీన శస్త్ర చికిత్సకు సిద్ధం చేశామని, వెంటిలేటర్‌పై ఉన్న ఆ శిశువు పరిస్థితి అప్పటికే ప్రమాదకరంగా ఉందని పేర్కొన్నారు.


    ఈనెల 23న శిశువు ఎడమ చేతికి ఎలుకల గాటు పడి ఉందని, ఈ విషయాన్ని ఇన్‌చార్జీ, ప్రొఫెసర్ డా.భాస్కర్‌రావుకు సమాచారమిచ్చామని కూడా నివేదికలో పొందుపరిచారు. అనంతరం వార్డును శుభ్రపరిచామని, అయినా దురదృష్టవశాత్తు ఈనెల 26వ తేదీ తెల్లవారుజామున 4-5గంటల మధ్యలో ఎలుకలు తిరిగి శిశువు ఛాతిపై దాడిచేశాయని పేర్కొన్నారు. ఓవైపు ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని చెబుతూనే మరోవైపు కన్‌జెనిటల్ అనామిలీస్‌తో వచ్చిన ఈ బిడ్డ మృతికి ఎలుకల గాట్లే కాకపోయి ఉండచ్చునని తెలిపారు. బుధవారం సాయంత్రం అంటే 26వ తేదీ రాత్రి బిడ్డ మృతి చెంది తీవ్రంగా వివాదంగా మారడం, అనంతరం మంత్రులు కామినేని శ్రీనివాస్, పి. నారాయణ తదితరులు ఆస్పత్రిని సందర్శించిన తర్వాత ఎలుకల కథ కంచికి చేరేలా నివేదిక మార్చినట్టు స్పష్టమవుతోంది.



    రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవడం, వివిధ మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడం, దీన్ని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించిన తరుణంలో నివేదికను బలహీనపరిచేలా చేసేటట్టు నాయకులే ఒత్తిడి తెచ్చినట్టు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే తెలివిగా ఆర్‌ఎంఓ తదితర కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వార్డులో మరో 20 మంది చిన్నారులు ఉన్నా ఎవరికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని, ఈ శిశువు కూడా ఎలుక కారణంగా మృతి చెంది ఉండదని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు శిశువు తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందే మృతికి కారణమని గొడవ చేశారని వెల్లడించారు. బాక్స్ పీడియాట్రిక్ వార్డు డ్యూటీలో ఉన్న సిబ్బంది వీరే.. డా.సీహెచ్ భాస్కర్ రావు, ప్రొఫెసర్, ఇన్‌చార్జీ హెచ్‌ఓడీ డా.ఎన్‌జైపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సీహెచ్ విజయలక్ష్మి, హెడ్‌నర్స్ ఎం.ఉషా జ్యోతి, స్టాఫ్‌నర్స్ వి.విజయ నిర్మల, స్టాఫ్‌నర్స్ జి.జయజ్యోతి కుమారి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top