హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి ఆగంతకుడి చొరబాటు | Unidentified person Infiltration into Mahesh Babu's House | Sakshi
Sakshi News home page

హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి ఆగంతకుడి చొరబాటు

Sep 27 2013 2:31 AM | Updated on Sep 15 2018 8:43 PM

హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి ఆగంతకుడి చొరబాటు - Sakshi

హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి ఆగంతకుడి చొరబాటు

ప్రముఖ సినీ హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి మంకీ క్యాప్ ధరించిన ఆగంతకుడు చొరబడి దొంగతనానికి యత్నించాడు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రముఖ సినీ హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి మంకీ క్యాప్ ధరించిన ఆగంతకుడు చొరబడి దొంగతనానికి యత్నించాడు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 81లో హీరో మహేశ్‌బాబు నివాసం ఉంది. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మహేశ్‌బాబు ఇంటి ప్రహరీగోడ దూకిన ఆగంతకుడు సెక్యూరిటీ కళ్లుగప్పి ఇంటి వెనకాల కిటికీ అద్దాలు పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. నేరుగా మహేశ్ నిద్రిస్తున్న బెడ్‌రూమ్ వద్దకు చేరుకొని దొంగతనానికి యత్నించాడు. అలికిడి విన్న పని మనుషులు ఉలిక్కిపడి లేచారు. ఎదురుగా మంకీ క్యాప్ ధరించిన వ్యక్తి నిలబడటంతో భయంతో అరిచారు.
 
 దీంతో సెక్యూరిటీగార్డ్‌లు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రధాన ద్వారం వద్దకు వచ్చి ఆగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే అతడు వెనక దారి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మహేశ్‌బాబు బయటికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. సెక్యూరిటీ గార్డ్‌ల ద్వారా జూబ్లీహిల్స్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. పశ్చిమ మండలం డీసీపీ కె. సత్యనారాయణ, బంజారాహిల్స్ ఏసీపీ శంకర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని, మహేశ్‌బాబుతో మాట్లాడి సంఘటనలను తెలుసుకున్నారు. వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. కిటీకీపై పడ్డ వేలిముద్రలను సేకరించారు. ఐపీసీ సెక్షన్ 457, 511 కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement