యథేచ్ఛగా హత్యాకాండ | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా హత్యాకాండ

Published Tue, Aug 19 2014 1:25 AM

యథేచ్ఛగా హత్యాకాండ - Sakshi

చంద్రబాబు సీఎం అయిన 3 నెలల్లోనే టీడీపీ చేతిలో..
11 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తల హత్య


విపక్షం లేకుండాచేసే యత్నాలు  అధికారపక్షం కొమ్ము కాస్తున్న పోలీసులు
వైఎస్సార్‌సీపీ నేతలకు రక్షణ కరువు  టీడీపీ కార్యకర్తలపై కేసులు లేవు
ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరిలో ఏడుగురి హత్య
అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, విజయనగరం జిల్లాల్లో నలుగురి హత్య
తాజాగా నరసరావుపేట నియోజకవర్గంలో ఆసుపత్రివద్ద దాడి

 
రాష్ట్రంలో అధికార పక్షం బరితెగించింది... ప్రతిపక్ష పార్టీపై కక్ష పూనింది... ప్రశ్నించేవారే లేకుండా చేయాలనుకుంది... రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతోంది... అధికారపార్టీ నేతలు గ్రామస్థాయిలో కక్షలను ఎగదోస్తుండగా, దాడి చేసినవారిపై కేసులు పెట్టకుండా పోలీసులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. దీంతో అధికారపార్టీ అరాచకాలకు, ఆగడాలకు అడ్డూఆపూ లేకుండా పోయింది. గత మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 11 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను హత్యచేశారు. పోలీసుల దాష్టీకానికి మరో కార్యకర్త గుండెపగిలి మరణించాడు. అత్యధికంగా ప్రకాశంజిల్లాలో ముగ్గురిని కిరాతకంగా చంపేశారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు చొప్పున, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరినీ టీడీపీ శ్రేణులు పొట్టన పెట్టుకున్నాయి.
 
 సాక్షి నెట్‌వర్క్

 తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన ఈ మూడు నెలల్లోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన 11 మంది కార్యకర్తలు, స్థానిక నాయకుల్ని టీడీపీ శ్రేణులు పొట్టనబెట్టుకున్నాయి. మరో సంఘటనలో అధికారానికి వత్తాసు పలికిన పోలీసుల దాష్టీకానికి మరో కార్యకర్త గుండెపగిలి మరణించాడు. ఎన్నికలకు ముందే టీడీపీ శ్రేణులు జరిపిన దాడిలో గాయపడిన మరో కార్యకర్త... ఈ మధ్యే మరణించాడు. ఈ హత్యలది ఒక్కో చోట ఒకో తీరు. ఫలితం... నిండు కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి.  వారిపై ఆధారపడ్డవారు దిక్కులేని వాళ్లయ్యారు. ఆ సంఘటనల తీరును ఒక్కసారి చూస్తే...

గుంటూరు జిల్లా వినుకొండ మండలం నీలగంగవరం గ్రామానికి చెందిన రావులపల్లి పెదమునయ్యను (40) మే 21న దాడిచేసి హతమార్చారు. టీడీపీకి చెందిన రావెల శ్రీనివాసరావుతోపాటు మరో ముగ్గురు స్థానిక నాయకులు  ఆయనపై కర్రలతో దాడిచేశారు. అయినా తను బతికాడని భావించారో ఏమో... మరుసటిరోజు మధ్యాహ్నం మరోసారి కర్రలతో దాడిచేసి ప్రాణం తీశారు. వేమూరు మండలంలోని పెరవలిపాలెం గ్రామంలో ఈ ఏడాది మే నెలలో జరిగిన ఇరువర్గాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పెరవలి ప్రభాకరరావు (53) మృతిచెందారు. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న వివాదాలు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన పుసులూరి సాంబశివరావు, సర్పంచ్‌గా పోటీ చేసిన ఓడిన పెరవలి ప్రభాకరరావు వర్గీయుల మధ్య మే నెల 26వ తేదీన దాడికి దారితీశాయి. ఈ దాడిలో ప్రభాకరరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ జూన్ 9వ తేదీన ఆయన మృతిచెందారు.

ప్రకాశం జిల్లాలో...

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పెద అలవాలపాడులో ఒక రేషన్ దుకాణం వివాదంతో ఎలాంటి సంబంధంలేని వైఎస్సార్‌సీపీ నేత గోగాడి సింగయ్య (48)పై కేసుపెట్టారు. తనపై ఎందుకు కేసు పెట్టారని అడిగేందుకు వెళ్లిన సింగయ్యపై జూన్ 12న తీవ్రంగా కర్రలతో, రాళ్లతో కొట్టి గాయపరచగా ఆయన చికిత్స పొందుతూ మర్నాడు మృతిచెందారు. దాడిలో సింగయ్య కుమారుడు సురేష్, అక్క కంచర్ల తిరుపతమ్మ తీవ్రంగా గాయపడ్డారు.

టీడీపీ హత్యలకు పోలీసుల వత్తాసు

 తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల దాడుల్లో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బలయ్యారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు మే 7న సీతానగరం మండలం ఇనగంటివారి పేటలో టీడీపీ నాయకుడు, ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యుడు మొగలపు వెంకటమోహన్ వైఎస్సార్‌సీపీ కార్యకర్త నెర్ల దశయ్య (75) గుండెలపై కాలితో తన్నాడు. దీంతో దశయ్య మరణించినప్పటికీ పోలీసులు వెంకటమోహన్‌పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి అధికార పార్టీకి కొమ్ముకాశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెలువడిన తర్వాత గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆ పార్టీకి చెందిన గుర్రం చినవీరబాబు, యాడాల శివ, గారబోయిన పుష్ప, గుర్రం శ్రీను మూకుమ్మడిగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త వేపూరి వెంకటేశ్వరరావుపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావు నాలుగు రోజులు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం 11వ తేదీన చనిపోయాడు. ఇక కృష్ణాజిల్లాలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండదండలతో చెలరేగిన తెలుగు తమ్ముళ్ల దాష్టీకాలకు ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బలయ్యారు. నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నేత ఆలోకం కృష్ణారావు (59) ఇంటిపై ఆగస్టు పదో తేదీ రాత్రి తెలుగు యువత నాయకులు దాడిచేశారు. ఆరోజు రాత్రి 8:30 గంటల సమయంలో తెలుగు తమ్ముళ్లు వైఎస్సార్‌సీపీ కార్యకర్త గుదే సెల్వరాజుపై దాడిచేసి తల పగులగొట్టారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సెల్వరాజును అడ్డుకున్నారు.

గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని, తమ పార్టీ నాయకులకు భద్రత కల్పించాలని సర్పంచి గుదే రంగారావు ఫోన్ చేసినా కంచికచర్ల ఎస్‌ఐ దుర్గాప్రసాద్ పట్టించుకోలేదు. పోలీసులు తమకే కొమ్ముకాయడంతో తెలుగు తమ్ముళ్లు మరింత రెచ్చిపోయారు. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న కృష్ణారావును అర్ధరాత్రి రోడ్డుపైకి లాక్కొచ్చి, రెక్కలు విరగదీసి, ఇనుపరాడ్లు, కర్రలతో దారుణంగా కొట్టి చంపారు. ఆ తర్వాత మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపై కూడా దాడిచేశారు. అయితే ఇంటి గేట్‌కు తాళం వేసి ఉండటంతో ఆయన తప్పించుకోగలిగారు. కృష్ణారావు హత్య గురించి రంగారావు సమాచారం అందించినా పోలీసులు స్పందించలేదు. గొట్టుముక్కలలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ వారిపై వందసార్లు దాడులు పాల్పడినా పోలీసులు కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు చేయడం, ఎస్‌ఐ వైఖరిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం పోలీసుల ధోరణికి అద్దం పడుతుంది. అవనిగడ్డ నియోజకవర్గంలో మరింత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అవనిగడ్డ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గెలుపొందారు. దీంతో ఆయన అనుచరులు మే 16న కోడూరు మండలం వి.కొత్తపల్లి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్త రేపల్లె సురేష్ (30) ఇంటిముందు బాణసంచా కాల్చారు. ఇంట్లో పిల్లలున్నారు బాణసంచా కాల్చవద్దని సురేష్ అడ్డుచెప్పారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు సురేష్ తలపై బాంబు పెట్టి కాల్చడంతో సురేష్ తలపగిలి అక్కడికక్కడే మృతిచెందారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల పట్టణానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త బురిడి సన్యాసిరావు (32)ను జూన్ 19న చంపావతి నదిలోని మొయిద కాజ్‌వేవద్ద దారుణంగా హత్యచేశారు. కానీ పోలీసులు అనుమానితులను ఒకసారి స్టేషన్‌కు పిలిపించి వదిలేశారు.

రాయలసీమలో ముగ్గురి హత్య

 రాయలసీమలో అత్యధిక స్థానాల్లో పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నికల అనంతరం హత్యాకాండకు తెరలేపారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం యల్లనూర.ులో వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ ఎంపీటీసీ సూర.్యప్రకాశం శెట్టిని(58) జేసీ వర్గీయులు జూలై3 అర్ధరాత్రి సమయంలో దార.ుణంగా హత్య చేశార.ు. గ్రామంలో బ్రాందీషాపుకు ఇల్లు అద్దెకు ఇవ్వడమే ఇతను చేసిన నేరం. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచెర్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త బలిజ బంగారురెడ్డి (70)ని అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మే 21న దారుణంగా హత్య చేసి డోన్ పట్టణ శివార్లలోని పాతబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద పడేశారు. బంగారురెడ్డి కృషితో గ్రామంలో వైఎస్సార్‌సీపీకి 96 ఓట్లు మెజారిటీ రావడమే ఈ హత్యకు కారణం. ఈ హత్యవెనుక రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కేఈ ప్రతాప్ హస్తం ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఇక వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నాయకులు కిరాయి హంతకులను పురమాయించారు. మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం మడూరు గ్రామ మాజీ సర్పంచ్ మర్రిబోయిన ఓబులేసును దారుణంగా హత్య చేశారు. గ్రామంలో అన్నింటికి అడ్డంకులుగా మారారనే కారణంతో టీడీపీ నేతలు తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన నలుగురు కిరాయిహంతకులను ఇందుకు ఉపయోగించినట్లు తెలుస్తోంది.
 
ఎన్నికల ముందు నుంచే...

ప్రకాశంజిల్లా గిద్దలూరు పోలీసుల అమానుష ప్రవర్తనతో వైఎస్సార్‌సీపీ నేత, ప్రాధమిక సహకార పరపతి సంఘం అధ్యక్షులు అయిన వైజా భాస్కరరెడ్డి గుండెపోటుతో మరణించారు. ఒక అపార్టుమెంట్‌లో పార్కింగ్‌కు సంబంధించి జూన్ 30వ తేదీ హీరోహోండా షోరూం యజమాని ఈమని సుబ్బారావుకు, డాక్టర్ హరనాధరెడ్డికి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు రాత్రిపూట ఇంటికి వచ్చి హరనాధరెడ్డిని అరెస్టుచేసి తీసుకువెళ్ళారు. విషయం తెలుసుకున్న అపార్టుమెంట్ ఓనర్, వైఎస్సార్‌సీపీ నాయకులైన వైజా భాస్కరరెడ్డి స్టేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా అతనిని నెట్టివేశాడు. పోలీసులు నెట్టివేయడం అవమానంగా భావించిన ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. మరోవైపు ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేశారన్న కోపంతో టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడిలో మర్రిపూడి మండలం కెళ్లంపల్లి పంచాయతీ అగ్రహారం గ్రామానికి చెందిన తేలుకుట్ల వెంకయ్య (65) కన్నుమూశారు.
 
 తాజాగా సోమవారం గుంటూరుజిల్లా నరసరావుపేట మండటం యల్లమంద గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. గడచిన ఎన్నికల్లో రిగ్గింగ్‌ను అడ్డుకున్నారనే కక్షతో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ముప్పాళ్ళ కృష్ణారావు, ముప్పాళ్ళ లక్ష్మయ్య, చల్లా వెంకటేశ్వర్లు తమ బంధువైన ములసా వెంకటేశ్వర్లు ఇంట్లో జరిగే శుభకార్యానికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఉప్పుటూరి శంకరయ్య అనే టీడీపీ నాయకుని ఇంటి వద్దకు వెళ్ళగానే దాడి చేశారు. శంకరయ్యతో పాటు పాములపాటి వాసు, కడియాల శ్రీను, మానుకొండ నిరంజన్, మానుకొండ రామకృష్ణ, చుండూరి రాజు, మానుకొండ కోటయ్య, కొల్లా కిషోర్‌లు మూకుమ్మడిగా వారిని అడ్డుకుని పరుషపదజాలంతో దూషించారు. మారణాయుధాలతో దాడి చేశారు. కృష్ణారావు కాలిపై గొడ్డలితో నరికారు. ఇనుపరాడ్లతో ఇష్టారాజ్యంగా కొట్టారు. దాడిలో కృష్ణారావుకు తీవ్రగాయాలు కాగా ముప్పాళ్ల లక్ష్మయ్య, చల్లా వెంకటేశ్వర్లుకు స్వల్పగాయాలయ్యాయి.
 

టీడీపీ దాడుల్లో హతమైన వారు వీరే..

 1. పెద మునయ్య (వినుకొండ) గుంటూరు
 2. పెరవలి ప్రభాకరరావు (వేమూరు) గుంటూరు
 3. గోగాడి సింగయ్య (కనిగిరి) ప్రకాశం
 4. నెర్ల దశయ్య (సీతానగరం) తూర్పు గోదావరి
 5. వేపూరి వెంకటేశ్వరరావు (గోకవరం) తూ.గో.
 6. ఆలోకం కృష్ణారావు (కంచికచర్ల) కృష్ణా
 7. రేపల్లె సురేశ్ (అవనిగడ్డ) కృష్ణా
 8. బురిడె సన్యాసిరావు (నెల్లిమర్ల) విజయనగరం
 9. బలిజ బంగారు రెడ్డి (బేతంచెర్ల) కర్నూలు
 10. సూర్య ప్రకాశం శెట్టి (శింగనమల) అనంతపురం
 11. మర్రిబోయిన ఓబులేసు (చాపాడు) కడప
 12. తేలుకుట్ల వెంకయ్య (మర్రిపూడి) ప్రకాశం
 13. వైజా భాస్కరరెడ్డి (గిద్దలూరు) ప్రకాశం
  వెంకయ్య ఎన్నికలకు ముందు టీడీపీ దాడిలో గాయపడి ఇటీవల మరణించారు. భాస్కరరెడ్డి పోలీసులు చేసిన అవమానాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందారు.
 
 

Advertisement
Advertisement