సర్వేలో తెలంగాణకు చెందినవారమేనని చెప్పండి
1956 తర్వాత హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారంతా తెలంగాణకు చెందినవారమేనంటూ ఈ నెల 19న జరిగే కుటుంబ సర్వేలో స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పిలుపునిచ్చారు.
* హైదరాబాద్‌లో స్థిరపడినవారికి మంత్రి రావెల పిలుపు
* 19న సర్వే ఫార్మాట్‌లోనూ ఇదే విషయాన్ని పొందుపరచాలని సూచన
* కేసీఆర్‌ది ప్రాంతీయ తీవ్రవాదమంటూ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: 1956 తర్వాత హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారంతా తెలంగాణకు చెందినవారమేనంటూ ఈ నెల 19న జరిగే కుటుంబ సర్వేలో స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పిలుపునిచ్చారు. సర్వే ఫార్మాట్‌లో ‘ఏ రాష్ట్రం నుంచి వచ్చారనే’ కాలమ్‌లోనూ ఇదే విషయాన్ని పొందుపరచాలని సూచించారు. ఇలా చేయకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
రాజధాని కావడంతో హైదరాబాద్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఎంతోమంది స్థిరపడ్డారని తెలిపారు. 1956 తర్వాత వచ్చిన గద్దర్ లాంటివారు ప్రత్యేక తెలంగాణ సాధనకు ఎంతోకృషి చేశారన్నారు. ఇలాంటి వారిని కూడా స్థానికేతరులనడం ఆక్షేపణీయమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుపై సందిగ్ధత తొలగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు సమస్యను జటిలం చేస్తున్నాయని విమర్శించారు.
అభివృద్ధికి పర్యాయపదమైన చంద్రబాబును చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలని, అంతేతప్ప దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడండంటూ మాట్లాడటం తగదని అన్నారు. కేసీఆర్‌ది ప్రాంతీయ తీవ్రవాదమని, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని అన్నారు.
గిరిజనులకోసం కొత్త పాలసీలు, పథకాలు..
ఏపీ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రపంచ గిరిజన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోందని రావెల తెలిపారు. శనివారం విశాఖ విమానాశ్రయం ఎదురుగా ఉన్న కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో ఈ వేడుకలు నిర్వహించనున్నామని చెప్పారు.


