రాజధాని ఎంపిక కోసం మంత్రి వర్గ ఉపసంఘం

రాజధాని ఎంపిక కోసం  మంత్రి వర్గ ఉపసంఘం - Sakshi


హైదరాబాద్: రాజధానిపై మంత్రి వర్గ ఉపసంఘం వేయాలని ఏపి మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 5 గంటలపాటు జరిగిన సమావేశం ముగిసింది. .రాజధాని ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే అప్పగించారు.  రాజధానిపై రేపు శాసనసభలో  ముఖ్యమంత్రి  ఒక  ప్రకటన చేసే అవకాశం ఉంది.  రాజధాని ఎక్కడ అనే అంశంపైనే  ఈ సమావేశంలో  సుదీర్ఘంగా చర్చించారు. ఇతర అంశాలు చాలా ఉన్నప్పటికీ  ప్రధానంగా చర్చ ఈ అంశపైనే జరిగింది.  ప్రభుత్వం ముందు నుంచి చెపుతున్నదానికి భిన్నంగా శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రభుత్వంలోని ముఖ్యులు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతుందని చెబుతూ వచ్చారు. కమిటీ అక్కడ రాజధాని ఏర్పాటు చేయడం మంచిది కాదని తెలిపింది. అయినప్పటికీ చంద్రబాబు అక్కడే రాజధాని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తే మంగళగిరి లేదా న్యూజివీడులలో రాజధాని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.



రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై  ఒక నిర్ణయం తీసుకోవాలన్న దృఢమైన అభిప్రాయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ అంశం చాలా సున్నితమైనది. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో మంత్రి మండలి ఉంది. తమ నిర్ణయంతో జనంలో వ్యతిరేకత రాకుండా ఉండేవిధంగా ఏ చర్యలు తీసుకోవాలని మంత్రులతో చర్చించారు. తాత్కాలిక రాజధాని విజయవాడలో ఏర్పాటు చేసి, నిదానంగా అలవాటుపడిన తరువాత దానిని శాశ్విత రాజధాని చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.



రాజధాని విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలని  మంత్రులు చంద్రబాబుకు సూచించారు. మంత్రులందరూ విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పాటు చేయాలన్న అభిప్రాయంతో ఉన్నారు. అసెంబ్లీ, సచివాలయం, వివిధ శాఖల కార్యాలయాలు, హైకోర్టు ఒకే చోట ఏర్పాటు చేయాలని  మంత్రులు అభిప్రాయపడ్డారు. భూముల సేకరణ, ధరలు, వ్యవసాయ భూములు, సేకరణకు అవకాశం ఉన్న భూములు, ఇతర అంశాల పరిశీలనకు  మంత్రి వర్గ ఉపసంఘం వేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాజధాని విషయంలో మంత్రులు అందరూ ఒకే మాట చెప్పాలని చంద్రబాబు మంత్రులకు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top