సానిమా మీర్జా
ప్రపంచ టెన్నిస్ రంగంలో భారత్‌కు సుస్థిర స్థానాన్ని సంపాదించిపెట్టిన సానియా మీర్జా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రపంచ టెన్నిస్ రంగంలో భారత్‌కు సుస్థిర స్థానాన్ని సంపాదించిపెట్టిన సానియా మీర్జా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చినట్లు తెలుస్తోంది. టెన్నీస్ క్రీడలో అనేక విజయాలతో పాటు గ్లామర్ రంగంలోనూ ఓ వెలుగు వెలుగుతున్న ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జాకు ఆమె భర్త పాక్ క్రికెట్ క్రీడాకారుడు షోయబ్ మాలిక్కు మధ్య దూరం పెరిగిందని సమాచారం. తన ఆటతోపాటు అందంతో సానియా అభిమానులను ఆకట్టుకుంది. భారత టెన్నిస్‌లో సంచలనం సృష్టించిన సానియా మీర్జా పెళ్లి విషయంలో కూడా సంచలనం సృష్టించింది. తొలుత 2009లో బాల్య మిత్రుడు సోహ్రాబ్ మీర్జాతో సానియాకు నిశ్చితార్ధం అయింది. కారణాలు ఏవైనా ఆ నిశ్చితార్దాన్ని రద్దు చేసుకుంది. ఆ తరువాత పాకిస్థాన్‌కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఈ పెళ్లి విషయమై పలు విమర్శలు కూడా వచ్చాయి. వాటిని లెక్క చేయకుండా 2010 ఏప్రిల్ 12న షోయబ్ను పెళ్లి చేసుకుంది.
ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారిద్దరి మధ్య ఆ తరువాత విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. సానియా భర్తకు దూరంగా ఉంటున్నారని వినికిడి. పెళ్లి తరువాత వారిద్దరూ కొంతకాలం దుబాయిలో స్ధిరపడ్డారు. సానియా ప్రస్తుతం ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. షోయబ్కు దూరంగా, ఒంటరిగా ఉండటంతో ఊహాగానాలకు ఆస్కారం ఏర్పడింది.
అంతర్జాతీయ టెన్నిస్‌లో పతకాలు సాధించి భారతీయ మహిళ సత్తా చాటింది. గ్రాండ్‌స్లామ్‌ను సాధించిన భారతీయ మహిళగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించింది. ఇప్పుడు ఈ రకంగా వార్తలకెక్కడం విచారకరం.


