బాబుది వన్ సైడ్ లవ్వేనా?
పదిహేనేళ్ల తర్వాత మళ్లీ కమలంపై మనసు పారేసుకున్న చంద్రబాబు నాయుడు ఆపార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతున్నారు.
పదిహేనేళ్ల తర్వాత మళ్లీ కమలంపై మనసు పారేసుకున్న చంద్రబాబు నాయుడు ఆపార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతున్నారు. ప్రేమిస్తే... గీమిస్తే.. బీజేపీనే ప్రేమించాలని ఆయన మనస్ఫూర్తిగా నిర్ణయం తీసేసుకున్నారని భోగట్టా. అయితే కమలనాథులు మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆపార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు గురువారమిక్కడ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పొత్తులపై ఇప్పటివరకూ ఏ పార్టీ నుంచి ప్రతిపాదనలు రాలేదని, తెలుగుదేశం, బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయని వస్తున్న కథనాలన్నీ ఊహాజనితమైనవేనని ఆయన కొట్టిపారేశారు. దీంతో చంబ్రబాబు లవ్ వన్సైడేనా అని అనుమానం కలుగుతోంది.
ఓ వైపు సీమాంధ్ర ఉద్యమం ఉధృతస్థాయిలో జరుగుతుంటే... కొద్ది రోజుల క్రితం హడావుడిగా హస్తినకు వెళ్లిన చంద్రబాబు కమలనాథులతో మంతనాలు జరిపారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేస్తే బాగుంటుందని ఆఫర్ కూడా ఇచ్చారు. అయితే అందుకు బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ నుంచి ఎలాంటి హామీ లభించలేదని సమాచారం. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రలో, ఆత్మగౌరవ యాత్ర చేపట్టి తెలంగాణల్లో చంద్రబాబు జీరో అయ్యారు. వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ ఎక్కేందుకు ఏ పార్టీ ముందుకు రావట్లేదు. ఒకప్పటి నేస్తాలు కామ్రేడ్స్ కూడా చంద్రబాబుతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపటం లేదు. దాంతో ఏకాకిగా మిగిలిన బాబు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారు. కనీసం బీజేపీతోనైనా కలిసి ఎన్నికలకు వెళ్తే ఎంతో కొంత లాభపడవచ్చునని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
దాంతో మోడీ మానియాను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధిపొందాలని చంద్రబాబు కమల నామ జపం చేస్తున్నారు. కాగా మోడీ హైదరాబాద్ సభలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్పై ప్రసంశల జల్లు కురిపించారు. దాంతో బీజేపీ, టీడీపీల పొత్తుపై మీడియా హైలైట్ చేసింది. అయితే వాటిని బాబు సమర్థించలేదు... వ్యతిరేకించలేదు. మౌనం అర్ధాంగీకారం అన్నట్లు ఉండిపోయారు. అయితే బాబు వన్ సైడ్ లవ్ను కమలనాథులు ఓరకంట గమనిస్తూనే తమ అభిప్రాయం చెప్పకుండా చిరునవ్వులు చిందిస్తున్నారు. మరి రాబోయే కాలంలోనే చంద్రబాబు లవ్ ఫలిస్తుందో లేదో చూడాలి మరి. మరోవైపు తెలుగు తమ్ముళ్లు మాత్రం బీజేపీతో పొత్తు పార్టీ కొంప ముంచుతుందని మొత్తుకుంటున్నారు.


